భారత్ తరపున ఎప్పుడూ ఆడలేదు, కానీ ప్రపంచ కప్ అందించబోతున్నాడు.. ఎవరీ అమోల్ ముజుందార్?
Who is Amol Muzumdar: అమోల్ ముజుందార్ మార్గదర్శకత్వంలో భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరింది. భారత్ ఇప్పుడు చరిత్ర సృష్టించడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. ఎవరీ అమోల్ ముజుందార్?

ఐసీసీ ట్రోఫీకి అడుగు దూరంలో భారత్
భారత మహిళా క్రికెట్ జట్టు ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్ 2025 ఫైనల్‌లో అడుగుపెట్టింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. జెమిమా రోడ్రిగ్స్ (127* పరుగులు), హర్మన్‌ప్రీత్ కౌర్ (89 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్ చరిత్రలోనే అతిపెద్ద రన్‌చేజ్ సాధించింది.
భారత జట్టు ఇప్పుడు ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఆ జట్టు మొదటి సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 125 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, భారత జట్టుకు ఎన్నడూ ఆడని కోచ్ అమోల్ ముజుందార్.. ఇప్పుడు మహిళా వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీని టీమిండియాకు అందించడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.
భారత జట్టుకు ఆడని కోచ్ అమోల్ ముజుందార్
అమోల్ ముజుందార్ అనే పేరు భారత క్రికెట్‌లో ఇప్పటివకు అంతగా వినిపించలేదు. కానీ, ఇప్పుడు ఆయన పేరు యావత్ క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతోంది. దేశం కోసం ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని ఈ మాజీ బ్యాట్స్‌మన్ ఇప్పుడు భారత మహిళా జట్టును ప్రపంచకప్ విజయం వైపు తీసుకెళ్తున్నారు.
2023 అక్టోబర్‌లో అమోల్ ముజుందార్ మహిళా జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో జట్టులో స్పష్టమైన దిశా నిర్దేశం లేకుండా, కోచింగ్ మార్పులు, ఎంపికలపై అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆయన నియామకంపై కూడా విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఆయన ఎప్పుడూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు.
కానీ అమోల్ ముజుందార్ కు గల అనుభవం చాలా విలువైనది. రెండు దశాబ్దాల ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఆయన 11,000 పైగా పరుగులు చేసి, ముంబై క్రికెట్ చరిత్రలో అత్యంత విశ్వసనీయ బ్యాట్స్‌మన్‌లలో ఒకరిగా నిలిచారు.
మహారాష్ట్రలో నవంబర్ 11, 1974లో జన్మించిన అమోల్ ముజుందార్.. క్రికెట్ ప్రస్థానాన్ని రమాకాంత్ అచ్రేకర్ శిక్షణలో ప్రారంభించాడు. కుడిచేతి బ్యాట్స్‌మన్‌గా 1993-94 రంజీ సీజన్‌లో ముంబై తరఫున హర్యానాపై అరంగేట్రం చేసి 260 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. దేశవాళీ క్రికెట్‌లో 171 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 11,167 పరుగులు, 30 సెంచరీలు, 60 హాఫ్ సెంచరీలు సాధించాడు. ముంబైతో పాటు అస్సాం, ఆంధ్ర జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2006-07 సీజన్‌లో ముంబై కెప్టెన్‌గా రంజీ ట్రోఫీ గెలిపించాడు. దేశవాళీ స్థాయిలో ప్రతిభ చాటినా, భారత జట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు.
నాయకత్వంలో విశ్వాసం, ఒత్తిడి లేకుండా ముందుకు
ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్ గ్రూప్ దశలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల చేతిలో ఓటములు చవిచూసింది. అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. కానీ అమోల్ ముజుందార్ తన స్వభావాన్ని మార్చుకోలేదు. డ్రెస్‌రూమ్‌లో ఆయన ఎవరిపైనూ ఒత్తిడి తీసుకురాలేదు.
ఆస్ట్రేలియాపై సెమీఫైనల్ విజయం అనంతరం ముజుమ్దార్ మాట్లాడుతూ.. “ఎటువంటి పెద్ద సందేశాలు ఇవ్వలేదు. మేము ఎల్లప్పుడూ ఒకరినొకరు గుర్తు చేసుకుంటాం.. మ్యాచ్‌ను మంచి ముగింపుకు తీసుకెళ్లడం అవసరం. ఈరోజు మేమది సాధించాం” అని అన్నారు.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కూడా ఆయనపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ.. “కోచ్ ఏది చెప్పినా, అది మనసు నుండి వస్తుందని మాకు తెలుసు. ఆయన కఠినంగా ఉన్నా, అది మంచి కోసం మాత్రమే” అని అన్నారు.
అమోల్ ముజుందార్ కోచింగ్‌లో భారత జట్టు ప్రయాణం
అమోల్ ముజుందార్ కోచింగ్ శైలి వినూత్నంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన గళం గట్టిగా వినిపించదు, కానీ ఆయన సూచనలు స్పష్టంగా ఆటతో కనిపిస్తాయి. ఆటగాళ్లతో వ్యక్తిగత అనుబంధం ఏర్పరచుకోవడం, వారికి నమ్మకం కల్పించడం ఆయన ప్రధాన పద్ధతి మనకు కనిపిస్తుంది.
యువ ఆటగాళ్లపై కూడా ఆయన విశ్వాసం ఉంచారు. అందుకే క్రాంతి గౌడ్, శ్రీ చరణి వంటి యంగ్ ప్లేయర్లు భారత జట్టులో చోటు దక్కించుకోగలిగారు. యువతకు అవకాశమివ్వడం ఆయన ధైర్యవంతమైన నిర్ణయంగా చెప్పవచ్చు. అలాగే, జెమిమా రోడ్రిగ్స్‌ను న్యూజిలాండ్ మ్యాచ్‌లో నంబర్ 3కి ప్రమోట్ చేయడం.. అది మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చేసింది.
“జెమి గేమ్‌ను షిఫ్ట్ చేసే ధైర్యం ఉన్న ప్లేయర్ అని నేను ఎప్పుడూ నమ్మాను. ఆ నిర్ణయం మ్యాచ్‌ను మలుపు తిప్పింది” అని అమోల్ ముజుందార్ చెప్పారు.
అమోల్ ముజుందార్ : భారత క్రికెట్‌కు కొత్త నిర్వచనం
అమోల్ ముజుందార్ కోచింగ్ అనేది కేవలం వ్యూహాల గురించి కాదు.. అది మానవతా దృష్టికోణం. తప్పిదాలపై కాకుండా, తర్వాతి బంతిపై దృష్టి పెట్టమని ఆయన ఎప్పుడూ చెబుతారు. ఇప్పుడు భారత్ దక్షిణాఫ్రికాతో ఫైనల్ పోరులో తలపడనుంది. కోచ్‌గా భారత్ తరఫున అంతర్జాతీయంగా ఆడని వ్యక్తి ఇప్పుడు ప్రపంచకప్ గెలుపు అంచున నిలబడి ఉన్నారు. ఆయన కథ ఒక విషయం స్పష్టంగా చెబుతుంది.. జట్టు నాయకత్వానికి అంతర్జాతీయ కెరీర్ అవసరం కాదు, విశ్వాసం, సహనం, స్పష్టత సరిపోతాయి.
భారత మహిళా జట్టు ఇప్పుడు అమోల్ ముజుందార్ శాంతమైన, శక్తివంతమైన నాయకత్వంలో చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది.