భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు బ్లాక్ బాండ్లు ఎందుకు ధరించారు?
IND vs AUS Black Armbands : భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు మెల్‌బోర్న్ జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో బ్లాక్ బ్యాండ్లు ధరించి ఆడుతున్నారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

భారత్-ఆస్ట్రేలియా మెల్‌బోర్న్ మ్యాచ్‌లో బ్లాక్ బాండ్లు
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో భాగంగా జరుగుతున్న ఈ రెండో మ్యాచ్ లో రెండు జట్ల ఆటగాళ్లు తమ చేతులపై నల్ల రంగు బాండ్లు ధరించారు. ఆటగాళ్లు ఎందుకు ఇలా నల్ల బ్యాండ్లు ధరించి ఆడుతున్నారనే ఆసక్తి అభిమానులు నెలకొంది.
తొలి వన్డేను దెబ్బకొట్టిన వర్షం
కాన్‌బెర్రాలో వర్షంతో రద్దైన తొలి మ్యాచ్ అనంతరం, ఈ సిరీస్ ఇప్పుడు నాలుగు మ్యాచ్‌లుగా మారింది. రెండో మ్యాచ్‌లో కూడా భారత్ మరోసారి టాస్ కోల్పోయింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే, 50 పరుగుల లోపే 5 కీలక వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది.
ఆటగాళ్లు ఎందుకు నల్ల బాండ్లు ధరించారు?
టాస్ సమయంలోనే సూర్యకుమార్ యాదవ్, మిచెల్ మార్ష్ ఇద్దరూ తమ చేతులపై నల్ల బాండ్లు ధరించి కనిపించారు. 17 ఏళ్ల ఆస్ట్రేలియా యంగ్ క్రికెటర్ బెన్ ఆస్టిన్ స్మరణార్థం ఈ బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్లు ధరించారు. బెన్ ఆస్టిన్ దురదృష్టవశాత్తు గత వారం ప్రాక్టీస్ సమయంలో గాయపడి మరణించాడు.
The Australian and Indian teams are wearing black armbands to pay tribute to aspiring cricketer Ben Austin, who tragically passed away after being struck by a ball in the nets. pic.twitter.com/YoK3ErgMf4
— BCCI (@BCCI) October 31, 2025
బెన్ ఆస్టిన్ ఎలా గాయపడ్డారు?
మెల్‌బోర్న్‌కు చెందిన బెన్ ఆస్టిన్, ఫెర్న్‌ట్రీ గల్లి క్రికెట్ క్లబ్ నెట్ ప్రాక్టీస్ సమయంలో “హ్యాండ్‌హెల్డ్ బాల్ లాంచర్”తో బంతిని ఎదుర్కొంటున్నప్పుడు, బంతి అతని మెడను తాకింది. హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ వేగంగా వచ్చి బాల్ తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతనిని మోనాష్ చిల్డ్రన్ హాస్పిటల్‌కు తరలించి లైఫ్ సపోర్ట్‌లో ఉంచారు. అయితే రెండు రోజుల తర్వాత అతను చికిత్స పొందుతూ బుధవారం ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటన 2014లో ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణాన్ని గుర్తు చేసింది. హ్యూస్ కూడా ఇలాంటి గాయంతో బౌన్సర్ బంతి తగిలి ప్రాణాలు కోల్పోయాడు.
బెన్ ఆస్టిన్ కు క్రికెట్ ప్రపంచం సంతాపం
బెన్ ఆస్టిన్ మరణంపై ఆస్ట్రేలియా అంతటా క్రికెట్ సంఘాలు, ఆటగాళ్లు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ మహిళల ప్రపంచకప్ 2025 సెమీఫైనల్ మ్యాచ్‌లోనూ భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్లు నల్ల బాండ్లు ధరించి బెన్ ఆస్టిన్‌కు సంతాపం తెలిపాయి.
మ్యాచ్‌కు ముందు ఒక నిమిషం మౌనం
మెల్‌బోర్న్‌లోని ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు, రెండు జట్లు, ప్రేక్షకులు మొత్తం ఒక నిమిషం మౌనం పాటించి బెన్ ఆస్టిన్ కు నివాళి ఇచ్చారు.
కాగా, ఆస్ట్రేలియా జట్టులో జోష్ ఫిలిప్పే స్థానంలో మాథ్యూ షార్ట్ జట్టులోకి వచ్చాడు. భారత జట్టు మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.