Virat Kohli : ధోనీనా? రోహితా? కోహ్లీకి కలిసొచ్చిన కెప్టెన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు !
Virat Kohli : విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్‌లో 8 మంది కెప్టెన్ల నాయకత్వంలో ఆడాడు. ధోనీ నుంచి శుభ్‌మన్ గిల్ వరకు ఎవరి కెప్టెన్సీలో కోహ్లీ గణాంకాలు ఎలా ఉన్నాయో, ఎవరి హయాంలో అత్యధిక పరుగులు చేశాడో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

విరాట్ కోహ్లీ వన్డే ప్రస్థానం : ఏ కెప్టెన్ హయాంలో ఎక్కువ పరుగులంటే?
టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నారు. టెస్టులు, టీ20 ఫార్మాట్‌ల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, ఆయన కేవలం వన్డే ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నారు.
2008లో భారత జట్టు తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన కోహ్లీ, అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ఆయన అరంగేట్రం చేసినప్పుడు టీమిండియాకు ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఇప్పటివరకు 311 వన్డే మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ, మొత్తంగా 8 మంది వేర్వేరు కెప్టెన్ల నాయకత్వంలో ఆడటం విశేషం. అంతేకాకుండా, 2013 నుండి 2021 మధ్య కాలంలో ఆయనే స్వయంగా టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
విరాట్ కోహ్లీని ఒక గొప్ప ఆటగాడిగా తీర్చిదిద్దడంలో ఆయన మొదటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ పాత్ర ఎంతో కీలకమైనది. ధోనీ నాయకత్వంలోనే కోహ్లీ అత్యధిక విజయాలను సాధించారు. అయితే, ధోనీ మొదలుకొని ప్రస్తుత యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వరకు.. వివిధ కెప్టెన్ల హయాంలో విరాట్ కోహ్లీ వన్డే ప్రయాణం ఎలా సాగిందనే విషయాలు గమనిస్తే..
ధోనీ కెప్టెన్సీలో కోహ్లీ రికార్డులు ఎలా ఉన్నాయి?
ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ అత్యధికంగా 138 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడారు. ధోనీ నాయకత్వంలో కోహ్లీ తన బ్యాటింగ్ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఈ కాలంలో 133 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన కోహ్లీ.. 50.91 సగటుతో ఏకంగా 5703 పరుగులు సాధించారు. ఇందులో 19 అద్భుతమైన సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ధోనీ మార్గదర్శకత్వంలో కోహ్లీ తన కెరీర్‌లో బలమైన పునాది వేసుకున్నారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
సొంత కెప్టెన్సీలో, గంభీర్, సహ్వాగ్ హయాంలో కోహ్లీ రికార్డులు
2013 నుండి 2021 వరకు విరాట్ కోహ్లీ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ సమయంలో ఆయన బ్యాటింగ్‌లో మరింత రాణించి ప్రపంచ క్రికెట్‌ను శాసించారు. స్వయంగా తానే కెప్టెన్‌గా ఉన్నప్పుడు కోహ్లీ 91 ఇన్నింగ్స్‌లలో 72.65 సగటుతో 5449 పరుగులు చేశారు. ఇందులో 21 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
అలాగే, టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో కూడా కోహ్లీ ఆడారు. 2010-2011 మధ్య గంభీర్ స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు, కోహ్లీ 6 మ్యాచ్‌లలో 62.80 సగటుతో 314 పరుగులు చేశారు. ఒక సెంచరీ, 3 ఫిఫ్టీలు ఉన్నాయి. ఇక డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సహ్వాగ్ కెప్టెన్సీలో కోహ్లీ 6 వన్డేలు ఆడి, 67.20 సగటుతో 336 పరుగులు చేశారు. ఇందులో 2 సెంచరీలు, ఒక ఫిఫ్టీ ఉన్నాయి.
కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో కోహ్లీ పరుగుల రికార్డు
కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ గణాంకాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. రాహుల్ నాయకత్వంలో కోహ్లీ రికార్డులు అత్యంత అద్భుతంగా ఉన్నాయి. రాహుల్ కెప్టెన్సీలో ఆడిన 7 మ్యాచ్‌లలో కోహ్లీ ఏకంగా 88.50 సగటుతో 531 పరుగులు సాధించారు. ఇందులో 3 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉండటం గమనార్హం. సగటు పరంగా చూస్తే ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా నిలుస్తుంది.
రోహిత్, రైనా, హార్దిక్ కెప్టెన్సీలో కింగ్ కోహ్లీ పరుగులు
2022 నుండి 2025 వరకు రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా ఉన్నారు. ఈ కాలంలో కోహ్లీ 43 మ్యాచ్‌లలో 52.32 సగటుతో 1779 పరుగులు చేశారు. రోహిత్ హయాంలో కోహ్లీ బ్యాట్ నుండి 7 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు వచ్చాయి.
మాజీ ఆటగాడు సురేష్ రైనా కెప్టెన్సీలో కూడా కోహ్లీ 9 మ్యాచ్‌లు ఆడారు. ఇందులో 40.77 సగటుతో 367 పరుగులు చేశారు. రైనా కెప్టెన్సీలో కోహ్లీ సెంచరీ చేయలేకపోయినా, 4 అర్ధ సెంచరీలు సాధించారు. ఇక స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో కోహ్లీ కేవలం ఒకే ఒక్క వన్డే ఆడారు, ఆ మ్యాచ్‌లో ఆయన 4 పరుగులు మాత్రమే చేయగలిగారు.
శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో కోహ్లీ ప్రయాణం
ప్రస్తుతం 37 ఏళ్ల వయసులో ఉన్న విరాట్ కోహ్లీ, వన్డే ఇంటర్నేషనల్‌లో యంగ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో ఆడుతున్నారు. ఇప్పటివరకు గిల్ కెప్టెన్సీలో కోహ్లీ 6 మ్యాచ్‌లు ఆడారు. ఈ మ్యాచ్‌లలో ఒక సెంచరీ, 2 అర్ధ సెంచరీల సహాయంతో 314 పరుగులు సాధించారు. యువ కెప్టెన్ ఆధ్వర్యంలో కూడా కింగ్ కోహ్లీ తన జోరును కొనసాగిస్తున్నారని ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయి.

