- Home
- Sports
- అప్పుడు రూ. 23.75 కోట్లు.. ఇప్పుడు రూ. 7 కోట్లు.. అన్‌లక్కీ ప్లేయర్‌ను సొంతం చేసుకున్న RCB
అప్పుడు రూ. 23.75 కోట్లు.. ఇప్పుడు రూ. 7 కోట్లు.. అన్‌లక్కీ ప్లేయర్‌ను సొంతం చేసుకున్న RCB
RCB: ఐపీఎల్ 2026 వేలంలో వెంకటేశ్ అయ్యర్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 7 కోట్లకు దక్కించుకుంది. గత మెగా వేలంలో రూ. 23.75 కోట్లు పలికిన అయ్యర్.. ఈసారి 71 శాతం తక్కువ ధరకు అమ్ముడయ్యాడు. లక్నో, గుజరాత్, KKR జట్లతో పోటీపడి ఆర్సీబీ అతడిని..

రూ. 23.75 కోట్లు పెద్ద చర్చ..
ఐపీఎల్ 2026 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ ను రూ. 7 కోట్లకు కొనుగోలు చేసింది. గత ఐపీఎల్ మెగా వేలంలో వెంకటేశ్ అయ్యర్ రూ. 23.75 కోట్లకు అమ్ముడుపోగా.. అప్పుడు అదే హాట్ టాపిక్. శ్రేయస్ అయ్యర్ లాంటి స్ట్రాంగ్ కెప్టెన్ ను వదిలేసి కేకేఆర్ వెంకటేశ్ అయ్యర్ ను భారీ ధరకు తీసుకోవడంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
రాణించకలేకపోయిన వెంకటేష్ అయ్యర్..
అయితే గత సీజన్‌లో వెంకటేశ్ అయ్యర్ పెద్దగా రాణించలేకపోయాడు. భారీ ధర, అలాగే అతడిపై ఒత్తిడి.. వెరిసి అయ్యర్ అట్టర్ ప్లాప్ అయ్యాడు. కేకేఆర్ కు అనుకున్నంత అడ్వాంటేజ్ గా నిలవలేకపోయాడు. దీంతో KKR అతడిని వేలానికి వదిలేసింది. మినీ వేలంలో తక్కువ ధరకే తీసుకోవాలని కేకేఆర్ భావించింది.
తక్కువ ధరకే కొనుగోలు..
ఈసారి మినీ వేలంలో వెంకటేశ్ అయ్యర్ రూ. 2 కోట్ల కనీస ధరతో ఆక్షన్ లోకి వచ్చాడు. ఈ డేంజర్ ప్లేయర్ కోసం తొలుత లక్నో సూపర్ జెయింట్స్ బిడ్ వేయగా, ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ రేసులోకి వచ్చింది. రూ. 2.60 కోట్ల దగ్గర గుజరాత్ టైటాన్స్ తప్పుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 3 కోట్ల బిడ్ తో ఎంట్రీ ఇచ్చింది. ఈ దశలో లక్నో సూపర్ జెయింట్స్ కూడా వెనక్కి తగ్గింది. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కేకేఆర్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. చివరకు కేకేఆర్ రూ. 6.80 కోట్ల దగ్గర ఆగిపోయింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 7 కోట్లకు వెంకటేశ్ అయ్యర్ ను సొంతం చేసుకుంది.
71 శాతం పడిపోయిన ధర..
మెగా వేలంతో పోల్చితే వెంకటేశ్ అయ్యర్ కు ఈసారి 71 శాతం తక్కువ ధర లభించింది. గతంలో రూ. 23.75 కోట్లు పలికిన అతడి ధర ఏకంగా రూ. 7 కోట్లకు పడిపోయింది. రూ. 16.40 కోట్ల పర్సుతో వేలంలోకి వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. వెంకటేశ్ అయ్యర్ కోసం ఏకంగా రూ. 7 కోట్లను ఖర్చు చేసింది. నిజానికి గత సంవత్సరం కూడా వెంకటేష్ అయ్యర్ కోసం ఆర్సీబీ పోటీపడింది. కానీ అప్పుడు వేలంలో దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు మినీ వేలంలో మాత్రం పక్కా ప్లాన్ ప్రకారం వెంకటేశ్ అయ్యర్ ను సొంతం చేసుకుంది.
వెంకటేష్ అయ్యర్ గణాంకాలు..
వెంకటేశ్ అయ్యర్ 2021 నుంచి ఐపీఎల్ లో ఆడుతున్నాడు. ఐపీఎల్ కెరీర్ లో మొత్తంగా 62 మ్యాచ్‌లలో 1468 పరుగులు చేశాడు. అతడి యావరేజ్ 29.96 కాగా, స్ట్రైక్ రేట్ 137.32. కెరీర్ లో రెండు సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు సాధించాడు. అయితే గత సీజన్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. 11 మ్యాచ్‌లలో కేవలం 142 పరుగులే చేసి, యావరేజ్ 20.29, స్ట్రైక్ రేట్ 139.22 తో నిరాశపరిచాడు. గత సీజన్ మొత్తంలో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ కొట్టాడు.

