T20 World Cup 2026 లో బిగ్ ట్విస్ట్.. పాకిస్థాన్ ప్లేస్‌లో ఆ టీమ్ వస్తే రచ్చ రచ్చే !
T20 World Cup 2026 : బంగ్లాదేశ్ బాటలో పాకిస్థాన్ కూడా టీ20 ప్రపంచకప్ 2026 నుంచి తప్పుకుంటుందా అనే చర్చ మొదలైంది. మరి పాక్ తప్పుకుంటే ఆ ప్లేస్ లో వచ్చే టీమ్ ఏది? ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా తీసుకునే ఈ నిర్ణయానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇవే..

టీ20 వరల్డ్ కప్ 2026: పాకిస్థాన్ ఆడకపోతే గ్రూప్-A పరిస్థితి ఏంటి? ఇండియా మ్యాచ్ ఉంటుందా?
2026 టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ క్రికెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే భద్రతా కారణాలతో బంగ్లాదేశ్ ఈ మెగా టోర్నమెంట్ నుంచి తప్పుకోగా, ఇప్పుడు పాకిస్థాన్ కూడా అదే బాటలో నడిచే సూచనలు కనిపిస్తున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఈ విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాల కోసం ఎదురుచూస్తోంది.
ఒకవేళ పాకిస్థాన్ ఈ టోర్నమెంట్ నుంచి వైదొలిగితే, వారి స్థానంలో ఆఫ్రికన్ దేశమైన ఉగాండా జట్టుకు అవకాశం దక్కనుందని సమాచారం. ఐసీసీ నిబంధనల ప్రకారం, అర్హత సాధించని జట్లలో అత్యుత్తమ ర్యాంకు ఉన్న జట్టుకు ఈ అవకాశం దక్కుతుంది.
బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ఎంట్రీ
ఇటీవలే బంగ్లాదేశ్ జట్టు భద్రతా కారణాలను చూపుతూ 2026 T20 ప్రపంచకప్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. టోర్నమెంట్ ప్రారంభానికి కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉండటంతో, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తక్షణమే స్పందించి బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను ఎంపిక చేసింది.
ఐసీసీ T20 ర్యాంకింగ్స్‌లో అర్హత సాధించని జట్లలో స్కాట్లాండ్ అగ్రస్థానంలో ఉండటమే ఇందుకు కారణం. ఈ పరిణామం పాకిస్థాన్ క్రికెట్ బోర్డులోనూ చర్చకు దారితీసింది. పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ మాట్లాడుతూ, ఐసీసీ బంగ్లాదేశ్ పట్ల వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. పాకిస్థాన్ మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడల్‌లో శ్రీలంకలో నిర్వహిస్తున్నట్లుగానే, బంగ్లాదేశ్‌కు కూడా అదే వెసులుబాటు కల్పించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
పాకిస్థాన్ ప్రభుత్వం చేతిలో నిర్ణయం
పాకిస్థాన్ ఈ టోర్నమెంట్‌లో పాల్గొనాలా వద్దా అనే విషయం పూర్తిగా ఆ దేశ ప్రభుత్వం చేతిలో ఉంది. ఈ విషయంపై పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ స్పష్టత ఇచ్చారు. "ప్రస్తుతం ప్రధానమంత్రి దేశంలో లేనందున, ఆయన తిరిగి వచ్చిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుచుకుంటాం. ప్రభుత్వం ఏది చెబితే అదే తుది నిర్ణయం," అని నఖ్వీ పేర్కొన్నారు.
గతంలో అనేకసార్లు ఐసీసీ టోర్నీలను బహిష్కరిస్తామని పాకిస్థాన్ హెచ్చరించినప్పటికీ, ఇప్పటివరకు అలాంటి సాహసం చేయలేదు. అయితే, బంగ్లాదేశ్ తీసుకున్న సంచలన నిర్ణయం తర్వాత, పాకిస్థాన్ కూడా కఠిన వైఖరిని అవలంబించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉగాండాకు గోల్డెన్ ఛాన్స్
ఒకవేళ పాకిస్థాన్ నిజంగానే టోర్నమెంట్ నుంచి తప్పుకుంటే, ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఉగాండా సిద్ధంగా ఉంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో, వరల్డ్ కప్‌కు అర్హత సాధించని జట్లలో స్కాట్లాండ్ తర్వాత రెండో స్థానంలో ఉగాండా ఉంది. స్కాట్లాండ్ ఇప్పటికే బంగ్లాదేశ్ స్థానాన్ని భర్తీ చేసినందున, పాకిస్థాన్ వైదొలిగితే ఆ అవకాశం సహజంగానే ఉగాండాకు దక్కుతుంది. ఇది ఉగాండా క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతమైన అవకాశంగా మారుతుంది. పీసీబీ గనుక ఆ బోల్డ్ కాల్ తీసుకుంటే, ఉగాండా జట్టు ఏకంగా ప్రపంచకప్ గ్రూప్ దశలో భారత్ వంటి దిగ్గజ జట్లతో తలపడే అవకాశం అందుకుంటుంది.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 : గ్రూప్-A షెడ్యూల్, జట్లు
ప్రస్తుతం పాకిస్థాన్ జట్టును గ్రూప్-Aలో చేర్చారు. ఈ గ్రూప్‌లో భారత్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా జట్లు ఉన్నాయి. పాకిస్థాన్ జట్టుకు సల్మాన్ అఘా నాయకత్వం వహిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న కొలంబోలో నెదర్లాండ్స్‌తో ఆడాల్సి ఉంది.
ఆ తర్వాత ఫిబ్రవరి 10న అమెరికాతో, ఫిబ్రవరి 15న చిరకాల ప్రత్యర్థి భారత్‌తో, ఫిబ్రవరి 18న నమీబియాతో తలపడాల్సి ఉంది. ఒకవేళ పాకిస్థాన్ బాయ్‌కాట్ చేస్తే, ఉగాండా జట్టు సరిగ్గా ఇదే షెడ్యూల్‌ను అనుసరిస్తుంది. అంటే ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ స్థానంలో ఉగాండా బరిలోకి దిగుతుందన్నమాట.
ఐసీసీ ముందున్న సవాళ్లు ఏమిటి?
టోర్నమెంట్ ప్రారంభానికి అతి తక్కువ సమయం ఉండటం, వరుసగా జట్లు తప్పుకోవడం ఐసీసీకి పెద్ద తలనొప్పిగా మారింది. పాకిస్థాన్ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరగాల్సి ఉన్నప్పటికీ, వారు టోర్నమెంట్ నుంచి వైదొలిగితే అది టోర్నీ క్రేజ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా భారత్-పాక్ మ్యాచ్‌పై ఉన్న అంచనాలు, ఆదాయం దృష్ట్యా ఇది ఐసీసీకి పెద్ద దెబ్బే అవుతుంది.
అయితే, నిబంధనల ప్రకారం ప్రత్యామ్నాయ జట్లను సిద్ధం చేయడం మినహా ఐసీసీకి మరో మార్గం లేదు. రాబోయే కొద్ది రోజుల్లో పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే 2026 టీ20 ప్రపంచకప్ పూర్తి స్వరూపం ఆధారపడి ఉంది.

