భారత్ vs దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో దంచికొట్టిన టాప్ 5 ప్లేయర్లు
India vs South Africa : భారత్–దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు రెండు జట్లు తమ వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. అయితే, ఈ రెండు జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్ లలో అత్యధిక పరుగులు సాధించిన టాప్ 5 బ్యాట్స్‌మన్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

నవంబర్ 14 నుంచి భారత్–దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండు టెస్ట్‌ల సిరీస్ నవంబర్ 14 నుంచి కోల్‌కతాలో ప్రారంభం కానుంది. ఈ హై ప్రొఫైల్ టెస్ట్ సిరీస్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 1992లో ఇరు జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడినప్పటి నుంచి ఇప్పటివరకు 44 టెస్ట్‌లు జరిగాయి. అందులో భారత్ 16 మ్యాచ్‌లు గెలవగా, దక్షిణాఫ్రికా 18 విజయాలు సాధించింది. ఈ సిరీస్‌లలో పరుగుల వరద పారించిన ప్లేయర్లలో సచిన్ టెండూల్కర్ టాప్ లో ఉన్నారు.
ఏబీ డివిలియర్స్
సౌతాఫ్రికా సూపర్ స్ట్రోకర్ ఏబీ డివిలియర్స్ 2006 నుంచి 2018 మధ్య భారత్ తో 20 టెస్టులు ఆడారు. 39.23 సగటుతో 1,334 పరుగులు చేశారు. ఆయన 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు సాధించారు. 2008 ఏప్రిల్‌లో అహ్మదాబాద్‌లో భారత్‌పై ఆడిన 217 నాటౌట్ ఇన్నింగ్స్ ఆయన ప్రతిభను ప్రపంచానికి చాటింది.
విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ 2013 నుంచి 2024 మధ్య దక్షిణాఫ్రికా తో 16 టెస్ట్‌లు ఆడారు. ఆయన 54.15 సగటుతో 1,408 పరుగులు చేశారు. కోహ్లీ 3 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. 2019 అక్టోబర్‌లో పుణెలో జరిగిన టెస్ట్‌లో నాటౌట్ 254 పరుగులు ఆయన కెరీర్‌లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌గా నిలిచింది.
హాషిమ్ ఆమ్లా
2004 నుంచి 2018 వరకు భారత్ వ్యతిరేకంగా ఆడిన 21 టెస్ట్‌ల్లో హాషిమ్ ఆమ్లా 43.65 సగటుతో 1,528 పరుగులు చేశారు. ఆయన 5 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ముఖ్యంగా 2010 ఫిబ్రవరిలో నాగ్‌పూర్‌లో భారత్‌పై నాటౌట్ 253 పరుగులు సాధించి ఆయన తన బ్యాటింగ్ ప్రతిభను చూపించాడు.
జాక్వెస్ కలిస్
సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. 2000 నుంచి 2013 మధ్య భారత్ తో 18 టెస్ట్‌ల్లో 31 ఇన్నింగ్స్ ఆడిన కలిస్.. 69.36 సగటుతో 1,734 పరుగులు చేశారు. 7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ముఖ్యంగా 2010 డిసెంబరులో సెంచూరియన్ లో భారత్ జట్టుపై ఆడిన 201 నాటౌట్ ఇన్నింగ్స్ ఆయన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక సూపర్ నాక్.
సచిన్ టెండూల్కర్
టీమిండియా లెజెండరీ ప్లేయర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. 1992 నుంచి 2011 వరకు ఆయన దక్షిణాఫ్రికా పై 25 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. ఈ కాలంలో 42.46 సగటుతో 1,741 పరుగులు చేశారు. ఆయన ఖాతాలో 7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సచిన్ తన బ్యాటింగ్ దెబ్బతో దక్షిణాఫ్రికా బౌలర్లకు చెమటలు పట్టించాడు.
భారత్–దక్షిణాఫ్రికా టెస్ట్ పోటీలు ఎప్పుడూ ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఇరు జట్ల మధ్య గట్టి పోటీ, వ్యక్తిగత రికార్డులు, చారిత్రాత్మక ఇన్నింగ్స్‌లు ఈ సిరీస్‌లను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈసారి నవంబర్ 14న ప్రారంభమయ్యే సిరీస్‌లో కొత్త రికార్డులు మోత అంచనాల మధ్య అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.