Shubman Gill : షాకింగ్ డెసిషన్.. భారత్ సిరీస్ ఓడిపోగానే గిల్ ఏం చేశాడో తెలుసా?
Shubman Gill : న్యూజిలాండ్‌తో సిరీస్ ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీ20 సిరీస్‌కు ఎంపిక కాని గిల్, విశ్రాంతి తీసుకోకుండా పంజాబ్ తరఫున రంజీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమయ్యాడు.

టీ20 టీమ్‌లో చోటు లేదు.. కానీ గిల్ ప్లాన్ మామూలుగా లేదుగా!
భారత వన్డే, టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టు ఓటమి పాలవడమే ఇందుకు ప్రధాన కారణం. గిల్ నాయకత్వంలో టీమిండియా 37 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై కివీస్ చేతిలో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఈ ఓటమితో జట్టు ప్రదర్శనపై, గిల్ కెప్టెన్సీపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
మరోవైపు, రాబోయే టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కలేదు. అంతకుముందే జరిగిన టీ20 ప్రపంచ కప్ స్క్వాడ్ నుంచి కూడా గిల్‌ను తప్పించిన విషయం తెలిసిందే. పేలవమైన ఫామ్ కారణంగానే అతన్ని పొట్టి ఫార్మాట్ నుంచి పక్కన పెట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత గిల్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటారని అందరూ ఊహించారు. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గిల్ ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నాడు.
గిల్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత టీ20 జట్టు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో న్యూజిలాండ్‌తో తలపడనుండగా, శుభ్‌మన్ గిల్ మాత్రం దేశవాళీ క్రికెట్ ఆడటానికి సిద్ధమయ్యాడు. పంజాబ్ తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడేందుకు అతను నిర్ణయించుకున్నాడు.
యాక్షన్ మోడ్‌లో శుభ్‌మన్ గిల్
జనవరి 21 నుంచి టీమిండియా న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ప్రారంభించనుంది. సరిగ్గా అదే సమయంలో శుభ్‌మన్ గిల్ పంజాబ్ జట్టును రంజీ ట్రోఫీ నాకౌట్ దశకు చేర్చాలనే లక్ష్యంతో మైదానంలోకి దిగనున్నాడు. మీడియా రిపోర్టుల ప్రకారం, వన్డే సిరీస్ ముగిసిన వెంటనే విశ్రాంతి తీసుకోకూడదని గిల్ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అతను ఇండోర్ నుంచి నేరుగా రాజ్‌కోట్‌కు చేరుకున్నాడు.
ప్రస్తుతం రంజీ ట్రోఫీలో పంజాబ్ జట్టు పరిస్థితి క్లిష్టంగా ఉంది. గ్రూప్-బిలో ఉన్న పంజాబ్, ఇప్పటివరకు 11 పాయింట్లతో పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతోంది. నాకౌట్ దశకు అర్హత సాధించాలంటే, ఇక్కడి నుంచి మిగిలిన 3 మ్యాచ్‌లలోనూ పంజాబ్ తప్పక విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ క్లిష్ట సమయంలో జట్టుకు అండగా నిలిచేందుకు గిల్ సిద్ధమయ్యాడు. 2024లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ సందర్భంగా గిల్ గాయపడ్డాడు. అప్పటి నుంచి అతను రెడ్ బాల్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ రంజీ క్రికెట్‌లో తన సత్తా చాటాలని గిల్ భావిస్తున్నాడు.
37 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై పరాభవం
భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన నిర్ణయాత్మకమైన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 41 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో సిరీస్ కివీస్ వశమైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్ సారథ్యంలో భారత జట్టు తమ పేరిట ఒక చెత్త రికార్డును లిఖించుకుంది. 37 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ ఓడిపోవడం గమనార్హం.
ఫైనల్ మ్యాచ్‌లో గిల్ బ్యాటింగ్ పరంగా కూడా పెద్దగా రాణించలేకపోయాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంలో విఫలమయ్యాడు. మరోవైపు, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. కోహ్లీ అద్భుతంగా ఆడి 124 పరుగుల భారీ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. అయినప్పటికీ, అతను జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ఫలితంగా భారత్ తన ఖాతాలో సిరీస్ ఓటమిని నమోదు చేసుకోవాల్సి వచ్చింది.
ఓటమిపై గిల్ ఏమన్నారంటే?
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు. తమ బ్యాటింగ్ మరీ అంత దారుణంగా ఏమీ లేదని గిల్ అభిప్రాయపడ్డాడు. అయితే, తాము ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయామని ఆయన అంగీకరించాడు.
"మేము చెత్తగా బ్యాటింగ్ చేశామని అనలేను. కానీ, మేము ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయలేకపోయాం. బ్యాటర్లకు మంచి ఆరంభం లభించినప్పుడు, దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోతే కచ్చితంగా ఇబ్బందులు పెరుగుతాయి. మా జట్టులో కనీసం ఇద్దరు ఆటగాళ్ళైనా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సింది. న్యూజిలాండ్ జట్టుకు, మాకు మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదే. మేము ఆశించిన విధంగా భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం, బహుశా అందుకే మ్యాచ్ ఓడిపోయాం" అని గిల్ పేర్కొన్నాడు.
దేశవాళీ క్రికెట్‌పైనే గిల్ ఆశలు
టీ20 జట్టులో స్థానం కోల్పోవడం, వన్డే సిరీస్ ఓటమి వంటి వరుస ఎదురుదెబ్బల నేపథ్యంలో గిల్ రంజీ ట్రోఫీని ఎంచుకోవడం మంచి పరిణామంగా కనిపిస్తోంది. దేశవాళీ క్రికెట్‌లో రాణించడం ద్వారా తిరిగి తన ఫామ్‌ను అందుకోవాలని, విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలని గిల్ యోచిస్తున్నాడు. పంజాబ్ జట్టును గెలిపించి, మళ్ళీ ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవడమే ఇప్పుడు గిల్ ముందున్న ప్రధాన లక్ష్యం.

