టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన
Gill: వరుస వైఫల్యాల నేపథ్యంలో గిల్ ను టీ20 ప్రపంచ కప్ జట్టు నుంచి బీసీసీఐ తప్పించింది. అతడు పరుగులు రాబట్టడంలో వెనుకబడ్డాడని, జట్టు కూర్పు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు.

బీసీసీఐ సంచలన నిర్ణయం
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇటీవల ఒక సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వరుస మ్యాచ్‌లలో విఫలమవుతున్న స్టార్ ఆటగాడు శుభ్ మాన్ గిల్ ను టీ20 ప్రపంచ కప్ 2026 జట్టు నుంచి అనూహ్యంగా తప్పించింది. టీమ్ ఇండియా టెస్ట్, వన్డే జట్లకు కెప్టెన్‌గా, టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా కొనసాగిన గిల్ విషయంలో బీసీసీఐ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం క్రీడా వర్గాలలో ఆసక్తి రేకెత్తించింది.
వైస్ కెప్టెన్‌గా భారత జట్టులోకి రీఎంట్రీ
ఆసియా టీ20 కప్ 2025 టోర్నమెంట్‌తో గిల్ వైస్ కెప్టెన్‌గా భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ నిర్ణయం దాదాపు ఏడాది కాలంగా అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్‌గా రాణించిన సంజూ శాంసన్ కెరీర్‌కు ఇబ్బందులు సృష్టించింది. గిల్ ను అభిషేక్ జోడిగా యాజమాన్యం ఆడించగా, సంజూను తొలుత వన్ డౌన్‌లో, ఆ తర్వాత మిడిల్ ఆర్డర్‌కు పంపింది. క్రమంగా తుది జట్టు నుంచే తప్పించింది. వికెట్ కీపర్‌గా కూడా సంజూకు బదులు ఫినిషర్‌గా ఉపయోగపడే జితేష్ శర్మకు ప్రాధాన్యం ఇచ్చింది.
గిల్ ఎంట్రీ.. సంజూ బలి
అయితే, సంజూ స్థానంలో ఓపెనర్‌గా తిరిగి వచ్చిన గిల్ వరుస మ్యాచ్‌లలో తీవ్రంగా విఫలమయ్యాడు. అంతకుముందు కూడా అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. అతని గత 21 ఇన్నింగ్స్‌లలో స్కోర్లు వరుసగా 20, 10, 5, 47, 29, 4, 12, 37, 5, 15, 46, 29, 4, 0 గా నమోదయ్యాయి. ఇటీవల సౌత్ ఆఫ్రికాతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో గిల్ నిరాశపరిచాడు.
సఫారీలతో టీ20ల్లో విఫలం
మూడో టీ20లో 28 బంతుల్లో 28 పరుగులు చేయగలిగాడు. పాదానికి గాయమైన కారణంగా అతను చివరి రెండు టీ20ల నుంచి తప్పుకున్నాడు. నాలుగో టీ20 పొగమంచు వల్ల రద్దు కాగా, ఐదో టీ20తో సంజూ తుది జట్టులోకి వచ్చాడు. అహ్మదాబాద్ లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి తన సత్తాను నిరూపించుకున్న సంజూ, గిల్ మూడు మ్యాచ్‌లలో కలిపి చేసిన పరుగుల కంటే ఒక్క ఇన్నింగ్స్‌లోనే ఎక్కువ పరుగులు సాధించడం విశేషం.
గిల్ పరుగులు రాబట్టలేకపోతున్నాడు..
ఈ పరిణామాల నేపథ్యంలో మేనేజ్‌మెంట్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. గిల్ కోసం ఇంకెన్నాళ్లు సంజూని బలి చేస్తారని రవిశాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఏకంగా ప్రపంచ కప్ జట్టు నుంచే గిల్ ను తప్పించడం సంచలనంగా మారింది. ఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పందించారు. విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ, గిల్ పరుగులు రాబట్టడంలో వెనుకబడ్డాడని పేర్కొన్నారు. 2024 వరల్డ్ కప్ జట్టులోనూ అతడు లేడని స్పష్టం చేశారు. జట్టు కూర్పునకు అనుగుణంగా ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉంటుందని వివరించారు.

