అయ్యో పాపం శ్రేయాస్ అయ్యర్.. ఆక్సిజన్ 50కి పడిపోయింది !
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో గాయపడ్డాడు. ఆ సమయంలో అతని ఆక్సిజన్ స్థాయిలు 50%కి పడిపోయాయి. సౌతాఫ్రికా వన్డే సిరీస్ కు అయ్యార్ దూరం అయ్యే ఛాన్స్ ఉంది.

శ్రేయాస్ అయ్యర్ గాయం పై అభిమానుల్లో ఆందోళన
భారత క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడ్డాడు. క్యాచ్ పట్టే క్రమంలో డైవ్ చేయడంతో అతని పక్కటెముకలు, ప్లీహాకు గాయమైంది. ఆ గాయం తీవ్రత కారణంగా అంతర్గత రక్తస్రావం చోటుచేసుకుంది. దీంతో అతన్ని సిడ్నీ ఆసుపత్రిలో ఐసీయూకు తరలించారు. వైద్యులు మొదట అతని పరిస్థితి అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు.
బీసీసీఐ వర్గాల ప్రకారం, గాయం అనంతరం అయ్యర్ ఆక్సిజన్ స్థాయిలు 50%కి పడిపోయాయి. కనీసం పది నిమిషాల పాటు నిలబడలేకపోయాడు. అతను పూర్తిగా బ్లాక్‌అవుట్‌కు గురయ్యాడని వైద్య సిబ్బంది తెలిపారు. ఈ పరిస్థితి నుంచి సాధారణ స్థితికి రావడానికి కొన్ని గంటలు పట్టింది.
ఆస్ట్రేలియా వన్డేలో క్యాచ్ కోసం వెళ్లి గాయపడ్డ అయ్యర్
అక్టోబర్ 25న సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు. హర్షిత్ రాణా వేసిన ఓవర్‌లో అలెక్స్ క్యారీ బ్యాట్ ఎడ్జ్ తగిలి బంతి గాల్లోకి ఎగిరింది. బ్యాక్‌వర్డ్ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్, దాన్ని అద్భుతంగా డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. అయితే అదే సమయంలో అతను నేలపై బలంగా పడటంతో గాయమైంది. ఆ నొప్పి కారణంగా మైదానాన్ని వదిలి వెళ్ళాడు.
మరుసటి రోజు వైద్య పరీక్షల్లో అతనికి అంతర్గత రక్తస్రావం ఉన్నట్లు తేలింది. దీంతో వైద్యులు వెంటనే అతన్ని ఐసీయూలో చేర్చారు. చికిత్స తర్వాత కొన్ని రోజులకే డిశ్చార్జ్ చేశారు కానీ, కోలుకోవడానికి మరింత సమయం అవసరమని తెలిపారు.
ఇండియా vs సౌతాఫ్రికా సిరీస్‌కు అయ్యర్ దూరం
నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే భారత-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ పాల్గొనడం కష్టమని స్పష్టమవుతోంది. అతను ప్రస్తుతం ఫిట్నెస్ రికవరీలో ఉన్నప్పటికీ, పూర్తి స్థాయి ఫిట్‌గా ఉండటానికి ఇంకా ఒక నెలపాటు సమయం కావాలని వైద్యులు సూచించారు.
బీసీసీఐ అధికారుల ప్రకారం, “శ్రేయాస్ గాయం తీవ్రంగా ఉంది. అతని ఆరోగ్యంపై మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. త్వరగా మైదానంలోకి తీసుకురావడానికి తొందరపడటం లేదు” అని తెలిపారు.
గాయానికి ముందు అద్భుత ఫామ్ లో శ్రేయాస్ అయ్యర్
అద్భుత ఫామ్ లో ఉండగా శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో శ్రేయాస్ రెండు వన్డేల్లో 72 పరుగులు చేశాడు. రెండో వన్డేలో రోహిత్ శర్మతో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ ఏడాది మొత్తం 11 వన్డేల్లో 496 పరుగులు చేశాడు. ఐదు హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అతను కీలక పాత్ర పోషించాడు.
అతని ప్రదర్శనతో టీమిండియా మిడిల్ ఆర్డర్‌కి బలమైన స్థిరత్వం లభించింది. కానీ గాయం కారణంగా ఈ సీజన్ మిగతా మ్యాచ్‌ల్లో అయ్యర్ లేకపోవడం భారత్ కు ఎదురుదెబ్బ అని చెప్పాలి.
త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్థనలు
శ్రేయాస్ అయ్యర్ గాయం వార్త అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. సోషల్ మీడియాలో “త్వరగా కోలుకోవాలి శ్రేయాస్” అంటూ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బోర్డు వర్గాలు కూడా అతని రికవరీపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి.
జనవరి 2026లో న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్ సమయానికి శ్రేయాస్ మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఫిట్‌నెస్ టెస్టులు పూర్తి చేసుకున్న తర్వాతే అతని రీ-ఎంట్రీపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.