18 సిక్సులు, 6 ఫోర్లు.. 27 బంతుల్లో సెంచరీతో విధ్వంసం సృష్టించాడు భయ్యా !
Fastest 100 in T20I: టీ20 ఫార్మాట్ వచ్చిన తర్వాత క్రికెట్ స్వరూపమే మారిపోయింది. ఎస్టోనియా క్రికెటర్ సాహిల్ చౌహాన్ కేవలం 27 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. తన ఇన్నింగ్స్ లో 18 సిక్సులు, 6 ఫోర్లు బాది టీ20 చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు సృష్టించాడు.

27 బంతుల్లో సెంచరీతో చరిత్ర సృష్టించిన సాహిల్ చౌహాన్
టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించి సాహిల్ చౌహాన్ ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాడు. ఎస్టోనియా తరఫున ఆడుతున్న భారత మూలాలున్న ఈ బ్యాటర్ కేవలం 27 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌లో ఆయన 18 సిక్సులు, 6 ఫోర్లు బాది మొత్తం 144 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఈ రికార్డు ఇన్నింగ్స్ 2024 జూన్ 17న సైప్రస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో నమోదైంది. సాహిల్ చౌహాన్ స్ట్రైక్ రేట్ 351.21గా ఉండడం ఈ ఇన్నింగ్స్ ప్రభావాన్ని స్పష్టంగా చూపించింది.
క్రిస్ గేల్ రికార్డును అధిగమించిన చౌహాన్
సాహిల్ చౌహాన్ ఈ సునామీ ఇన్నింగ్స్ తో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డును అధిగమించాడు. ఐపీఎల్‌లో క్రిస్ గేల్ కేవలం 30 బంతుల్లో సెంచరీ సాధించాడు. కానీ చౌహాన్ కేవలం 27 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి గేల్ రికార్డును బద్దలు కొట్టాడు.
ఈ మ్యాచ్ సైప్రస్‌లోని ఎపిస్కోపీ మైదానంలో జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన సైప్రస్ 20 ఓవర్లలో 191/7 పరుగులు చేసింది. ఎస్టోనియాకు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.
ఎస్టోనియా విజయంలో కీలక పాత్ర పోషించిన చౌహాన్
192 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఎస్టోనియా జట్టు 13 ఓవర్లలోనే 194 పరుగులు సాధించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంకా 42 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. ఈ విజయానికి ప్రధాన కారణం సాహిల్ చౌహాన్. అతని బలమైన షాట్లు, హిట్టింగ్ దెబ్బకు ప్రత్యర్థి బౌలర్ల దగ్గర ఎలాంటి సమాధానం లేకుండాపోయింది.
భారత మూలాలతో హర్యానా నుంచి ఎస్టోనియాకి చౌహాల్ ప్రయాణం
సాహిల్ చౌహాన్ హర్యానాలోని పంచకుల జిల్లా, పింజోర్ సమీపంలోని మనక్పూర్ దేవీలాల్ గ్రామానికి చెందినవాడు. 1992 ఫిబ్రవరి 19న జన్మించాడు. క్రికెట్‌లో కెరీర్‌ను కొనసాగించాలన్న ఉద్దేశంతో ఎస్టోనియాకు వెళ్లాడు.
ఆయన తన అత్తమామల దగ్గర ఉన్న చిన్న రెస్టారెంట్‌లో పనిచేస్తూ 2019లో ఎస్టోనియాలో క్రికెట్ ఆడటం ప్రారంభించినట్టు ఒక ఇంటర్వ్యూలో సాహిల్ చౌహాన్ చెప్పాడు. “నేను బోర్‌గా అనిపించి గూగుల్‌లో ఎస్టోనియా క్రికెట్ టీమ్ గురించి వెతికాను. ఆ తర్వాత వారితో నా క్రికెట్ ప్రయాణం మొదలైంది” అని చెప్పాడు.
టీ20 చరిత్రలో చిరస్మరణీయ రికార్డు సాధించిన సాహిల్ చౌహాన్
సాహిల్ చౌహాన్ రికార్డు ఇప్పుడు టీ20 ఇంటర్నేషనల్ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయింది. 27 బంతుల్లో సెంచరీ కొట్టిన ఏకైక ఆటగాడిగా ఆయన పేరు చరిత్రలో నమోదైంది. టీ20 ఫార్మాట్‌లో వేగం, శక్తి, ఖచ్చితత్వం అన్నింటినీ సమన్వయం చేస్తూ చౌహాన్ ప్రదర్శన ప్రపంచ క్రికెట్‌లో విశేష ప్రశంసలు అందుకుంది.
సాహిల్ చౌహాన్ రికార్డు కేవలం ఎస్టోనియా క్రికెట్‌కే కాకుండా భారత మూలాలున్న ప్రతీ క్రీడాభిమానికి గర్వకారణమైంది. భవిష్యత్తులో అతని ఇన్నింగ్స్ మరెంతమందికి ప్రేరణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.