ప్రపంచ క్రికెట్ లో రోహిత్ శర్మ దూకుడు
Rohit Sharma : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ మళ్లీ నంబర్ వన్ బ్యాట్స్‌మన్ గా నిలిచాడు. మిచెల్ రేటింగ్ పాయింట్లు కోల్పోవడంతో రోహిత్ అగ్రస్థానానికి చేరాడు. తాజాగా హిట్‌మ్యాన్ ను టీ20 ప్రపంచ కప్ అంబాసిడర్ గా ఐసీసీ నియమించింది.

ప్రపంచ నంబర్ వన్ గా రోహిత్ శర్మ
ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరోసారి అగ్రస్థానాన్ని అందుకున్నాడు. కొద్ది రోజుల క్రితం వరకూ న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ డారిల్ మిచెల్ టాప్‌లో ఉన్నాడు. అయితే, చివరి రెండు వన్డేల్లో ఆడకపోవడంతో అతను రేటింగ్ పాయింట్లను కోల్పోయాడు.
ఫలితంగా 781 పాయింట్లతో రోహిత్ మళ్లీ ప్రపంచ నంబర్ వన్ గా మారాడు. దీంతో భారత క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. దక్షిణాఫ్రికాతో నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు ముందు రోహిత్ టాప్ ర్యాంక్‌తో ప్రవేశించడం టీమిండియా మోరల్‌కు మరింత బలం ఇచ్చింది. ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శన చేస్తే రోహిత్ తన అగ్రస్థానాన్ని మరింత బలంగా నిలబెట్టుకోవచ్చు.
రెండో స్థానంలో డారిల్ మిచెల్
డారిల్ మిచెల్ రెండు మ్యాచులు దూరమయ్యాక రెండో స్థానానికి పడిపోయినప్పటికీ, కివీస్‌కు ర్యాంకింగ్స్‌లో కొన్ని సానుకూల సంకేతాలు కనిపించాయి. రచిన్ రవీంద్ర 12వ స్థానానికి, డెవాన్ కాన్వే 11 స్థానాలు ఎగబాకి 31వ ర్యాంక్‌కి చేరడం గమనార్హం. బౌలర్ల విభాగంలో మిచెల్ శాంట్నర్ 6వ స్థానానికి, మాట్ హెన్రీ 10వ స్థానానికి చేరుకున్నాడు.
వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ తన అజేయ సెంచరీతో 8వ స్థానంలోకి రావడం కూడా ఈ వారం ర్యాంకింగ్స్‌లో ప్రత్యేక అంశంగా నిలిచింది.
టీమిండియా ఆటగాళ్ల ర్యాంకింగ్స్ ఇవే
రోహిత్ టాప్ స్థానం దక్కించుకోగా, ముగ్గురు భారత బ్యాటర్ల కూడా టాప్ 10లో ఉన్నారు.
• శుభ్‌మన్ గిల్ – 4వ స్థానం
• విరాట్ కోహ్లీ – 5వ స్థానం
• శ్రేయస్ అయ్యర్ – గాయం తర్వాత 9వ స్థానానికి పడిపోయాడు
• కేఎల్ రాహుల్ – 16వ స్థానం
ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. టీ20 ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో సికందర్ రజా కెరీర్‌లో తొలిసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు.
బౌలర్లు, ఆల్‌రౌండర్లు ర్యాంకులు ఇవే
టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో కూడా ఈ వారం పెద్ద మార్పులే చోటు చేసుకున్నాయి. ఇంగ్లాండ్‌కు చెందిన ఓలీ పోప్ 24వ స్థానానికి ఎగబాకగా, బంగ్లాదేశ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం 15వ స్థానంలో నిలిచాడు.
ఆస్ట్రేలియా స్టార్ మిచెల్ స్టార్క్ టెస్ట్ బౌలర్లలో 5వ ర్యాంక్‌కి చేరాడు. బుమ్రా టాప్ లోనే కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో బెన్ స్టోక్స్ రెండో స్థానానికి చేరగా, భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అగ్రస్థానంలో మార్పులేకుండా కొనసాగుతున్నాడు. వన్డేల్లో రషీద్ ఖాన్, టీ20ల్లో వరుణ్ చక్రవర్తి టాప్ లో ఉన్నారు.
రోహిత్‌కు మరో అరుదైన గౌరవం
త్వరలో జరగనున్న 2026 టీ20 ప్రపంచ కప్‌కు సంబంధించి ఐసీసీ ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంతో జరగనున్న ఈ టోర్నమెంట్‌లో 20 జట్లు పాల్గొననున్నాయి. దీని తర్వాత రోహిత్ మాట్లాడుతూ.. “2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ తప్పకుండా ఆడుతుంది. ఏ జట్టునైనా మనం ఫైనల్‌లో ఎదుర్కోవచ్చు” అని అన్నారు.
రోహిత్ ఇప్పటి వరకు తొమ్మిది టీ20 ప్రపంచకప్‌ల్లో ఆడి 1,220 పరుగులు సాధించారు. తాజాగా ఐసీసీ 2026 టీ20 ప్రపంచకప్‌కు ఆయనను అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం అతని ప్రభావాన్ని మరింత స్పష్టంగా చూపిస్తుంది.

