హిట్‌మ్యానా.. మజాకానా.! ఒక దెబ్బకు రెండు పిట్టలు.. వన్డేల్లో ప్రపంచ రికార్డు
Rohit Sharma: రాంచీలో దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి వన్డేలో భారత్ పటిష్ట స్థితిలో ఉంది. ఆ జట్టు వెటరన్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అర్ధ సెంచరీలతో అదరగొట్టారు.

దుమ్మురేపిన రో-కో.!
ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డే ద్వారా తిరిగి ఫామ్‌లోకి వచ్చిన టీమిండియా వెటరన్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఇప్పుడు సఫారీలతో జరుగుతోన్న తొలి టెస్టులో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తున్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడుతూ ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేశారు. రోహిత్ శర్మ 57 పరుగులకు అవుట్ కాగా.. విరాట్ కోహ్లీ సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు.
రోహిత్ మరో అర్ధ సెంచరీ..
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మంచి ఫామ్ కనబరిచిన ఓపెనర్ రోహిత్ శర్మ.. సఫారీలతో జరుగుతోన్న మొదటి మ్యాచ్‌లోనూ అదే ఫామ్ కొనసాగించాడు. జైస్వాల్ త్వరగా పెవిలియన్ చేరినప్పటికీ.. ఒక ఎండ్‌లో కోహ్లీతో సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలోనే తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అరుదైన రికార్డు..
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ.. ఇదే క్రమంలో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మూడో సిక్స్ కొట్టి ఈ రికార్డు నెలకొల్పిన రోహిత్.. ఇప్పటివరకు వన్డేల్లో 352 సిక్సర్లు బాదేసి.. అగ్రస్థానంలో నిలిచాడు.
లిస్టులో ధోని..
వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో ఇద్దరు టీమిండియా స్టార్స్ ఉన్నారు. 352 సిక్సర్లతో రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలవగా.. ఆ తర్వాత పాకిస్తాన్ బ్యాటర్ షాహిద్ అఫ్రిది(351) రెండో స్థానంలో.. క్రిస్ గేల్(331) మూడు స్థానంలో.. 270 సిక్సర్లతో జయసూర్య నాలుగులో.. ఎంఎస్ ధోని(229) ఐదో స్థానంలో నిలిచాడు.
అదరగొడుతున్న భారత్..
ఈ మ్యాచ్‌లో భారత్ అదరగొడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండగా నిలిచారు. ఇద్దరూ తమ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. కచ్చితంగా ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

