ఇదేం అరాచకం సామీ.. 11 సిక్సులు, 7 ఫోర్లు, 32 బంతుల్లోనే సెంచరీ
Abhishek sharma: హైదరాబాద్‌లో జరుగుతోన్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మరో అద్భుతం జరిగింది. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ సాధించి క్రికెట్ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ.

32 బంతుల్లో శతకం
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT 2025)లో పంజాబ్ కెప్టెన్‌గా తిరిగి వచ్చిన అభిషేక్ శర్మ, బెంగాల్ బౌలర్లపై అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్ జిమ్‌ఖానా మైదానంలో ఆదివారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో 32 బంతుల్లో శతకం సాధించి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశాడు.
12 బంతుల్లో హాఫ్ సెంచరీ
అభిషేక్ మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడాడు. మొదటి 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, హాఫ్ సెంచరీ పూర్తి చేసినప్పుడు అతని 51 పరుగుల్లో 50 బౌండరీలే కావడం. ఆ సమయంలో 5 సిక్సులు, 5 ఫోర్లు కొట్టి బెంగాల్ బౌలర్లకు ముప్పుతిప్పలు పెట్టాడు. మొహమ్మద్ షమీ ఓవర్‌లో ఒంటరిగా 23 పరుగులు తీశాడు.
11 సిక్సులు, 7 ఫోర్లు
అభిషేక్ 32 బంతుల్లో శతకం పూర్తి చేసే సమయానికి 11 సిక్సులు, 7 ఫోర్లు బాదాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతను తన 8వ T20 సెంచరీ నమోదు చేశాడు. ఇదే సంఖ్యలో సెంచరీలు ఉన్న రోహిత్ శర్మను చేరుకున్నాడు. భారత ఆటగాళ్లలో ఎక్కువ T20 సెంచరీలు ఉన్నవారిలో కోహ్లీ (9) మాత్రమే అతని ముందున్నాడు. గత ఏడాది కూడా అభిషేక్ 28 బంతుల్లో సెంచరీ బాది, భారత ఆటగాళ్లలో వేగవంతమైన T20 సెంచరీ రికార్డును సమం చేశాడు. అదే ఏడాది అతడు 87 సిక్సులు బాదాడు. ఒక సంవత్సరంలో భారత ఆటగాళ్లలో ఇదే అత్యధికం.
అత్యంత వేగమైన T20 హాఫ్ సెంచరీల జాబితా
* దిపేంద్ర సింగ్ ఐరీ నేపాల్ vs మంగోలియా మ్యాచ్‌లో కేవలం 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.
* ఆశుతోష్ శర్మ రైల్వేస్ vs అరుణాచల్ మ్యాచ్‌లో కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.
* అభిషేక్ శర్మ 12 బంతుల్లో పంజాబ్ vs బెంగాల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు.
* డర్బన్‌లో జరిగిన భారత్ vs ఇంగ్లాండ్ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ 12 బంతుల్లో అర్థ శతకం చేశాడు.
* రెనిగేడ్స్ vs స్ట్రైకర్స్ మ్యాచ్‌లో గేల్ 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.
* కాబుల్ vs బల్ఖ్ మ్యాచ్‌లో హజ్రతుల్లా జజై 12 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు.
* ఎస్టోనియా vs సైప్రస్ మ్యాచ్‌లో సహిల్ చౌహాన్ 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.

