కోట్లాది మందికి మీరు ఆదర్శం.. దేశానికి గర్వకారణం
Indian Women Cricket Team: ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచకప్ 2025లో చారిత్రాత్మక విజయం సాధించిన భారత మహిళా జట్టును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సత్కరించారు. "మీరు కోట్లాది మంది యువతకు, ముఖ్యంగా అమ్మాయిలకు ప్రేరణగా నిలిచారు" అని అభినందించారు.

ప్రపంచకప్ విజేతలతో భారత రాష్ట్రపతి
ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచకప్ 2025లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు గురువారం ఢిల్లీలోని రాష్టప్రతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసింది. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అందరూ ప్లేయర్ల సంతకాలతో ఉన్న టీమ్ జెర్సీని రాష్ట్రపతికి అందజేశారు.
భారత జట్టు దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి మహిళా వన్డే ప్రపంచకప్ ట్రోఫీని మొదటిసారిగా గెలుచుకుంది. ఈ చారిత్రాత్మక విజయాన్ని గుర్తుచేసుకుంటూ రాష్ట్రపతి ముర్ము భారత జట్టును అభినందించారు.
మీరు దేశానికి ప్రేరణ !
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జట్టు సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ.. "మీరు చరిత్ర సృష్టించారు. ఈ విజయం భారత మహిళల శక్తికి ప్రతీక. మీరు యువతకు, ముఖ్యంగా అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచారు" అని పేర్కొన్నారు.
అలాగే, “భారతదేశంలోని ప్రతి మూలలో, ప్రతి ఇంట్లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఈ విజయాన్ని గర్వంగా జరుపుకుంటున్నారు. ఈ జట్టు భారతదేశానికి ప్రతిబింబం. వివిధ ప్రాంతాల నుండి, వేర్వేరు సామాజిక నేపథ్యాల నుండి వచ్చినా, మీరు ఒకే టీమ్ గా భారత్ ను ముందుకు నడిపించారు.. " అని అన్నారు.
భారత జట్టు ధైర్యం, కృషి పై రాష్ట్రపతి ప్రశంసలు
“ఏడు సార్లు ప్రపంచకప్ గెలుచుకున్న ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును ఓడించడం ద్వారా మీరు ప్రతి భారతీయుడిలో విశ్వాసాన్ని పెంచారు. ఈ విజయం క్రీడలో మీ అద్భుతమైన నైపుణ్యం, కష్టపడి సాధించిన ఫలితం" అని రాష్ట్రపతి మహిళా జట్టు పై ప్రశంసలు కురిపించారు.
జట్టు ప్రధాన కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, సపోర్ట్ స్టాఫ్ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. "క్రికెట్ లాంటి జట్టు ఆటలో ప్రతి ఒక్కరూ సమయానుకూలంగా కట్టుబడి ఉండాలి. మీరు అందరూ అదే చేశారు" అని అన్నారు.
అలాగే, న్యూజిలాండ్‌పై విజయానంతరం దేశం మొత్తం నమ్మకం కలిగిందని అన్నారు. మన కుమార్తెలు ఎప్పటికీ వెనక్కి తగ్గరని నిరూపిస్తూ విజయం సాధించాని కొనియాడారు. ఆటగాళ్ల కృషి, క్రమశిక్షణ, కుటుంబాల ఆశీర్వాదాలు ఈ విజయానికి మూలమని ఆమె అభినందించారు.
“మీరు భారత క్రికెట్ చరిత్రలో సువర్ణ పుట రాశారు. భవిష్యత్తులో కూడా భారత క్రికెట్‌ను అగ్రస్థానంలో నిలుపుతారని నాకు నమ్మకం ఉంది” అని అన్నారు.
ట్రోఫీ భారత్‌లోనే ఉంచాలని నిర్ణయించుకున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. “ఈ టోర్నమెంట్ మాకు ప్రత్యేకమైనది. భారత్‌లోనే జరుగుతుందని తెలిసినప్పుడే ఈ ట్రోఫీ దేశం విడిచి వెళ్లనివ్వం అని నిర్ణయించుకున్నాం. మేము మా మీద విశ్వాసం ఉంచుకున్నాం.. విజయాన్ని సాధించాం” అని తెలిపారు.
రాష్ట్రపతి ముర్ముతో ఈ ఆనంద క్షణాలను పంచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ప్రధాని నాయకత్వం మహిళా క్రీడాకారిణుల ఎదుగుదలకు ప్రేరణగా ఉందని అన్నారు.
ప్రధానమంత్రి మోదీతోనూ జట్టు భేటీ
భారత జట్టు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసింది. ఈ సందర్భంగా హర్మన్‌ప్రీత్ కౌర్ 2017లో రన్నరప్‌గా ఉన్నప్పుడు మోదీని కలిసిన అనుభవాన్ని గుర్తు చేశారు. “అప్పుడు మేము రన్నరప్‌గా వచ్చాం, ఇప్పుడు ఛాంపియన్లుగా తిరిగి వచ్చాం” అని చెప్పారు.
ప్రధాని మోదీ యువతలో ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రోత్సహించాలనీ, క్రీడా క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని ఆటగాళ్లను ప్రోత్సహించారు.