- Home
- Sports
- WPL 2026 ఆక్షన్‌కు ముందే ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు.. ఆర్సీబీ రిటెన్షన్ ప్లేయర్లు వీరే
WPL 2026 ఆక్షన్‌కు ముందే ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు.. ఆర్సీబీ రిటెన్షన్ ప్లేయర్లు వీరే
WPL 2026 RCB retention list: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మహిళా జట్టు డబ్ల్యూపీఎల్ 2026 కోసం స్మృతి మంధాన, రిచా ఘోష్ లతో పాటు ప్రత్యర్థి జట్లకు దడపుట్టించే ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

మరో ట్రోఫీ కోసం ఆర్సీబీ సిద్ధం.. రిటెన్షన్ ప్లేయర్లు ఎవరంటే?
2024లో మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ట్రోఫీని గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి బలమైన బృందంతో 2026 మెగా ఆక్షన్‌కు సిద్ధమైంది. జట్టు మేనేజ్‌మెంట్ ఛాంపియన్ జట్టును నిలబెట్టే దిశగా నలుగురు కీలక ఆటగాళ్లను కొనసాగించాలని నిర్ణయించింది. వీరిలో కెప్టెన్ స్మృతి మంధానతో పాటు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ, వికెట్‌కీపర్ బ్యాటర్ రిచా ఘోష్, యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ఉన్నారు.
ఈ నలుగురి కొనసాగింపుతో జట్టు ₹8.85 కోట్లు ఖర్చు చేసింది. మిగిలిన ₹6.15 కోట్లు పర్స్‌లో ఉంచుకుని బెంగళూరు నవంబర్ 27న ఢిల్లీలో జరగనున్న మెగా ఆక్షన్‌లో పాల్గొననుంది.
స్మృతి మంధానతో బలమైన బ్యాటింగ్ తో ఆర్సీబీ
భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యధిక పారితోషికం పొందిన మహిళా ఆటగాళ్లలో ఒకరు. ₹3.50 కోట్లకు ఆర్‌సీబీ ఆమెను కొనసాగించింది. ఆమె 2024లో జట్టుకు మొదటి టైటిల్ అందించడమే కాకుండా, 2025 మహిళా వన్డే వరల్డ్ కప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిందన ప్లేయర్ గా నిలిచింది.
స్మృతి మంధాన నాయకత్వంలో ఆర్‌సీబీకి ఆత్మవిశ్వాసం పెరిగింది. మంధాన బ్యాటింగ్ మాత్రమే కాదు.. వ్యూహాత్మక నిర్ణయాలు కూడా జట్టును విజయపథంలో నడిపించాయి.
ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్ ను రిటైన్ చేసుకున్న ఆర్సీబీ
ఆస్ట్రేలియన్ స్టార్ ఎల్లీస్ పెర్రీ ని ₹2 కోట్లతో ఆర్సీబీ జట్టు రిటైన్ చేసుకుంది. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరైన పెర్రీ, బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ కీలక పాత్ర పోషించారు.
మరోవైపు యువ వికెట్‌కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ ₹2.75 కోట్లకు ఆర్సీబీకి సైన్ చేశారు. ఆమె అద్భుతమైన ఫినిషింగ్ స్కిల్స్, పవర్ హిట్టింగ్ కారణంగా ఆర్సీబీ మేనేజ్‌మెంట్ ఆమెపై నమ్మకం ఉంచింది. రిచా ఘోష్ ప్రదర్శన జట్టు బ్యాటింగ్‌ను మరింత సమతుల్యంగా చేసింది.
శ్రేయాంక పాటిల్.. యంగ్ స్పిన్నర్ పై ఆర్సీబీ బలమైన నమ్మకం
యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ను ఆర్సీబీ ₹60 లక్షలతో మళ్లీ రిటైన్ చేసుకుంది. 2024లో ఆమె 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకుంది. గాయాల కారణంగా 2025 సీజన్‌కు దూరమైనా, ఈసారి ఆమె పూర్తి స్థాయిలో తిరిగి రానుంది. ఆర్సీబీకి ఆమె స్పిన్ బౌలింగ్‌లో కీలక ఆయుధం కానుంది.
ఆర్సీబీ విడుదల చేసిన ప్లేయర్లు ఎవరు?
ఆర్‌సీబీ ఈసారి పెద్ద ఎత్తున మార్పులు చేసింది. సబ్బినేని మేఘనా, స్నేహ రాణా, కనికా ఆహుజా, ఆశా సోభనా, బిష్ట్, రేణుకా సింగ్, అలాగే విదేశీ ఆటగాళ్లు డానీ వైట్-హాడ్జ్, సోఫీ డివైన్, కిమ్ గార్త్, సోఫీ మోలినెక్స్, హీతర్ గ్రాహమ్, జార్జియా వార్‌హామ్, కేట్ క్రాస్ తదితరులను విడుదల చేసింది.
జట్టుకు ఇంకా ఒక రైట్ టు మ్యాచ్ (RTM) కార్డ్ ఉంది. దాంతో ఇప్పుడు వదులుకున్న ఒక ప్లేయర్ ను తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఆర్సీబీకి లభిస్తుంది.