శ్రీ చరణికి షాక్.. ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ జాబితా ఇదే
Delhi Capitals retention list: డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తమ రిటెన్షన్ లిస్టును ప్రకటించింది. ఐసీసీ ఛాంపియన్ ప్లేయర్ జెమిమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మలతో పాటు మారిజానే కాప్ వంటి కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది.

డబ్ల్యూపీఎల్ 2026 వేలానికి సిద్ధమైన ఢిల్లీ క్యాపిటల్స్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను ప్రకటించింది. జీఎంఆర్, జేఎస్‌డబ్ల్యూ గ్రూపుల ఆధీనంలోని ఈ జట్టు మూడు సార్లు ఫైనల్‌కు చేరిన తర్వాత, ఈసారి తమ మొదటి టైటిల్ సాధనే లక్ష్యంగా సమతుల్యమైన జట్టును కొనసాగించడానికి మార్పులు చేస్తోంది.
ఐసీసీ వరల్డ్ కప్ విజేతలైన జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మలను జట్టుతోను ఉంచుకుంది. అయితే, మరో ఛాంపియన్ ప్లయర్ శ్రీ చరణికి షాక్ ఇస్తూ వేలంలోకి వదిలిపెట్టింది. రిటెన్షన్ జాబితాలో మారిజానే కాప్, అన్నాబెల్ సదర్లాండ్, నికి ప్రసాద్ లను కొనసాగించింది. ఈ ఐదుగురు గత మూడు సీజన్లలో ఢిల్లీ జైత్రయాత్రలో కీలక పాత్ర పోషించారు.
ఇండియన్ కంటింజెంట్ బలాన్ని చూపిన జెమీమా, షఫాలీ
భారత జట్టు ప్రపంచ కప్ విజయాల్లో జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ కీలక ప్రదర్శనలు చేశారు. సెమీస్, ఫైనల్‌లో వారి దూకుడు ప్రదర్శన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు లోతైన భారతీయ ప్రతిభను ప్రతిబింబించింది.
జట్టు సహ యజమాని పార్థ్ జిందాల్ మాట్లాడుతూ.. “ఇంత స్థిరమైన, ప్రతిభావంతమైన జట్టులోంచి ఆటగాళ్లను విడుదల చేయడం కష్టమైన పని. కానీ మెగా వేలం సవాళ్లు అలాంటివి మరి. మేము గత మూడు సీజన్లలో సాధించిన విజయాలతో గర్వపడుతున్నాం” అని తెలిపారు.
మా ప్రధాన బలం స్థిరత్వం, జట్టు ఐక్యత: జిందాల్
తమ ప్రధాన బలం స్థిరత్వం, జట్టు ఐక్యత అని జిందాల్ తెలిపారు. “జెమీ, షఫాలీ, మారిజానే, అన్నాబెల్, నికి మా జట్టు ప్రధాన స్తంభాలు. వీరిచుట్టూ కొత్త జట్టును నిర్మించబోతున్నాం. నిలుపుకున్న, విడుదల చేసిన ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు” అని అన్నారు.
“ఈసారి మెగా వేలం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మేము ఈ ఏడాది టైటిల్ సాధిస్తామని నమ్ముతున్నాం” అని పేర్కొన్నారు.
మూడేళ్లుగా స్థిరమైన ప్రదర్శనతో గర్వపడుతున్నాం : కిరణ్ కుమార్ గ్రంధి
ఢిల్లీ జట్టు ఛైర్మన్, సహ యజమాని కిరణ్ కుమార్ గ్రంధి మాట్లాడుతూ.. “డబ్ల్యూపీఎల్ భారత మహిళా క్రికెట్ అభివృద్ధికి అద్భుతమైన వేదికగా మారింది. మా జట్టు గత మూడు సీజన్లలో నిరంతరంగా ఫైనల్ చేరడం మా శ్రమను, కృషిని చూపిస్తుంది” అన్నారు.
“ఇప్పటి దాకా ఉన్న ప్రతిభను ప్రోత్సహించి, దాని చుట్టూ కొత్త ఆటగాళ్లను చేర్చడం మా లక్ష్యం. ఈ మెగా వేలం కొత్త అధ్యాయానికి నాంది అవుతుంది” అని గ్రంధి తెలిపారు.
అదే జోరును కొనసాగిస్తాం: ఢిల్లీ హెడ్ కోచ్ జోనాథన్ బట్టీ
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు హెడ్ కోచ్ జోనాథన్ బాట్టీ మాట్లాడుతూ.. “మేము గత మూడు సీజన్లలో అద్భుతమైన క్రికెట్ ఆడాం. కలిసికట్టుగా ఆడిన జట్టు. ఆటగాళ్లను విడుదల చేయడం ఎప్పుడూ కష్టమే కానీ ఇదే లీగ్ స్వభావం. ఇప్పుడు రిటైన్ చేసుకున్న ప్రధాన ఆటగాళ్ల చుట్టూ జట్టును నిర్మించబోతున్నాం” అని అన్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్, విడుదల జాబితా ఇదే
రిటైన్ ప్లేయర్స్: జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, మారిజానే కాప్, అన్నాబెల్ సదర్లాండ్, నికి ప్రసాద్
విడుదల చేసిన ప్లేయర్స్: మెగ్ లానింగ్, స్నేహ దీప్తి, అలీస్ కాప్సీ, అరుంధతి రెడ్డి, జెస్ జొనాసన్, మిన్ను మణి, ఎన్ చరణి, శిఖా పాండే, నందిని కశ్యప్, సారా బ్రైస్, తనియా భాటియా, రాధా యాదవ్, టిటాస్ సాహు
ఢిల్లీ క్యాపిటల్స్ పర్స్‌లో ఇంకా ఉన్న మొత్తం ₹5.75 కోట్లు. కాగా, డబ్ల్యూపీఎల్, ఐపీఎల్‌లో పాల్గొనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ పేరుతో ప్రారంభమైంది. 2019లో కొత్త రూపంలోకి వచ్చి, 2023లో మహిళా ప్రీమియర్ లీగ్‌లో స్థాపక జట్లలో ఒకటిగా చేరింది. ఇప్పటివరకు జరిగిన మూడు ఎడిషన్లలోనూ ఫైనల్ చేరిన ఏకైక జట్టు ఇది.