టెస్ట్‌లో ట్రిపుల్, వన్డేలో డబుల్ సెంచరీ.. అరుదైన రికార్డ్ వీరిద్ధరి సొంతం
Cricket Records : టెస్ట్‌లో ట్రిపుల్ సెంచరీ, వన్డేలో డబుల్ సెంచరీలు సాధించడం ప్రపంచంలో అరుదైన రికార్డ్. ఈ ఘనతను ఇప్పటివరకు ఇద్దరు దిగ్గజులు మాత్రమే సాధించారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టెస్ట్, వన్డేలో అరుదైన రికార్డు
ప్రపంచ క్రికెట్‌లో కొన్ని రికార్డులు సాధించడం అత్యంత కష్టమైన విషయం. వాటిలో ఒకటి టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ, వన్డే ఇంటర్నేషనల్‌లో డబుల్ సెంచరీ రెండూ ఒకే ఆటగాడు నమోదు చేయడం. ఈ అరుదైన ఘనతను ఇప్పటి వరకు ప్రపంచంలో కేవలం ఇద్దరు బ్యాట్స్‌మెన్లు మాత్రమే సాధించారు. ఈ రికార్డ్‌ను బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఆ ఇద్దరు దిగ్గజాల పూర్తి వివరాలు గమనిస్తే..
వీరేంద్ర సెహ్వాగ్
భారత జట్టు అగ్రెసివ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ రికార్డును అందుకున్న తొలి ప్లేయర్. సెహ్వాగ్ తన కెరీర్‌లో టెస్ట్ క్రికెట్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు బాది చరిత్ర సృష్టించారు.
సెహ్వాగ్ తొలి ట్రిపుల్ 2004లో పాకిస్తాన్‌పై ముల్తాన్‌లో సాధించాడు. ఆ మ్యాచ్‌లో ఆయన 309 పరుగులు నమోదు చేసి భారత జట్టుకు అద్భుత విజయం అందించాడు. రెండో ట్రిపుల్ సెంచరీ 2008లో చెన్నైలో దక్షిణాఫ్రికాపై సాధించాడు. ఈ మ్యాచ్ లో సెహ్వాగ్ 319 పరుగులతో ప్రత్యర్థి జట్టు చమటలు పట్టించాడు.
టెస్ట్ కెరీర్‌లో సెహ్వాగ్ 104 మ్యాచ్‌లు ఆడి, 49.34 సగటుతో 8586 పరుగులు సాధించాడు. ఇందులో ఆయన అత్యధిక స్కోరు 319 పరుగులు.
వన్డేల్లో డబుల్ సెంచరీతో దుమ్మురేపినసెహ్వాగ్
సెహ్వాగ్ మరో అరుదైన రికార్డ్‌ను వన్డేల్లో నమోదు చేశారు. 8 డిసెంబర్ 2011న ఇండోర్ హోల్కర్ స్టేడియంలో వెస్టిండీస్‌పై ఆయన 219 పరుగులు బాది చరిత్రలో చోటు సంపాదించారు. 149 బంతుల్లో 25 ఫోర్లు, 7 సిక్సర్లతో ఆ ఇన్నింగ్స్ వన్డే చరిత్రలో ప్రత్యేకమైన స్థానం సాధించింది.
మొత్తం 251 వన్డేల్లో సెహ్వాగ్ 35.05 సగటుతో 8273 పరుగులు సాధించాడు. ఇందులో 15 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని వన్డే బెస్ట్ స్కోరు 219.
క్రిస్ గేల్
యూనివర్స్ బాస్ గా పేరుగాంచిన క్రిస్ గేల్ కూడా ఈ అరుదైన జాబితాలో ఉన్న మరో బ్యాటర్. గేల్ తన కెరీర్‌లో టెస్ట్ క్రికెట్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు బాదాడు.
2005లో సౌతాఫ్రికాపై ఆంటిగ్వాలో గేల్ 317 పరుగులు బాది తన తొలి ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. 2010లో శ్రీలంకపై గాలే స్టేడియంలో 333 పరుగులు బాది మరో చారిత్రక ఇన్నింగ్స్ ఆడాడు. 103 టెస్టుల్లో గేల్ 42.18 సగటుతో 7214 పరుగులు నమోదు చేశాడు. ఇందులో ఆయన బెస్ట్ స్కోరు 333.
వన్డేల్లో డబుల్ సెంచరీతో గేల్ కొత్త రికార్డు
వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ వన్డేల్లో కూడా చరిత్ర సృష్టించాడు. 24 ఫిబ్రవరి 2015న క్యాన్‌బెరాలో జరిగిన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో జింబాబ్వేపై గేల్ 215 పరుగులు బాదాడు. 147 బంతుల్లో వచ్చిన ఈ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 16 సిక్సర్లు ఉన్నాయి.
గేల్ మొత్తం 301 వన్డే మ్యాచ్‌లు ఆడి, 37.83 సగటుతో 10480 పరుగులు సాధించాడు. అందులో 25 సెంచరీలు, 54 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆయన బెస్ట్ స్కోరు 215.

