విదేశీ లీగ్‌ల్లో ఆడనున్న రో-కో.. ఐపీఎల్ చైర్మన్ ఏమన్నారంటే.?
T20 League: ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెటర్లకు, ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ఆటగాళ్లకు విదేశీ టీ20 లీగ్ లలో ఆడే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆటగాళ్లపై అధిక పనిభారం..

ఐపీఎల్ టోర్నీకి స్పెషల్ ప్లేస్..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రాంచైజీ టీ20 లీగ్ లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ప్రత్యేక స్థానం ఉంది. దీనికి ప్రధాన కారణం, ప్రస్తుతం రిటైర్ కాకుండా ఉన్న ఏ భారత క్రికెట్ ఆటగాడికీ విదేశీ టీ20 లీగ్ లలో ఆడేందుకు అనుమతి లేకపోవడం. ఈ నిబంధన కారణంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, గిల్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్ లో మాత్రమే కనిపిస్తారు.
విదేశీ టీ20 లీగ్‌లలో ఆడే అవకాశం ఉందా.?
ఈ నేపథ్యంలో, భారత ఆటగాళ్లు భవిష్యత్తులో విదేశీ టీ20 లీగ్ లలో ఆడే అవకాశం ఉందా అనే ప్రశ్నకు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. భవిష్యత్తులో టీమిండియా ఆటగాళ్లు ఓవర్సీస్ లీగ్ లలో ఆడే అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్లేయర్ల పై అధిక పనిభారం నిర్వహణే దీనికి ప్రధాన కారణం అని ధుమాల్ పేర్కొన్నారు.
విదేశీ లీగ్ లు ఆడటం మరింత కష్టం..
ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ ఆటగాళ్లకు విదేశీ లీగ్ లు ఆడటం మరింత కష్టం అని ధుమాల్ స్పష్టం చేశారు. కొందరు ప్లేయర్స్ టెస్టులు, వన్డేలు, టీ20లలో ఏదో ఒక ఫార్మాట్లో నిరంతరం ఆడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ లీగ్ లకు వెళ్లడం ఆచరణాత్మకంగా అసాధ్యం అని ఆయన పేర్కొన్నారు. పనిభారం నియంత్రణ అనేది ఆటగాళ్ల ఫిట్నెస్ కు, వారి కెరీర్ కు అత్యంత కీలకం అని ఆయన నొక్కి చెప్పారు.
బౌలర్ల విషయానికొస్తే..
ముఖ్యంగా బౌలర్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం అని ధుమాల్ అభిప్రాయపడ్డారు. కొన్ని సందర్భాల్లో రెండు టెస్టులు ఆడిన తర్వాతే బౌలర్లకు రెస్ట్ ఇవ్వాల్సి వస్తుందని, వన్డేలు, టీ20లలోనూ ఆటగాళ్లకు రొటేషన్ పాటించాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లి లీగ్ లలో ఆడేందుకు పర్మిషన్ ఇస్తే, అది మన జాతీయ జట్టుకు నష్టం కలిగించే అవకాశం ఉందని ఆయన వివరించారు.
దేశీయ టోర్నీలు ఆడటం ముఖ్యం..
బీసీసీఐ నిబంధనల ప్రకారం, అంతర్జాతీయ స్థాయిలో ఆడే ఆటగాళ్లు తప్పనిసరిగా విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లాంటి దేశీయ టోర్నీలలో కూడా పాల్గొనాలి. దేశంలోనే తీరిక లేని క్రికెట్ షెడ్యూల్, ప్రేక్షకుల భారీ ఆదరణ ఉన్నందున విదేశీ లీగ్ లలో ఆడటం కష్టం అని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ వెల్లడించారు. స్టార్ ఆటగాళ్లకు ఇది మరింత అసాధ్యం అని ఆయన స్పష్టం చేశారు. పనిభారం నియంత్రణ అత్యంత కీలకమని, రిటైర్ అయిన తర్వాతే ఈ అవకాశం ఉంటుందని ధుమాల్ తెలిపారు.

