CSK : ధోని టీమ్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2026 నుంచి స్టార్ బౌలర్ అవుట్
CSK : ఐపీఎల్ 2026కు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ నాథన్ ఎల్లిస్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఈ స్టార్ బౌలర్ ను రిప్లేస్ చేసేది ఎవరు?

CSK అభిమానులకు బ్యాడ్ న్యూస్
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్ గాయం కారణంగా రాబోయే టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరుగాంచిన ఎల్లిస్ దూరం కావడం సిఎస్కే బౌలింగ్ విభాగానికి పెద్ద లోటుగా మారనుంది. ఐపీఎల్ 2026 వేలంలో సిఎస్కే యాజమాన్యం నాథన్ ఎల్లిస్‌ను రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను ఆడే అవకాశం లేదని స్పష్టమైంది.
హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో ఎల్లిస్ దూరం
నాథన్ ఎల్లిస్ తన అద్భుతమైన వేరియేషన్లతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో దిట్ట. గత సీజన్లలో పంజాబ్ కింగ్స్ తరపున ఆకట్టుకున్న ఇతనిపై సిఎస్కే గట్టి ఆశలే పెట్టుకుంది. అయితే తాజాగా జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో ఎల్లిస్ హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. వైద్య పరీక్షల అనంతరం అతను కనీసం 6 నుండి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొత్తాని దూరం అయ్యాడు. సిఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు.
రేసులో ఆస్ట్రేలియా స్టార్ జేసన్ బెహ్రెండోర్ఫ్
నాథన్ ఎల్లిస్ స్థానాన్ని భర్తీ చేసే రేసులో మొదటి పేరు జేసన్ బెహ్రెండోర్ఫ్. ఆస్ట్రేలియాకు చెందిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కొత్త బంతితో వికెట్లు తీయడంలో తోపు. బెహ్రెండోర్ఫ్ గతంలో ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 17 మ్యాచ్‌లు ఆడిన అతను 19 వికెట్లు పడగొట్టాడు. లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్‌తో బౌలింగ్ చేయడం ఇతనికి కలిసొచ్చే అంశం. సిఎస్కే యాజమాన్యం ఇతని అనుభవాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
వెస్టిండీస్ సంచలనం షమర్ జోసెఫ్
వెస్టిండీస్ యంగ్ పేసర్ షమర్ జోసెఫ్ కూడా సిఎస్కే రాడార్‌లో ఉన్నాడు. తన వేగంతో అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలనం సృష్టించిన జోసెఫ్, ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున అరంగేట్రం చేశాడు. 2025 మెగా వేలంలో కూడా లక్నో అతన్ని దక్కించుకుంది. 2026 ఎడిషన్ కు ముందు వదులుకుంది. ఇప్పుడు ఎల్లిస్ స్థానంలో సిఎస్కే అతన్ని సంప్రదించే అవకాశం ఉంది. అతని వద్ద ఉన్న రా పేస్ చెన్నై పిచ్‌లపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
రేసులోకి అల్జారీ జోసెఫ్
మరో వెస్టిండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ కూడా రేసులో ఉన్నాడు. ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 6 వికెట్లు తీసి రికార్డు సృష్టించిన ఘనత ఇతనిది. అల్జారీ గతంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ఆడాడు. డెత్ ఓవర్లలో వేగంగా బంతులు వేయగల సామర్థ్యం ఇతని సొంతం. అనుభవజ్ఞుడైన విదేశీ పేసర్ కావాలనుకుంటే సిఎస్కే అల్జారీ వైపు మొగ్గు చూపవచ్చు.
దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ గెరాల్డ్ కోయెట్జీ
దక్షిణాఫ్రికా యువ సంచలనం గెరాల్డ్ కోయెట్జీ కూడా నాథన్ ఎల్లిస్ స్థానానికి సరైన ఎంపిక అని చెప్పవచ్చు. కోయెట్జీ తన దూకుడు బౌలింగ్‌తో వికెట్లు తీయడంలో కీలకంగా వ్యవహరిస్తాడు. గతంలో అతను ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయంగా కూడా కోయెట్జీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సిఎస్కేకు కావాల్సిన డెత్ ఓవర్ల బౌలింగ్‌ను ఇతను సమర్థంగా నిర్వహించగలడు.
అఫ్గాన్ స్టార్ ఫజల్హాక్ ఫారూఖీ
అఫ్గానిస్తాన్ స్టార్ పేసర్ ఫజల్హాక్ ఫారూఖీ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఫారూఖీ తన స్వింగ్, యార్కర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. ఐపీఎల్ కెరీర్‌లో అతను సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల తరపున ఆడాడు. టీ20 క్రికెట్‌లో ఇతనికి ఉన్న అనుభవం సిఎస్కేకు ఎంతగానో ఉపయోగపడుతుంది. విదేశీ బౌలర్ కోటాలో ఫారూఖీ ఒక ఆసక్తికరమైన ఎంపిక కానున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం త్వరలోనే అధికారికంగా నాథన్ ఎల్లిస్ ప్రత్యామ్నాయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో సిఎస్కే తన ఐపీఎల్ 2026 ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

