బంగారు పతకం గెలిచిన మీరాబాయి చాను
Mirabai Chanu : అహ్మదాబాద్‌లో జరిగిన కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్ 2025లో 193కిలోల బరువు ఎత్తి మీరాబాయి చాను బంగారు పతకం గెలిచారు. అలాగే, పురుషుల విభాగంలో భారత యంగ్ వెయిట్ లిప్టర్లు కూడా మెరిశారు.

అహ్మదాబాద్‌లో మీరాబాయి చానుకు గోల్డ్ మెడల్
అహ్మదాబాద్‌లో సోమవారం ప్రారంభమైన కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్ 2025లో భారత స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను బంగారు పతకం సాధించింది. ఇది ఆమెకు పారిస్ ఒలింపిక్స్ 2024 తర్వాతి మొదటి పోటీ.
మహిళల 48 కిలోల విభాగంలో మొత్తం 193 కిలోల బరువుతో (84 కిలోల స్నాచ్ + 109 కిలోల క్లీన్ అండ్ జర్క్) విజయం సాధించింది. ఈ గెలుపుతో కామన్వెల్త్ గేమ్స్ 2026 (గ్లాస్గో)కు నేరుగా అర్హత సాధించింది.
I’m truly delighted to win gold at Commonwealth Championship in Ahmedabad today. Competing at international event after the Paris Olympics made this moment even more special, with the crowd’s support pushing me throughout.
Contd. 1/1 pic.twitter.com/M1Gqaw2VAs— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) August 25, 2025
KNOW
కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్ 2025
స్నాచ్ విభాగంలో మీరాబాయి చాను మొదటి ప్రయత్నంలో విఫలమైంది. రెండో ప్రయత్నంలో 84 కిలోలు విజయవంతంగా ఎత్తింది. మూడో ప్రయత్నంలో 87 కిలోలు ఎత్తడానికి ప్రయత్నించినా, లిఫ్ట్ ఫాల్ అయింది. క్లీన్ అండ్ జర్క్‌లో 105 కిలోలతో ప్రారంభించి, రెండో ప్రయత్నంలో 109 కిలోలు ఎత్తింది. మూడో ప్రయత్నంలో 113 కిలోలు ఎత్తినప్పటికీ సమయ పరిమితిని దాటడంతో స్కోరులో నమోదు కాలేదు.
మరో భారత లిఫ్టర్ సౌమ్య సునిల్ దాల్వి 177 కిలోలు (76+101) ఎత్తి రజతం గెలుచుకోగా, నైజీరియా లిప్టర్ రూత్ అసూక్వో న్యాంగ్ 167 కిలోలు (72+95)తో కాంస్యం దక్కించుకున్నారు.
భారత యంగ్ వెయిట్ లిఫ్టర్ల అద్భుత ప్రదర్శనలు
మహిళల విభాగంలోనే కాకుండా పరుషుల విభాగంలో భారత యంగ్ లిఫ్టర్లు కూడా రాణించారు. పురుషుల 56 కిలోల యువ విభాగంలో ధర్మజ్యోతి దేవఘారియా 224 కిలోలు (97+127) ఎత్తి బంగారు పతకం గెలిచారు. ఇది యూత్ కామన్వెల్త్ రికార్డు. మహిళల 48 కిలోల యూత్ విభాగంలో పాయల్ 166 కిలోలు (73+93) ఎత్తి రికార్డు సృష్టించింది. మహిళల 44 కిలోల యువ విభాగంలో ప్రీతిస్మితా భోయి 150 కిలోలు (63+87)తో బంగారు పతకం దక్కించుకుంది.
పారిస్ నుంచి అహ్మదాబాద్ వరకు మీరాబాయి చాను ప్రయాణం
పారిస్ ఒలింపిక్స్ 2024లో 49 కిలోల విభాగంలో 199 కిలోలు (88+111) ఎత్తిన చాను నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఒక సంవత్సరం విశ్రాంతి తీసుకొని తిరిగి ఈ పోటీ ద్వారా రీఎంట్రీ చేసింది. ఇంటర్నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ కొత్త బరువు విభాగాల్లో 49 కిలోలు రద్దయి 48 కిలోలు ప్రవేశపెట్టడంతో చాను కొత్త సవాల్‌ను స్వీకరించింది.
ఆమె కోచ్ విజయ్ శర్మ మాట్లాడుతూ.. “మేము ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో 200 కిలోల మార్క్‌ను టచ్ చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. ఈ పోటీలో 193 కిలోలతో రీ-స్టార్ట్ బాగానే జరిగింది” అని తెలిపారు.
మీరాబాయి చాను ముందున్న సవాళ్లు ఏమిటి?
మీరాబాయి చానుకు ప్రస్తుతం 31 ఏళ్లు. బరువును 48 కిలోలకు తగ్గించడం, అదే సమయంలో లిప్టింట్ బలాన్ని కోల్పోకుండా ఉండటం పెద్ద సవాల్‌గా మారింది. “1 కిలో తగ్గించడం కూడా కష్టమే. ఆహార నియంత్రణ, వ్యాయామం, లిప్టింగ్ బలం.. ఇలా అన్ని జాగ్రత్తగా సమన్వయం చేయాలి.” అని మీరాబాయి చాను అన్నారు.
విజయ్ శర్మ మాట్లాడుతూ.. “ఇక ముందు 48 కిలోల విభాగంలో స్థిరంగా పోటీపడాలి. చిన్నచిన్న మార్పులతో ఆహార నియంత్రణ చేసి, పోటీ సమయంలో సరిగ్గా 48 కిలోల బరువును సాధించాలి” అని అన్నారు.