అక్కడున్నది కోహ్లీరా బేటా.! అభిమానుల కోసం ఏదైనా చేస్తాడు..
Virat Kohli: విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢిల్లీ తరఫున జనవరి 6న రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌లో అతను బరిలోకి దిగవచ్చని సమాచారం. రోహిత్ శర్మ మాత్రం ఈ ట్రోఫీలో ఇంకే మ్యాచ్‌లూ ఆడడం లేదు.

బరిలోకి దిగలేదు..
విజయ్ హజారే ట్రోఫీలో మూడో రౌండ్ మ్యాచ్‌లు సోమవారం ప్రారంభమైనప్పటికీ, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఈరోజు తమ జట్ల తరఫున బరిలోకి దిగలేదు. ఢిల్లీ తరఫున కోహ్లీ, ముంబై తరఫున రోహిత్ ఇప్పటికే ట్రోఫీలో షెడ్యూల్ ప్రకారం రెండు మ్యాచ్‌లు ఆడారు. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో పాల్గొనడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు త్వరలోనే జాతీయ జట్టుతో కలవాల్సి ఉంది.
మరో మ్యాచ్ ఆడే అవకాశం..
విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. జనవరి 6న ఢిల్లీ, రైల్వేస్ మధ్య జరగనున్న మ్యాచ్‌లో కోహ్లీ బరిలోకి దిగనున్నట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ కూడా ప్రకటన చేసింది. రోహిత్ శర్మ మాత్రం ఈ ట్రోఫీలో ఇంకే మ్యాచ్‌లూ ఆడే అవకాశం లేదు. విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ తన మొదటి మ్యాచ్‌లో సెంచరీని, రెండో మ్యాచ్‌లో అర్ధ సెంచరీని సాధించి ఫామ్‌ను కొనసాగించాడు. రోహిత్ శర్మ తొలి మ్యాచ్‌లో సెంచరీ సాధించినప్పటికీ, రెండో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు.
ఏడు నెలల విరామం తర్వాత..
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దాదాపు ఏడు నెలల విరామం తర్వాత అక్టోబర్ 19న వన్డే క్రికెట్‌లోకి పునరాగమనం చేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అదరగొట్టారు. ఆ సిరీస్‌లో మొదటి వన్డేలో రోహిత్ ఎనిమిది పరుగులు చేయగా, విరాట్ డకౌట్ అయ్యాడు. రెండో మ్యాచ్‌లో రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో తిరిగి ఫామ్‌లోకి రాగా, కోహ్లీ ఈ మ్యాచ్‌లో కూడా డకౌట్ అయ్యాడు. అయితే, మూడో వన్డేలో కోహ్లీ అర్ధశతకంతో ఫామ్‌లోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అజేయ సెంచరీతో సత్తా చాటాడు.
దక్షిణాఫ్రికాతో దుమ్ముదులుపుడే..
ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత, దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో ఈ ‘రోకో జోడీ’ అద్భుతంగా రాణించింది. రాంచీలో జరిగిన మొదటి వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించగా, రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో రాణించాడు. రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలోనూ కోహ్లీ శతకం బాదాడు. అలాగే, విశాఖపట్నంలో జరిగిన మూడో వన్డేలో అజేయ అర్ధ సెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ రెండో వన్డేలో విఫలమైనప్పటికీ, మూడో వన్డేలో అర్ధ సెంచరీతో తిరిగి ఫామ్ అందుకున్నాడు.
వన్డేల్లోనే కొనసాగింపు..
ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టీ20లు, టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. వన్డే ప్రపంచకప్ 2027లో పాల్గొనడమే లక్ష్యంగా ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు ముందుకు సాగుతున్నారు. వారి దృష్టి, ఫిట్‌నెస్, అనుభవం భారత జట్టుకు ఎంతో కీలకం కానున్నాయి.

