తోపులకు షాకిచ్చిన ఆర్సీబీ.. కోహ్లీ టీమ్ రిటైన్ లిస్టు ఇదే
IPL 2026 RCB Retained and Released Players: ఐపీఎల్ 2026కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పలువురు స్టార్లకు షాకిచ్చింది. ఎనిమిది మందిని బయటకు సాగనంపింది. 17 మంది ప్లేయర్లను రిటైన్ చేసింది. ఇద్దరు కన్నడ ఆటగాళ్లకు కూడా గేట్పాస్ ఇచ్చింది.

ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఆర్సీబీలో భారీ మార్పులు
ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన జట్టులో కీలక మార్పులు చేసింది. ఆటగాళ్ల రిటైన్, రిలీజ్ ప్రక్రియకు గడువు ముగియడంతో అన్ని జట్లు జాబితాలను ప్రకటించాయి. ఈ క్రమంలో గత సీజన్‌లో తొలి టైటిల్ గెలుచుకున్న ఆర్సీబీ కూడా ఎనిమిది మంది ఆటగాళ్లను గేట్పాస్ ఇచ్చింది. ఇందులో ఇద్దరు కన్నడ ఆటగాళ్లైన మయాంక్ అగర్వాల్, మనోజ్ భాండగే కూడా ఉన్నారు.
19వ ఎడిషన్ ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్న తరుణంలో ఆర్సీబీ నిర్ణయాలు ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకెత్తించాయి. గత సీజన్‌లో బలమైన జట్టుగా గుర్తింపు పొందిన ఆర్సీబీ.. ఈసారి కూడా కోర్ గ్రూప్‌ను కొనసాగిస్తూ కీలక మార్పులకు సిద్ధమైంది.
ఇద్దరు కన్నడ ఆటగాళ్లకు గేట్పాస్
ఆర్సీబీ చేసిన ముఖ్య నిర్ణయాల్లో ఒకటి, ఇద్దరు స్థానిక హీరోలను రిలీజ్ చేయడమే. మయాంక్ అగర్వాల్ గత సీజన్‌లో దేవదత్ పడిక్కల్ గాయంతో జట్టులోకి వచ్చి ఇంపాక్ట్ ప్లేయర్‌గా రాణించారు. అయినప్పటికీ ఆయనను రిలీజ్ చేయడం ఆశ్చర్యంగా మారింది.
ఇంకా మనోజ్ భాండగేకు ఒకే మ్యాచ్‌లో అవకాశమొచ్చినా సత్తా చూపే అవకాశంగా మారలేదు. దీంతో ఆయనను కూడా జట్టులోంచి తప్పించారు.
లివింగ్‌స్టోన్ సహా మరో ఆరుగురికి ఆర్సీబీ గుడ్ బై
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను కూడా ఆరర్సీబీ రిలీజ్ చేసింది. గత ఏడాది ఆయన ప్రదర్శన నిరాశపరిచింది. 10 మ్యాచ్‌ల్లో 112 పరుగులు, బౌలింగ్‌లో రెండు వికెట్లు మాత్రమే తీసుకోవడంతో ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది.
దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడీ, జింబాబ్వే పేస్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబాని, వికెట్ కీపర్ టిమ్ సైఫర్ట్, యంగ్ ప్లేయర్ స్వస్తిక్ చికార, స్పిన్నర్ మోహిత్ రాథేలను కూడా ఆర్సీబీ విడుదల చేసింది.
ఆర్సీబీ రిలీజ్ చేసిన 8 మంది ప్లేయర్లు వీరే
మయాంక్ అగర్వాల్, మనోజ్ భాండగే, టిమ్ సైఫర్ట్, స్వస్తిక్ చికార, లియామ్ లివింగ్‌స్టోన్, లుంగి ఎంగిడీ, బ్లెస్సింగ్ ముజరబాని, మోహిత్ రాథే.
ఆర్సీబీ రిటైన్ చేసిన 17 మంది ప్లేయర్లు ఎవరు?
గత ఏడాది 18 ఏళ్ల తర్వాత తొలిసారి టైటిల్ గెలుచుకున్న ఆర్సీబీ, కోర్ ప్లేయర్లను కొనసాగించింది. రజత్ పాటీదార్ కెప్టెన్‌గా కొనసాగించబడగా, విరాట్ కోహ్లీ మరో సీజన్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఆయన రిటైర్మెంట్‌పై వచ్చిన ఊహాగానాలకు ఇది ముగింపు పలికింది.
ఆర్సీబీ రిటైన్ చేసిన ప్రధాన ఆటగాళ్లు
రజత్ పాటీదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, రోమారియో షెఫర్డ్, జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, నువాన్ తుషారా, రసిక్ సలాం, అభినందన్ సింగ్, స్వప్నిల్ సింగ్, జేకబ్ బెతెల్, సుయాష్ శర్మ.
ఆర్సీబీ పర్స్‌లో ఇంకా ₹16.40 కోట్లు.. ఎవరి కోసం?
ఆర్సీబీ ఎనిమిది మందిని రిలీజ్ చేసిన తర్వాత జట్టు వద్ద మినీ వేలానికి ₹16.40 కోట్లు మిగిలాయి. మొత్తం 8 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అందులో 2 విదేశీ స్లాట్లు కూడా ఉన్నాయి. ఈ నిధులతో ఏ ఆటగాళ్లను జట్టు లక్ష్యంగా పెట్టుకుంటుందన్నది ఆసక్తికర అంశంగా ఉంది.
ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 15 లేదా 16న జరగనున్నట్లు అంచనా. ఇది వరుసగా మూడోసారి భారత్ బయట జరుగుతున్న వేలం అవుతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈసారి అబుదాబీలో జరిగే అవకాశం ఉంది.