T20 World Cup 2026 Final : భారత్ vs న్యూజిలాండ్.. అసలైన యుద్ధం మొదలైంది !
T20 World Cup 2026 Final : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరు మొదలైంది. టాస్ గెలిచిన కివీస్ బౌలింగ్ ఎంచుకోగా, భారత్ భారీ స్కోరు లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

ప్రపంచకప్ ఫైనల్.. భారత్ vs న్యూజిలాండ్
అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం, నరేంద్ర మోదీ స్టేడియంలో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 తుది పోరు ప్రారంభమైంది. కోట్లాది మంది భారతీయుల నిరీక్షణకు తెరదించుతూ, డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, నిలకడకు మారుపేరైన న్యూజిలాండ్ జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నారు.
టాస్ గెలిచిన న్యూజిలాండ్.. భారత్ బ్యాటింగ్
టాస్ గెలిచిన అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. పిచ్ బాగుందని, మొదట బౌలింగ్ చేసి భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ.. "మేము కూడా మొదట బ్యాటింగ్ చేయడానికే ఇష్టపడుతున్నాం. ఫైనల్ లాంటి ఒత్తిడి ఉన్న మ్యాచ్‌ల్లో బోర్డుపై భారీ స్కోరు ఉండటం ఎప్పుడూ మంచిదే. గత రికార్డులు పక్కన పెట్టి, ఈ కొత్త ప్రపంచకప్‌లో సత్తా చాటతాం" అని ధీమా వ్యక్తం చేశారు.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తుది జట్లు, వ్యూహాలు ఏమిటి?
భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండా సెమీఫైనల్ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. యువ సంచలనం అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగా రానుండగా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ మిడిల్ ఆర్డర్‌ను నడిపించనున్నారు. కివీస్ జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. మెక్కోన్చీ స్థానంలో జాకబ్ డఫీ జట్టులోకి వచ్చాడు. ఆశ్చర్యకరంగా కివీస్ అదనపు ఆఫ్ స్పిన్నర్‌ను తీసుకోలేదు, ఇది అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లకు కలిసొచ్చే అంశం.
భారత తుది జట్టు: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.
కీలక ఆటగాళ్ల మధ్య పోరు
ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ ఫిన్ అలెన్ మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది. ఫిన్ అలెన్ మాట్లాడుతూ.. తాను బౌలర్‌ను చూసి భయపడనని, బంతిని మాత్రమే చూసి ఆడతానని పేర్కొన్నాడు. మరోవైపు, కివీస్‌పై అద్భుతమైన రికార్డు ఉన్న అర్ష్‌దీప్ సింగ్ (9 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) మరోసారి విజృంభించాలని అభిమానులు కోరుకుంటున్నారు. హార్దిక్ పాండ్యా ఈ మైదానంలో గతంలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన అనుభవంతో క్లచ్ ప్లేయర్‌గా మారే అవకాశం ఉంది.
పిచ్ రిపోర్ట్.. వాతావరణ పరిస్థితులు ఇవే
పిచ్ రిపోర్ట్ ప్రకారం, అహ్మదాబాద్ ఉపరితలం ఎరుపు, నలుపు మట్టి మిశ్రమంతో కూడి ఉంది. ఇయాన్ బిషప్ విశ్లేషణ ప్రకారం, ఇది బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. ఇక్కడ 190 నుండి 200 పరుగులు చేసే అవకాశం ఉంది. స్టేడియం అంతా నీలిరంగు దుస్తులతో నిండిపోయింది. 2023 నవంబర్ 19న ఇదే గ్రౌండ్ లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ చేదు జ్ఞాపకాలను తుడిచివేయాలని భారత్ భావిస్తోంది.
ఇండియా vs న్యూజిలాండ్ గణాంకాలు ఏం చెబుతున్నాయి?
న్యూజిలాండ్ బ్యాటింగ్‌లో ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ జంటపై 48% ఆధారపడి ఉంది. వారిని త్వరగా అవుట్ చేస్తే భారత్ పైచేయి సాధిస్తుంది. అభిషేక్ శర్మ ఇప్పటివరకు ఈ వరల్డ్ కప్‌లో ఆఫ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో తడబడ్డాడు (సగటు 13). సంజు శాంసన్ కూడా మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో మూడుసార్లు అవుట్ అయ్యాడు. ఈ బలహీనతలను అధిగమిస్తే భారత్‌కు తిరుగుండదు. గత రెండు ఏళ్లలో టీ20ల్లో 80% విజయాల రేటు ఉన్న టీమ్ ఇండియా, ఈసారి కూడా టైటిల్ నిలుపుకోవాలని పట్టుదలతో ఉంది.

