- Home
- Sports
- India vs England 4th Test : ఒక్క ఛాన్స్ అంటే సరిపోదు బ్రో... సరిగ్గా ఆడకుండే సాగనంపేస్తారని తెలీదా?
India vs England 4th Test : ఒక్క ఛాన్స్ అంటే సరిపోదు బ్రో... సరిగ్గా ఆడకుండే సాగనంపేస్తారని తెలీదా?
ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సీరిస్ మరింత రసవత్తరంగా మారింది. 2-1 తో టీమిండియా కంటే ఇంగ్లాండ్ ముందంజలో ఉంది… ఈ క్రమంలో కీలకమైన నాలుగో టెస్టుకు టీమిండియాలో మార్పులు తప్పేలా లేవు. మరి ఆ యువ ప్లేయర్ పై వేటు పడుతుందా?

ఒక్క ఛాన్స్ అన్నావ్... ఆరు ఛాన్సులిచ్చినా ఆడలేవుగా
India vs England 4th Test : 'డియర్ క్రికెట్... నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వు'... ఓ టీమిండియా యువ క్రికెటర్ ఎంతో ఆవేదనతో చేసిన ఈ కామెంట్ క్రికెట్ అభిమానులనే కాదు సామాన్యులను సైతం కదిలించింది. చాలామంది అతడికి బిసిసిఐ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు, డిమాండ్ చేశారు. దీంతో అతడు కోరుకున్నట్లుగానే మరో అవకాశం దక్కింది. కానీ దీన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఆ యంగ్ ప్లేయర్... చివరకు భారత జట్టుకు భారంగా మారిపోయాడు. దీంతో గతంలో మద్దతుగా నిలిచిన అభిమానులే అతడిని జట్టులోంచి తప్పించాలని కోరుతున్నారు... ఈ యువ ఆటగాడు ఇంకెవరో కాదు కరుణ్ నాయర్.
ఇంగ్లాండ్ పై గతంలో ట్రిపుల్ సెంచరీ సాధించిన రికార్డ్ ఉండటం... దేశవాళి క్రికెట్లో అద్భుతంగా ఆడుతుండటంతో కరుణ్ నాయర్ కు మరోసారి టీమిండియాలో చోటుదక్కింది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశం తలుపుతట్టడంతో అతడు పొడిచేస్తాడని అభిమానులు భావించారు. కానీ నాయర్ ఆటలో ఆ కసి మాత్రం కనిపించడంలేదు. దీంంతో అతడికి ఇచ్చిన అవకాశాలు చాలు... తర్వాతి టెస్ట్ లో ఇక ఆడించరాదని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కరుణ్ నాయర్ పై వేటు తప్పదా?
ఇంగ్లాండ్ టూర్ లో వరుస అవకాశాలు దక్కినా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు టీమిండియా యంగ్ ప్లేయర్ కరుణ్ నాయర్. మొదటి టెస్ట్ నుండి అతడికి అవకాశాాలు వస్తూనే ఉన్నాయి... కానీ ఇప్పటివరకు అతడు ఆరు ఇన్నింగ్సుల్లో కేవలం వంద పరుగులు మాత్రమే చేసాడు. గత మ్యాచ్ లో కీలక సమయంలో బ్యాటింగ్ కు దిగిన అతడు అభిమానులను మరోసారి నిరాశ పర్చాడు. దీంతో అతడిపై ఇక వేటు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి.
ఇంగ్లాండ్ సీరీస్ లో కరుణ్ నాయర్ ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచుల్లో ఆడాడు.. ఈ ఆరు ఇన్నింగ్సుల్లో అతడు చేసింది 0, 20, 31, 26, 40, 14 పరుగులు మాత్రమే. దీంతో ఇక తర్వాతి మ్యాచ్ కు అతడికి అవకాశం దక్కడం కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
కరుణ్ నాయర్ స్థానంలో ఎవరు?
టీమిండియాకు లార్డ్స్ టెస్టులో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నా ఓటమిపాలయ్యింది... ఇందులో బ్యాట్ మెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం 193 పరుగుల లక్ష్యాన్ని చేధించడంతో భారత జట్టు విఫలమయ్యింది... గెలవాల్సిన మ్యాచ్ ను 22 పరుగుల తేడా ఓడిపోయింది.
కీలమైన ఈ మ్యాచ్ లో కూడా సరిగ్గా ఆడకపోవడంతో కరుణ్ నాయర్ పై టీమిండియా మేనేజ్మెంట్ సీరియస్ గా ఉందని… ఈ క్రమంలోనే మాంచెస్టర్ లో జరిగే నాలుగో టెస్టులో అతడికి తుదిజట్టులో అవకాశం దక్కపోవచ్చని ప్రచారం జోరుగా సాగుతోంది. తిరిగి సాయి సుదర్శన్ లేదంటే అభిమన్యు ఈశ్వరన్ ను జట్టులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
రిషబ్ పంత్ కు గాయం.. మరి మాంచెస్టర్ లో ఆడతాడా?
ఇంగ్లాండ్ తో జులై 23 నుండి మాంచెస్టర్ మైదానంలో టీమిండియా నాలుగో టెస్ట్ ఆడనుంది. ఇప్పటికే మూడు టెస్టులు ముగియగా ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది... దీంతో నాలుగో టెస్ట్ సీరిస్ విజయంలో కీలకంగా మారనుంది. ఇలాంటి మ్యాచ్ కు ముందు టీమిండియాను గాయాలు భయపెడుతున్నాయి.
లార్డ్స్ టెస్ట్ లో గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాంచెస్టర్ టెస్ట్ లో ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది. గాయం తర్వాత అతడు బ్యాటింగ్ లో కాస్త ఇబ్బంది పడటం కనిపించింది... కీలకమైన రెండో ఇన్నింగ్స్ అతడు తక్కువ పరుగులకే ఔటయ్యాడు. కాబట్టి తర్వాతి మ్యాచ్ కు అతడు ఆడటంపై అనుమానాలు మొదలయ్యాయి. గాయం కారణంగా పంత్ నాలుగో టెస్ట్ కు దూరమైతే ఇది భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది.
బుమ్రా సంగతేంటి?
టీమిండియా టాప్ బౌలర్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా కూడా నాలుగో టెస్టుకు దూరమయ్యే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. అతడికి రెస్ట్ ఇచ్చే అవకాశాలున్నాయట ... ఇదే జరిగితే టీమిండియా బౌలింగ్ బలహీనపడుతుంది.
ఆసక్తికర విషయం ఏమిటంటే బుమ్రా జట్టులో లేకుండానే రెండో టెస్ట్ లో టీమిండియా విజయం సాధించింది... కానీ అతడు ఆడిన మొదటి, మూడో మ్యాచ్ ను ఓడింది. కాబట్టి బుమ్రా లేకున్నా టీమిండియా బౌలింగ్ బాగానే ఉందని... బ్యాటింగ్ లోనే మరింత మెరుగుపడాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిరాజ్, ఆకాష్ దీప్ అద్భుతంగా బౌలింగ్ చేస్తుండటంతో బుమ్రా లేకున్నా పెద్ద నష్టమేమీ ఉండదంటున్నారు.

