- Home
- Sports
- Women's T20 World Cup 2026 : అదరగొట్టిన తెలుగమ్మాయి.. నెదర్లాండ్స్‌పై భారత్ భారీ విజయం వెనకున్న టాప్ రీజన్స్ ఇవే
Women's T20 World Cup 2026 : అదరగొట్టిన తెలుగమ్మాయి.. నెదర్లాండ్స్‌పై భారత్ భారీ విజయం వెనకున్న టాప్ రీజన్స్ ఇవే
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 లో టీమిండియా అదరగొడుతోంది. నెదర్లాండ్స్‌పై ఏకంగా 95 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి విజయపరంపర కొనసాగిస్తోంది. ఈ మ్యాచ్ లో హర్మన్ సేన గెలుపుకు రీజన్స్ ఏంటో తెలుసుకుందాం.

నెదర్లాండ్ పై టిమిండియా అద్భుత విజయం
ICC Womens T20 World Cup 2026 : మహిళల టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ A మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న నెదర్లాండ్స్‌పై ఏకంగా 95 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 209/5 పరుగుల స్కోరు చేసింది. ఆ తర్వాత నెదర్లాండ్స్‌ను 17.3 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ చేసింది. శ్రీ చరణి (4/17), షఫాలీ వర్మ (3/20), నందిని శర్మ (2/22), దీప్తి శర్మ (1/26) వికెట్లు పడగొట్టి డచ్ జట్టును కట్టడి చేశారు. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్‌పై భారత్ సాధించిన ఈ అద్భుత విజయంలోని కీలక అంశాలను ఇప్పుడు చూద్దాం.
1. మందాన మాస్ బ్యాటింగ్
పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 44 బంతుల్లో 68 పరుగులు చేసిన స్మృతి మంధాన, అదే జోరును నెదర్లాండ్స్‌పైనా కొనసాగించింది. ఈ మ్యాచ్‌లో 47 బంతుల్లో 74 పరుగులతో అదరగొట్టింది. ఇందులో 11 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఆమె స్ట్రైక్ రేట్ 157.45గా ఉంది.
మొదట 30 బంతుల్లో 35 పరుగులు చేసి నెమ్మదిగా ఆడిన భారత వైస్-కెప్టెన్, ఆ తర్వాత గేర్ మార్చింది. కేవలం 17 బంతుల్లోనే 39 పరుగులు చేసి, 229.41 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం సృష్టించింది. 15వ ఓవర్లో సిల్వర్ సీజర్స్ బౌలింగ్‌లో వరుసగా నాలుగు ఫోర్లు కొట్టింది. ఈ టోర్నీలో రెండు మ్యాచ్‌ల్లో కలిపి మంధాన 71.00 సగటు, 156.04 స్ట్రైక్ రేట్‌తో 142 పరుగులు చేసింది. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
2. షఫాలి వర్మ్ ఆల్రౌండ్ షో
పాకిస్థాన్‌పై విఫలమైన షఫాలీ వర్మ, డచ్ జట్టుపై తన ఫామ్‌ను తిరిగి అందుకుంది. 38 బంతుల్లో 55 పరుగుల దూకుడైన ఇన్నింగ్స్ ఆడింది. ఆమె ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు ఉన్నాయి. స్మృతి మంధానతో కలిసి 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, జట్టు భారీ స్కోరు (209/5)కు పునాది వేసింది.
బ్యాటింగ్‌లోనే కాకుండా బంతితోనూ షఫాలీ అద్భుతంగా రాణించింది. స్టెర్రీ కాలిస్, సిల్వర్ సీజర్స్, ఇసాబెల్ వోనింగ్‌ల వికెట్లు తీసి నెదర్లాండ్స్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీసింది. ఆమె ఆల్ రౌండ్ ప్రదర్శన భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లతో జరగబోయే కీలక మ్యాచ్‌ల ముందు షఫాలీ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు పెద్ద ప్లస్ పాయింట్.
3. శ్రేయాస్ పాటిల్ గాయం
నెదర్లాండ్స్‌పై టీమిండియా 95 పరుగుల తేడాతో ఘన విజయం సాధించినప్పటికీ ఈ ఆనందంలో కొద్దిగా ఆందోళన కలిగించే విషయం జరిగింది. ఆఫ్-స్పిన్నింగ్ ఆల్-రౌండర్ శ్రేయాంక పాటిల్ గాయపడటం జట్టు సభ్యులతో పాటు డగౌట్‌లోనూ ఆందోళన రేకెత్తించింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఈ ఘటన జరిగింది. బౌలింగ్ ఫాలో-త్రూలో బంతిని ఆపే ప్రయత్నంలో శ్రేయాంక కుడి కాలు మడిమ మలుపు తిరిగింది. నొప్పితో విలవిలలాడుతున్న ఆమె దగ్గరకు వెంటనే ఫిజియోథెరపిస్ట్ వచ్చారు. కానీ కాలు మీద బరువు మోపలేని స్థితిలో ఉండటంతో, స్ట్రెచర్‌పై మైదానం వీడింది. ఆ తర్వాత మ్యాచ్‌లో ఆమె పాల్గొనలేదు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలతో జరగబోయే కీలక మ్యాచ్‌లకు ఈ స్పిన్నర్ దూరమవుతుందా లేదా అనే దానిపై బీసీసీఐ అధికారిక ప్రకటన కోసం అభిమానులు, జట్టు యాజమాన్యం ఎదురుచూస్తున్నారు.
4. అదరగొట్టిన తెలుగమ్మాయి
లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ శ్రీ చరణి తన స్పిన్ బౌలింగ్‌తో మాయ చేసింది. దీప్తి శర్మ, షఫాలీ వర్మలతో కలిసి మిడిల్ ఓవర్లలో పరుగులను నియంత్రించడంలో కీలక పాత్ర పోషించింది. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో డచ్ లైనప్‌కు చుక్కలు చూపించింది ఈ తెలుగమ్మాయి. రాబిన్ రిజ్కే, ఫ్రెడరిక్ ఓవర్‌డిజ్క్, మిర్తే వాన్ డెన్ రాడ్, ఐరిస్ జ్విల్లింగ్ వంటి కీలక వికెట్లను పడగొట్టింది. దీంతో డచ్ జట్టు కోలుకునే అవకాశమే లేకుండా పోయింది. ప్రమాదకరమైన ప్రాంతాల్లో బంతిని వేస్తూ, పదునైన టర్న్ రాబడుతూ మిడిల్ ఆర్డర్‌ను హడలెత్తించింది. ఈ టోర్నీలో రెండు మ్యాచ్‌ల్లో శ్రీ చరణి 5.71 సగటు, 5.00 ఎకానమీ రేటుతో ఏడు వికెట్లు పడగొట్టింది.
5. అదిరిపోయే ఆరంభం
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 వేటను ఇంతకంటే గొప్పగా ప్రారంభించడం టీమిండియాకు సాధ్యం కాదు. పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై వరుస విజయాలు సాధించింది. పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ మొదట తడబడ్డా, ఆ తర్వాత పుంజుకుని గెలిచే స్కోరు చేసింది. నెదర్లాండ్స్‌పై 95 పరుగుల తేడాతో సాధించిన విజయంతో గ్రూప్ A స్టాండింగ్స్‌లో భారత్ తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. వరుసగా రెండు విజయాలు సాధించి నాలుగు పాయింట్లు పొందడమే కాకుండా, నెట్ రన్ రేట్‌ను (+3.975) గణనీయంగా మెరుగుపరుచుకుంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలతో జరగబోయే కీలక మ్యాచ్‌లలో ఇదే జోరును కొనసాగించి సెమీ-ఫైనల్స్‌లో తమ స్థానాన్ని ఖాయం చేసుకోవాలని భారత జట్టు చూస్తోంది.

