IND vs NZ : టీమిండియాలో భారీ మార్పులు.. స్టార్ బౌలర్ అవుట్, అయ్యర్ రీఎంట్రీ !
IND vs NZ : భారత్, న్యూజిలాండ్ T20 సిరీస్‌కు ముందు బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. గాయంతో వాషింగ్టన్ సుందర్ ఈ సిరీస్ కు దూరం అయ్యాడు. రవి బిష్ణోయ్, శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

IND vs NZ : కివీస్ సిరీస్‌కు భారత కొత్త జట్టు ఇదే.. ఇద్దరు స్టార్లు మిస్ !
IND vs NZ T20I Squad Update : భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రతిష్ఠాత్మక సిరీస్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మూడవ వన్డే మ్యాచ్ ప్రారంభానికి కేవలం కొన్ని గంటల సమయం ఉండగా, జనవరి 21 నుండి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక ప్రకటన చేసింది. సిరీస్ ప్రారంభానికి ఐదు రోజుల ముందే భారత జట్టులో రెండు భారీ మార్పులను సెలెక్షన్ కమిటీ ప్రకటించింది.
గాయాలు టీమిండియాను మరోసారి వెంటాడాయి. గాయం కారణంగా స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అదే సమయంలో, స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
బీసీసీఐ అధికారిక ప్రకటన.. భారత జట్టులోకి ఎవరెవరు వచ్చారు?
రాబోయే టి20 సిరీస్ కోసం జట్టులో జరిగిన మార్పులపై బీసీసీఐ ఒక అధికారిక అడ్వైజరీని విడుదల చేసింది. దీని ప్రకారం, వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను ఎంపిక చేశారు. అలాగే, గాయపడిన తిలక్ వర్మ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని బోర్డు తెలిపింది.
వాషింగ్టన్ సుందర్ గాయం ఎలా అయ్యింది?
వాషింగ్టన్ సుందర్ సిరీస్ నుండి తప్పుకోవడానికి ప్రధాన కారణం సైడ్ స్ట్రెయిన్. పక్కటెముకల భాగంలో నొప్పి రావడంతో అతను దూరం అయ్యాడు. జనవరి 11న వడోదరలోని బీసీఏ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది.
బౌలింగ్ చేస్తున్న సమయంలో సుందర్ తన దిగువ పక్కటెముకల ప్రాంతంలో ఆకస్మికంగా తీవ్రమైన నొప్పిని అనుభవించాడు. దీంతో అతను వెంటనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అప్పటి నుండి అతను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.
సుందర్ ఎప్పుడు ఫిట్ అవుతాడు?
సుందర్ గాయంపై స్పష్టత కోసం స్కానింగ్ నిర్వహించారు. స్కానింగ్ రిపోర్టుల తర్వాత అతను ఒక స్పెషలిస్ట్ డాక్టర్‌ను కూడా సంప్రదించాడు. వైద్య పరీక్షల్లో అతనికి సైడ్ స్ట్రెయిన్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యులు అతనికి కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
తదుపరి చికిత్స, కోలుకునే ప్రక్రియ కోసం వాషింగ్టన్ సుందర్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) కు రిపోర్ట్ చేయనున్నాడు. అతని స్థానంలో సెలెక్షన్ కమిటీ రవి బిష్ణోయ్‌ను ఎంపిక చేసింది.
తిలక్ వర్మ ప్లేస్‌లో శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ
మరోవైపు, టీ20 జట్టులో మరో కీలక మార్పు జరిగింది. గాయపడిన యువ ఆటగాడు తిలక్ వర్మ స్థానంలో సీనియర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేశారు. అయితే, శ్రేయస్ అయ్యర్ కేవలం సిరీస్‌లోని మొదటి మూడు టీ20 మ్యాచ్‌లకు మాత్రమే జట్టులో ఉంటాడు.
రాబోయే టీ20 ప్రపంచ కప్ దృష్ట్యా ఈ 5 మ్యాచ్‌ల సిరీస్ భారత్‌కు ఎంతో కీలకం కానుంది. జనవరి 21న తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లో కివీస్ జట్టు భారత్‌కు గట్టి పోటీ ఇస్తోంది, సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది.
భారత్ అప్‌డేటెడ్ టీ20 జట్టు వివరాలు
బీసీసీఐ ప్రకటించిన మార్పుల తర్వాత న్యూజిలాండ్‌తో తలపడే భారత టీ20 జట్టులో ప్లేయర్ల వివరాలు గమనిస్తే.. సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (మొదటి మూడు టీ20లకు మాత్రమే), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్,
మూడవ వన్డే ముగిసిన వెంటనే, జనవరి 21న టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. గాయం నుంచి కోలుకోవడానికి సుందర్ ఎన్‌సీఏకి వెళ్తుండగా, శ్రేయస్ అయ్యర్ జట్టుతో కలవనున్నాడు.

