మోడీ సర్ గంభీర్, అగార్కర్ లను ఎలిమినేట్ చేసేయండి.. టీమిండియాలో గందరగోళం !
Team India: టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం ఇంకా భారత జట్టు స్పష్టమైన కూర్పును పొందకపోవడం, ఇంకా ప్రయోగాలతో గందరగోళం నెలకొంది. హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ కాంబినేషన్ నిర్ణయాలపై అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

త్వరలో టీ20 వరల్డ్‌కప్.. ఇంకా అనిశ్చితిలోనే భారత జట్టు
2026 టీ20 వరల్డ్‌కప్ ప్రారంభానికి ఇంకా మూడు నెలలే మిగిలి ఉన్నాయి. ఈ సమయంలో సాధారణంగా ప్రతి దేశం తమ ప్రధాన జట్టును ఖరారు చేసుకుంటుంది. కానీ భారత జట్టు మాత్రం ఇంకా ప్రయోగాలు చేస్తూనే ఉంది. ప్రధాన కోచ్ గా గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ ఉన్న ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
వారు తీసుకుంటున్న నిర్ణయాలు జట్టు స్థిరత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అభిమానులు సోషల్ మీడియాలో తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూ గంభీర్, అగార్కర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్లేయర్ల ఎంపికలో గంభీర్ ప్రయోగాల పై ప్రశ్నలు
టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్ తీసుకున్న నిర్ణయాలు ఫ్యాన్స్‌ను అయోమయంలోకి నెడుతున్నాయి. ఫామ్ లో ఉన్న యశస్వి జైస్వాల్‌ను పక్కన పెట్టడం, అర్షదీప్ సింగ్‌ను జట్టులో ఉంచి కూడా మ్యాచ్‌ల్లో అవకాశాలు ఇవ్వకపోవడం అభిమానుల్లో ఆగ్రహానికి కారణమైంది.
అదే సమయంలో హర్షిత్ రాణా వరుసగా ఖరీదైన ఓవర్లు వేస్తున్నా, నిరంతరం ఛాన్స్‌లు ఇస్తున్నారు. కొన్నిసార్లు ఆయనను బ్యాటింగ్ ఆర్డర్‌లో శివమ్ దూబే కంటే ముందుగా పంపడం కూడా విమర్శలకు కారణమైంది.
ఆసీస్ తో వన్డే మ్యాచ్‌లో కూడా సిరాజ్, అక్షర్ లాంటి ప్రధాన బౌలర్లకు బదులు హర్షిత్ రాణాకు ఎక్కువగా బౌలింగ్ అవకాశాలు ఇవ్వడం కూడా అభిమానులను షాక్ కు గురిచేసింది.
బ్యాటింగ్ ఆర్డర్‌లో స్థిరత్వం లేకపోవడం
ప్రతి మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా మారిపోతుంది. ఒక రోజు సంజూ శాంసన్ నంబర్ 3లో వస్తే, మరుసటి మ్యాచ్‌లో నంబర్ 6లో కనిపిస్తాడు. శివమ్ దూబే ఒక మ్యాచ్‌లో టాప్ ఆర్డర్‌లో ఉంటే, ఇంకో మ్యాచ్‌లో నంబర్ 8లో బ్యాటింగ్ చేస్తున్నాడు.
ఇలాంటి మార్పులు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. జట్టు కాంబినేషన్‌పై ప్రభావం చూపుతున్నాయని మాజీ క్రికెటర్లు కూడా సూచించారు. దీని క్రికెట్ ఫ్యాన్స్ ఘాటుగానే కామెంట్స్ చేస్తున్నారు.
స్పిన్నర్ల పై భారం.. పేసర్ల పై నిర్లక్ష్యం
గంభీర్ తీసుకున్న నిర్ణయాల్లో మరో కీలక అంశం పేస్ ట్రాక్‌లపై ముగ్గురు స్పిన్నర్లను ఆడించడం. సాధారణంగా పిచ్ ట్రాక్ కు అనుగుణంగా బౌలర్లు, బ్యాటర్లతో జట్టును సమతూకం చేస్తారు. అయితే, పేస్ ట్రాక్ పై ఆడుతున్నప్పుడు కూడా అర్షదీప్ సింగ్ లాంటి ప్రతిభావంతుడిని ఆడించకపోవడం అనే నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారో అభిమానులకు అర్థం కావడం లేదు.
పిచ్ పరిస్థితులు, వ్యూహాత్మక అవసరాలు పరిగణనలోకి తీసుకోకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జట్టు కాంబినేషన్‌లో గందరగోళాన్ని సృష్టించింది.
సెలెక్షన్‌లో అగార్కర్ ప్రభావం.. ముంబై ప్లేయర్లకు ప్రాధాన్యం?
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఎంపికలలో ముంబై ప్లేయర్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఫామ్ లో ఉన్న జైస్వాల్‌ను విస్మరించి, నితీష్ రాణా, శివమ్ దూబే వంటి అనిశ్చిత ఫామ్ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వడం అభిమానుల్లో ఆగ్రహం రేపింది. విశ్లేషకులు కూడా ఈ తరహా సెలెక్షన్ జట్టు సమతుల్యతను దెబ్బతీస్తుందని సూచిస్తున్నారు.
ఫేవరిటిజం ఆరోపణలు, గ్రెగ్ చాపెల్ కాలాన్ని గుర్తు చేస్తూ.. !
కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రమైన ఫేవరిటిజం ఆరోపణలు గుప్పించారు. జట్టు కూర్పుపై చాలానే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. “ఇది టీమ్ ఇండియానా? లేక గంభీర్ టీమ్ నా?” అంటూ ఘాటుగానే స్పందిస్తున్నారు. ప్రస్తుత టీమ్ వాతావరణం గ్రెగ్ చాపెల్ కాలం గుర్తు చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అప్పుడు లాగే ఇప్పుడు కూడా జట్టు అంతర్గతంగా అనిశ్చితి, అసంతృప్తి, ఫేవరిటిజం కనిపిస్తున్నాయి. వరల్డ్‌కప్ ముందు స్థిరమైన కాంబినేషన్ దొరకకపోతే, భారత జట్టు మరోసారి నిరాశను చవిచూడవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
సమయం తక్కువ, స్పష్టమైన దిశా అవసరం
భారత జట్టులో ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు కొరతలేదు. కానీ అస్థిరమైన సెలెక్షన్, ఫేవరిటిజం, వ్యూహరహిత నిర్ణయాలు జట్టు కాంక్షలకు అడ్డుకట్టవుతున్నాయి. వరల్డ్‌కప్ సమీపిస్తున్న నేపథ్యంలో గంభీర్, అగార్కర్ ఇద్దరూ వ్యక్తిగత అభిరుచులు పక్కనపెట్టి జట్టు ప్రయోజనాన్ని మాత్రమే దృష్టిలో ఉంచాలని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ను కోల్పోయాము. ఇప్పుడు టీ20 సిరీస్ లో మళ్లీ ఓటములు.. ఇదే తరహా తీరు కొనసాగితే భారత జట్టుకు తీవ్రమైన నష్టం జరుగుతుందనీ, భవిష్యత్ ప్రణాళికలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు.