Fauja Singh: వరల్డ్ ఓల్డెస్ట్ మారథాన్ రన్నర్.. 114 ఏళ్ల ఫౌజా సింగ్ మృతి
Fauja Singh: ప్రపంచ ప్రసిద్ధ మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ (114 ఏళ్లు) మరణించారు. పంజాబ్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన మృతిచెందారు.

114 ఏళ్ల మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్
ప్రపంచంలోనే అత్యధిక వయసు కలిగిన మారథాన్ రన్నర్ గా గుర్తింపు పొందిన ఫౌజా సింగ్ (114 సంత్సరాలు) మరణించారు. పంజాబ్‌లోని బీయాస్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతిచెందారు.
సోమవారం మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో ఆయన రోడ్డు దాటి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం అతన్ని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం ఆయనను జలంధర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కష్టాలతో మొదలైన ఫౌజా సింగ్ ప్రయాణం
ఫౌజా సింగ్ 1911, ఏప్రిల్ 1న జన్మించారు. అయిదేళ్ల వయస్సు వచ్చేదాకా నడవలేని స్థితిలో ఉన్నారు. భారత దేశ విభజన సమయంలో ఆయన జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కుటుంబ సభ్యులను తక్కువ సమయంలోనే కోల్పోవడంతో తీవ్రమైన మానసిక ఆందోళనకు గురయ్యారు. అయితే, ఆయన మారథాన్ వైపు మొగ్గు చూపారు. 1990లలో తన కుమారుడితో కలిసి ఇంగ్లాండ్‌కు వెళ్లిన ఆయన, 89 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ మారథాన్ పోటీలలో బరిలోకి దిగారు.
కుల్దీప్ సింగ్.. ఫౌజా సింగ్‌ను గుర్తు చేసుకుంటూ ‘‘సర్దార్ ఫౌజా సింగ్ ఒక ఉత్తేజభరిత సిక్ఖ్ వ్యక్తిత్వం. ఆయన గురుబాణీలో చెప్పిన విధంగా ఎల్లప్పుడూ ముందుకు నడిచారు, వెనక్కి తిరిగి చూసిన వారు కాదు. ప్రతి పంజాబ్ యువతుడు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి’’ అని అన్నారు.
మాదకద్రవ్య రహిత పంజాబ్‌కు ప్రేరణనిస్తూనే ఉంటారు : గులాజ్ చంద్ టారియా
పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా మాట్లాడుతూ.. ఫౌజా మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫౌజా సింగ్ వారసత్వం 'మాదకద్రవ్య రహిత పంజాబ్‌కు ప్రేరణనిస్తూనే ఉంటుంది' అని అన్నారు.
"లెజెండరీ మారథాన్ రన్నర్ సర్దార్ ఫౌజా సింగ్ జీ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. 114 ఏళ్ల వయసులో, ఆయన 'నాషా ముక్త్ - రంగాలా పంజాబ్' మార్చ్‌లో అసమాన స్ఫూర్తితో నాతో చేరారు. ఆయన వారసత్వం మాదకద్రవ్య రహిత పంజాబ్‌కు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఓం శాంతి ఓం," అని పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా Xలో పోస్ట్ చేశారు.
పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ సంతాపం
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఫౌజా సింగ్ మరణంపై సంతాపం ప్రకటించారు. ‘‘ఫౌజా సింగ్ మారథాన్ రంగంలో లెజెండరీ వ్యక్తి. 114 ఏళ్ల వయస్సులో కూడా ఆయన శక్తి, త్యాగం, ఆత్మవిశ్వాసం ప్రతీ తరానికి స్ఫూర్తిదాయకం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’’ అంటూ పేర్కొన్నారు.