CSK: మూడేళ్లుగా ప్లేఆఫ్స్ మిస్.. ఆరో ఐపీఎల్ ట్రోఫీ కోసం సీఎస్కే బిగ్ స్కెచ్
CSK: ఐపీఎల్ 2027కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తమ కోచింగ్ స్టాప్‌లో సంచలన మార్పులు చేసింది. అసిస్టెంట్ కోచ్‌లుగా అల్బీ మోర్కెల్, గారెత్ బాటి.. బౌలింగ్ కోచ్‌గా మోహిత్ శర్మ నియమితులయ్యారు. ఆరో ఐపీఎల్ ట్రోఫీ కోసం బిగ్ స్కెచ్ వేసింది.

ఐపీఎల్ 2027కి ముందు సీఎస్‌కే సంచలన మార్పులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తమ కోచింగ్ స్టాప్‌లో పెద్ద మార్పులు చేసింది. సౌతాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ అల్బీ మోర్కెల్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించగా.. భారత్ మాజీ పేసర్ మోహిత్ శర్మకు టీమ్ బౌలింగ్ విభాగాన్ని అప్పగించారు. ఈ మేరకు సీఎస్కే అధికారిక ప్రకటన విడుదల చేసింది.
సీఎస్కే కొత్త హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్ ఎంట్రీ
ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ గత మూడు సీజన్లుగా వరుసగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. దీంతో కొత్త సీజన్‌కు ముందు సపోర్ట్ స్టాప్‌లో భారీ మార్పులు చేయాలని మేనేజ్‌మెంట్ డిసైడ్ అయింది. చాలా కాలంగా హెడ్ కోచ్‌గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో ఇప్పుడు జహీర్ ఖాన్ హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆధ్వర్యంలోనే జట్టు కొత్త కోచింగ్ సెటప్‌ను సిద్ధం చేస్తోంది. నవంబర్ 15 రిటెన్షన్ డెడ్‌లైన్‌కు ముందే ఈ కసరత్తంతా జరుగుతోంది.
సీఎస్‌కే మాజీ స్టార్ ప్లేయర్ మోర్కెల్ రీఎంట్రీ
మోర్కెల్ గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన అనుభవం ఉంది. 2008 నుంచి 2013 వరకు ఈ ఫ్రాంచైజీలో కీలక సభ్యుడిగా ఉండి, జట్టు విజయాల్లో భాగమయ్యాడు. అంతేకాకుండా, సూపర్ కింగ్స్ గ్లోబల్ నెట్‌వర్క్‌తోనూ అతనికి అనుబంధం ఉంది. ఇటీవల సౌతాఫ్రికా టీ20 లీగ్ SA20లో జోబర్గ్ సూపర్ కింగ్స్ హెడ్ కోచ్‌గా మోర్కెల్ బాధ్యతలు చేపట్టారు. నాలుగు సీజన్లు ఆ పదవిలో ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో ఆయన ఈ బాధ్యతలకు వచ్చారు.
బౌలింగ్ బాధ్యతలు మోహిత్ శర్మ చేతికి
మోహిత్ శర్మకు కూడా సీఎస్‌కేతో పాత అనుబంధం ఉంది. 2013లో ఇదే ఫ్రాంచైజీతో తన ఐపీఎల్ కెరీర్‌ను స్టార్ట్ చేసి 2015 వరకు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత 2019లో మళ్లీ చెన్నై తరఫున ఆడాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో చేరి, 2023లో ఆ జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.
ఐపీఎల్‌లో తన చివరి మ్యాచ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన 38 ఏళ్ల మోహిత్.. డిసెంబర్ 2025లో అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్‌లో 120 మ్యాచ్‌లు ఆడి 134 వికెట్లు తీసిన మోహిత్.. సీఎస్‌కేలో ఎరిక్ సిమన్స్ స్థానంలో బౌలింగ్ కోచ్‌గా రాబోతున్నాడు. ఇంగ్లండ్ మాజీ ఆఫ్ స్పిన్నర్ గారెత్ బాటి కూడా అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నారు.
పాత కోచ్‌లకు వీడ్కోలు.. ఆరో ట్రోఫీ టార్గెట్
కొత్త కోచ్‌ల ఎంట్రీతో పాటు కొందరు పాత సభ్యులు సీఎస్‌కే నుంచి తప్పుకున్నారు. చాలా కాలంగా ఆటగాడిగా, కోచ్‌గా సేవలు అందించిన బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ ఇకపై ఫ్రాంచైజీతో ఉండరు. ఆయనతో పాటు ఎరిక్ సిమన్స్, ఫీల్డింగ్ కోచ్ జేమ్స్ ఫోస్టర్ కూడా తప్పుకున్నారు.
వీరు ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ కోచింగ్ సెటప్‌లో స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో చేరనున్నారు. కోచింగ్ మార్పుల తర్వాత ఇప్పుడు సీఎస్‌కే పూర్తి ఫోకస్ ఆటగాళ్ల రిటెన్షన్, ఆక్షన్ వ్యూహంపైనే ఉంది. వచ్చే సీజన్‌లో కచ్చితంగా ఆరో ఐపీఎల్ ట్రోఫీని గెలవాలని ధోనీ సేన పట్టుదలగా ఉంది.





