మెస్సీతో కలిసి ఫుట్‌బాల్ ఆడనున్న సీఎం రేవంత్.. హైదరాబాద్‌లో GOAT LM10 సందడి !
CM Revanth Reddy Lionel Messi: హైదరాబాద్‌లో మెస్సీ పర్యటనకు ఏర్పాట్లు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి GOAT మెస్సీకి పోటీపడేందుకు ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మెస్సీ పర్యటన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

స్పోర్ట్స్ ఫీవర్‌లో హైదరాబాద్.. మెస్సీ రాకతో ఉత్సాహం
ప్రపంచ ఫుట్‌బాల్ లెజెండరీ ప్లేయర్ లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానున్నారు. వార్త వెలుగులోకి వచ్చినప్పటి నుంచి నగరం మొత్తం ఉత్సాహంతో స్పోర్ట్స్ మైదానంలా మారిపోయింది. గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా కోల్‌కతా, ముంబై, ఢిల్లీతో పాటు హైదరాబాద్ నాల్గో ప్రధాన గమ్యస్థానంగా ఎంపికైంది.
మెస్సీ భారత్‌లో అడుగుపెడుతున్న క్రమంలో ఆయన్ను స్వాగతించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని లక్ష్యంగా ప్రభుత్వ ‘తెలంగాణ రైజింగ్ 2047’ ప్లాన్ లో భాగంగా ఈ పర్యటనను మరింత ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు.
హైదరాబాద్ పర్యటనలో అందరినీ ఆకర్షిస్తున్న విషయం.. రేవంత్ రెడ్డి, మెస్సీ మ్యాచ్. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగనుంది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి RR9 జట్టుకు నాయకత్వం వహించనున్నారు. మెస్సీ తన ప్రసిద్ధ LM10 జెర్సీతో మైదానంలో దిగుతారు. ఈ ప్రత్యేక మ్యాచ్ కోసం క్రీడాభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
RR9 సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ప్రాక్టీస్ వైరల్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు ప్రత్యేక అభిమాని. విద్యార్థి దశ నుంచే ఫుట్‌బాల్ ఆయనకు ఇష్టమైన ఆటగా పలుమార్లు చెప్పారు. ఇప్పుడు అదే క్రీడలో ప్రపంచ దిగ్గజం మెస్సీతో కలిసి మైదానంలో ఆడే అవకాశం రావడంతో ఆయన ప్రాక్టీస్‌ను మొదలుపెట్టారు.
సచివాలయ కార్యక్రమాలు ముగిసిన వెంటనే రాత్రిపూట మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ ఇన్స్టిట్యూట్ (MCHRD) ఫుట్‌బాల్ గ్రౌండ్ చేరి గంటపాటు ప్రాక్టీస్ చేసిన సీఎం ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రేవంత్ స్పోర్ట్స్ బూట్లు ధరించి పాస్‌లు ఇవ్వడం, డ్రిబ్లింగ్ చేయడం, స్ట్రైకింగ్ ప్రాక్టీస్ చేయడం వంటి వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
బైఛుంగ్ భూటియా వంటి స్టార్ ప్లేయర్ల సలహాలతో సీఎం తన ఆటతీరు మరింత మెరుగుపరుచుకుంటున్నట్లు సమాచారం. RR9 జట్టులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, యంగ్ ప్లేయర్లు ఉండనున్నారు.
CM Revanth Reddy hits the field for #footbal practice ahead of #messi is landing in #hyderabad on December 13. Revanth Reddy is getting match-ready with late-night training, gearing up to lead in his “RR9” jersey as centre forward against the legend in No.10.@revanth_anumula… pic.twitter.com/CvbCZDbk1H
— Telangana CMO Unofficial (@TGCMOUnofficial) December 1, 2025
Telangana Rising Summit 2025.. అంతర్జాతీయంగా తెలంగాణ శక్తి
డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ఈ పర్యటనకు అసలు నేపథ్యంగా ఉంది. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 3,000 మంది ప్రతిష్ఠాత్మక అతిథులు హాజరుకానున్నారు. అందులో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా అండ్ టెక్ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, భారత పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా, యుఏఈ రాయల్ ఫ్యామిలీ సభ్యులు, ప్రముఖ టెక్ కంపెనీల సీఈవోలు ఉంటారని సమాచారం.
లయోనెల్ మెస్సీ కూడా ఈ సమ్మిట్‌లో గ్లోబల్ బ్రాండ్ అంబాసడర్‌గా ఆహ్వానించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సమ్మిట్ ముగింపు రోజున ప్రత్యేక ఆకర్షణగా RR9 vs LM10 మ్యాచ్ నిర్వహించనున్నారు.
మెస్సీ భారత్ పర్యటన సమయంలో కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ.. మొత్తంగా నాలుగు ప్రాంతాలను సందర్శిస్తారు. ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా కలిసే అవకాశం ఉందని ఆర్గనైజర్లు పేర్కొన్నారు.
హైదరాబాద్‌ను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడంలో రేవంత్ ప్లాన్
మెస్సీ పర్యటనతో స్పోర్ట్స్ పట్ల యువత ఉత్సాహం మరింత పెరగబోతోందని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో GHMC ఆధ్వర్యంలో 3 కొత్త ఫుట్‌బాల్ స్టేడియాలను నిర్మించే నిర్ణయం కూడా తీసుకున్నారు. అవి
• కాప్రా–గెలీలియో నగర్ (2.25 ఎకరాలు) – రూ.6 కోట్లు
• రెడ్ హిల్స్ (1.25 ఎకరాలు) – రూ.4.90 కోట్లు
• మల్లేపల్లి (1.5 ఎకరాలు) – రూ.4.85 కోట్లు
మొత్తం రూ.15 కోట్లతో ఈ స్టేడియాలను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని ప్రణాళికలున్నాయి. మూడు నెలల్లోపే పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
హైదరాబాద్‌లో ఇంతవరకు ప్రత్యేక ఫుట్‌బాల్ స్టేడియాలు లేకపోవడంతో ఈ ప్రాజెక్టులు నగర స్పోర్ట్స్ కల్చర్‌కు మలుపుతిప్పనున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ఉప్పల్ స్టేడియంలో డ్రీమ్ మ్యాచ్: RR9 vs LM10
డిసెంబర్ 13న సాయంత్రం 7 నుండి 8:45 వరకు జరగనున్న GOAT కప్ ఫ్రెండ్లీ మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల దృష్టిని ఆకర్షించనుంది. మెస్సీతో పాటు మాజీ భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత స్టార్ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ కూడా ఈవెంట్‌లో ఉంటారని సమాచారం. దీంతో మరింత హైప్ పెరిగింది.
ఈ ఈవెంట్ టికెట్లు జొమాటో డిస్ట్రిక్ట్ యాప్‌లో ఇప్పటికే విక్రయానికి అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభ ధర రూ.1700.
ఈ మ్యాచ్‌ను చూడడానికి దేశవ్యాప్తంగా అభిమానులు హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉంది. మొత్తగా అయితే, మెస్సీ రేవంత్ పోరు కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు.. ఇది తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ మ్యాప్‌పై నిలబెట్టే గొప్ప క్షణంగా చెప్పవచ్చు.

