Inspirational : శ్రీ రాముడి నుంచి మనం ఏం నేర్చుకోవాలో తెలుసా.? జీవితం మారడం ఖాయం.
రాముడు.. ఒక మతానికో, ఒక ప్రాంతానికో పరిమితం కాదు. ఆయన ఒక వ్యక్తిత్వం. ఆయన ఒక రోల్ మోడల్. గొప్ప కొడుకుగా, గొప్ప భర్తగా, గొప్ప పాలకుడిగా, గొప్ప అన్నగా.. ఇంకా చెప్పాలంటే ఒక మనిషి ఎలా జీవించాలో చెప్పేందుకు రాముడే ఆదర్శం. రాముడిని పూజించడమే కాదు ఆయనలా జీవించడం నేర్చుకుంటే అదే నిజమైన ధర్మం, అప్పుడే నిజమైన రామ రాజ్యం సాధ్యం.

Sri Rama
'మనిషిగా అవతరించిన దేవుడి రూపం, మనిషి దేవుడిగా ఎదిగిన రూపం' ఇది రామయ్య గురించి ఒక్క మాటలో చెప్పాలంటే. దేవుడు అంటే లీలలు, మహిమలు గుర్తొస్తాయి. కానీ శ్రీరాముడు అంటే కష్టాలు గుర్తొస్తాయి, విలువలతో ఎలా జీవించాలో గుర్తొస్తుంది, కష్టాల్లో కూడా ధర్మాన్ని ఎలా పాటించాలో తెలుస్తుంది. అందుకే శ్రీరాముడు దేవుడిని మించిన మహోన్నత వ్యక్తిత్వమయ్యాడు, నేటి తరానికి కూడా ఆదర్శమూర్తిగా నిలిచాడు. శ్రీరాముడి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ధర్మానికి కట్టుబడి ఉన్నాడు:
రాముడి జీవితమంతా కష్టాలే. సింహాసాన్ని కోల్పోయినా, కట్టుకున్న భార్య దూరమైనా రాముడు ధర్మాన్ని మాత్రం వీడలేదు. తాను నమ్ముకున్న ధర్మం కోసమే జీవించాడు. మనం కూడా జీవితంలో ధర్మబద్ధంగా జీవించాలనే గుణాన్ని ఆయన నుంచి నేర్చుకోవచ్చు.
sri rama navami
ఆత్మనిగ్రహం:
శ్రీరాముడు ఎప్పుడూ తన భావోద్వేగాలను నియంత్రణలో ఉంచాడు. కోపం, బాధ, సంతోషం ఎలాంటి పరిస్థితినైనా సమానంగా స్వీకరించాడు. గెలుపు, ఓటములను సమానంగా చూశాడు. ఎవరిపై కోపం చూపించలేదు. వ్యామోహాలకు లొంగిపోలేదు.
ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్పుతో ఉన్నాడు:
రాజ కోటను వీడినా, అడవిలో జీవించినా శ్రీరాముడు ఓపికతో ఉన్నాడు. చివరికి సీతమ్మను కోల్పోయినా ఒక సామాన్య వ్యక్తిలానే రావణుడిని ఎదుర్కొన్నాడు తప్ప తన సైన్యాన్ని ఉపయోగించుకోలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్పుతో ఎలా జీవించాలో రాముడి జీవితం మనకు చెబుతుంది.
ఎవరినీ నిందించలేదు:
చక్రవర్తిగా సింహాసనాన్ని అధిష్టించాల్సిన తరుణంలో తండ్రి మాటకు కట్టుబడి తన రాజ్యాన్ని త్యజించి వనవాసానికి వెళ్లాడు. కిరీటాన్ని పక్కన పెట్టి నార వస్త్రాన్ని ధరించాడు. అయినా శ్రీరాముడి ముఖంపై చిరునవ్వు చెరగలేదు. ఇలా జరగడానికి కారణమైన కైకేయిని కానీ, తండ్రిని కానీ నిందించలేదు. ఎంతటి దారుణమైన పరిస్థితులు వచ్చినా చిరునవ్వుతో ఎదుర్కోవాలనే గొప్ప సందేశాన్ని రాముడి జీవితం మనకు అందిస్తుంది.