- Home
- Life
- Spiritual
- Andhra Pradesh: తిరుమల హుండీలో పుస్తకాలు వేయొచ్చా.? వేస్తే ఏమవుతుంది, స్వీయ అనుభవం ఇంట్రెస్టింగ్ కథనం
Andhra Pradesh: తిరుమల హుండీలో పుస్తకాలు వేయొచ్చా.? వేస్తే ఏమవుతుంది, స్వీయ అనుభవం ఇంట్రెస్టింగ్ కథనం
సాధారణంగా తిరుమల హుండీలో డబ్బులు, కానుకలు, బంగారు ఆభరణాలు వేస్తుంటారు. అలా కాకుండా హుండీలో పుస్తకాలు వేస్తే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.? అలాంటి అనుభవానికి సంబంధించిన ఓ ఆసక్తికర కథనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెంకూ గారు చేసిన ఫేస్‌బుక్ పోస్ట్ వివరాలు మీకోసం..

TTD News
"నాహం కర్తా హరిః కర్తా.. తత్పూజా కర్మ చాఖిలం
తదాపి మత్కృతా పూజా.. తత్ప్రసాదేన నా అన్యథా.."
''నేను కర్తను కాదు. చేసేది చేయించేది అంతా ఆ శ్రీహరే. నా ద్వారా ఏ సత్కార్యం జరిగినా అది భగవంతుడి ప్రసాదమే తప్ప వేరే ఏమీ కాదు.''
శ్రీ మధ్వాచార్యుడు తన గీతా తాత్పర్యంలో చెప్పిన మాట ఇది..
*******************************
అలవాటు ప్రకారం.. నిన్న మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు పడుకున్నాను. లేచి చూస్తే 3.30 అయింది.
టైమ్‌తో పాటే సెల్ ఫోన్లో రెండు మిస్‌డ్ కాల్స్ కూడా కనిపించాయి.
కొత్త నంబరు కావడంతో ఎవరో.. ఏమిటో అనుకుని నేను రింగ్ చేశాను..
అవతల ఓ వ్యక్తి కాల్ రిసీవ్ చేసుకున్నారు.
‘ఎవరు సార్ ఇందాక కాల్ చేశారు?’ అని అడిగితే.. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి నుంచి అని చెప్పారు.. నేను ఇంకేదో అడిగే లోపు కాల్ కట్ చేశారు. మళ్లీ రింగ్ చేస్తే లేపలేదు.
నాకేమీ అర్థం కాలేదు.. పది రోజుల క్రితం తిరుమల యాత్రకు వెళ్లి వచ్చిన విషయం గుర్తుకొచ్చింది.
మనసులో ఏదో అనుమానం.. కొత్త శంక మొదలైంది.
దీనికి కారణం తెలియాలంటే పది రోజుల వెనక్కు వెళ్లాలి..
TTD News
జనవరి 22న చిన్న పని మీద తిరుపతి వెళ్లాల్సి వచ్చింది.
ఎలాగూ అక్కడి వరకు వెళ్లా కదా అని దర్శనానికి వీలు ఉంటుందా అని ఆరా తీస్తే.. అప్పటికప్పుడు దర్శనం చాలా కష్టం, క్లిష్టం అని చెప్పారు.
గతంలో కూడా రెండుసార్లు ఇలాగే అనుకోకుండా వెళ్లడం.. దర్శనం దుర్లభమై నిరాశపడి వెనక్కు రావడం గుర్తుకొచ్చాయి.
ఈసారి ఎలాగైనా వెంకన్నను దర్శించుకుని తీరాల్సిందేనని గట్టిగా అనుకున్నా. మిత్రులు దామోదర్ గారు గొప్ప మార్గం చూపించారు.
కొండమీద టీటీడీలో పనిచేసే తమ మేనమామకు కాల్ చేసి వివరాలు చెప్పారు. ఆయన వివరాలు కనుక్కుని.. వెంటనే కొండ మీదకు వచ్చి జేఈఓ కార్యాలయానికి వెళ్లి ఆధార్ కార్డు, ఫొటో, వేలిముద్రలు ఇస్తే దర్శనం టికెట్ జారీ చేస్తారని వివరించారు.
భక్తవత్సల గోవిందా.. అనుకుని వెంటనే కొండ మీదకు పరిగెత్తాను.
రామ్ బగీచా దగ్గర నుంచి జేఈఓ ఆఫీసు వెతుక్కుంటూ వెళ్లేసరికి రాత్రి 7.30 అవుతోంది. 8 గంటలకు కౌంటర్ మూసేసే టైమ్. కౌంటర్‌లో ఒంటరిగా కనిపించాడొక వ్యక్తి.. నా అదృష్టం బాగుంది అనుకుని వివరాలు అందజేసి, రుసుం చెల్లించి దర్శనం టికెట్ తీసుకుని వచ్చేశాను. ఉదయం 7.30 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గరకు రావాలని చెప్పారు. మళ్లీ కొండ దిగి వెళ్లి రూముకు చేరుకునేసరికి 11 గంటలైంది. అనుకోని దర్శనం కనుక మళ్లీ ఉదయం ఏమేం తీసుకువెళ్లాలో సిద్ధం చేసుకుని పడుకున్నా. తెల్లవారుజామునే లేచి చన్నీళ్లతోనే స్నానం కానిచ్చి దేవదేవుడి దర్శనానికి తయారయ్యాను. హుండీలో వేయడం కోసం అక్కయ్య వాళ్లు, మా అమ్మాయి ఇచ్చిన ముడుపుల సొమ్ము ముందే జేబులో పెట్టుకున్నాను మరచిపోకుండా.
ఏడు కొండల మీద కొలువైన కొండంత దేవుడికి.. వడ్డి కాసుల వాడికి ఏమి ఇవ్వాలనే ఆలోచిస్తే.. నా పుస్తకాలు గుర్తొచ్చాయి. ఆదానీలు, అంబానీలు కోట్ల రూపాయలు వెచ్చించి కిరిటాలు చేయిస్తారు స్వామికి. గాలి జనార్దనరెడ్డి వంటివారైతే బంగారంతో పెద్దపెద్ద గంగాళాలు చేయించి ఇస్తారు. లక్షల సొమ్ము హుండీలో వేస్తుంటారు ఎంతోమంది. మరి నేను హుండీలో ఏం వేయాలని ఆలోచిస్తుంటే బ్యాగ్‌లో నా పుస్తకాలు కనిపించాయి. నిజమే.. లక్షల సొమ్ము వేయలేనప్పుడు నాకున్నవి ఈ అక్షర లక్షలే కదా.. వాటిని స్వామికి ఎందుకు సమర్పించకూడదని అనిపించింది. వెంటనే తీసి ఓ సంచిలో పెట్టి పట్టుకున్నాను.
TTD News Andhrapradesh
హుండీలో వేయాల్సిన డబ్బులు జేబులో భద్రంగా పెట్టుకుని పుస్తకాల సంచి తీసుకుని నమో వేంకటేశాయ.. అనుకుని బయలుదేరా. క్యూలైన్ దగ్గర ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. చెకింగ్ దగ్గర అడిగితే పుస్తకాలు.. దేవుడి కోసం అని చెప్పా.. సరే అన్నారు. గుడిలో దర్శనం బ్రహ్మాండంగా జరిగింది. స్వామి ఎదురుగా తొలి గుమ్మంలోనే కనీసం రెండుమూడు నిమిషాలు నిల్చుని కళ్లారా చూసే అవకాశం రావడంతో గొప్ప అదృష్టం అనుకున్నా. దర్శనం అనంతరం హుండీ దగ్గరకు వచ్చి ముందుగా జేబులోంచి ముడుపుల సొమ్ము వేశాక అక్కడ ఉన్న కాపలాదారును అడిగాను... పుస్తకాలు హుండీలో వేయవచ్చా? స్వామి కోసం అని.. అభయాంజనేయస్వామిలా అభయమిస్తూ.. ''భేషుగ్గా వేయవచ్చు'' అన్నారు... మొత్తానికి ఆ భగవంతుడు ప్రసాదించిన వరం అయిన ఈ అక్షరాలను భక్తితో ఆయనకే సమర్పించి వచ్చేశా.. ఈ విషయం ఒక మిత్రుడికి చెబితే ఎప్పుడూ వినలేదు.. హుండీలో పుస్తకాలు వేయడం అనే మాట.. ఇదే తొలిసారి అన్నారు.
ఇది జరిగిన 10 రోజుల తర్వాత టీటీడీ పరకామణి నుంచి కాల్ అనగానే మనసులో ఏదో సందేహం మొలిచింది. ఒకవేళ హుండీలో అలా వేయకూడదేమో.. అది అడగడానికే కాల్ చేశారేమో అని అనిపించింది. రెండుసార్లు ఫోన్ చేసినవాళ్లు నేను రింగ్ చేసినప్పుడు ఎందుకు కట్ చేశారో తెలీలేదు. నేను రకరకాల ఆలోచనల్లో ఉండగానే ఫోన్ మోగింది. వెంటనే చేతిలో తీసుకున్నాను. ''మొన్న మీరు దేవుడి హుండీలో మీ పుస్తకాలు వేశారు కదా...'' మధ్యలో ఆగారు అవతలి వ్యక్తి.. ''అవునండీ..'' అన్నాను నేను. ''చాలా బాగున్నాయండీ ఆ పుస్తకాలు..'' అవతలి వ్యక్తి పెద్ద భారం దింపారు. నాకు పెద్ద రిలీఫ్ తో పాటు చాలా సంతోషం వేసింది.. ''ఆ పుస్తకాలు ఏమి చేస్తారండీ..'' అన్నాను.. బాగున్నాయని ఆయన తీసేసుకుంటారేమో అని సందేహం వచ్చి.
''మీరు హుండీలో వేశారు కనుక అవి దేవుడి సొమ్ము కిందే లెక్క. వాటిని లైబ్రరీలో లేదా మ్యూజియంలో పెడతారండీ..'' ఆగారు ఆయన. ''అయితే ఆ పుస్తకాలు పైపైన చూశాను. నాకు చాలా నచ్చాయి.. అవి ఎక్కడ దొరుకుతాయో చెబితే కొనుక్కుంటా'' అన్నారు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా. నా పుస్తకాలు అమ్మకానికి పెట్టలేదని.. అడ్రస్ ఇస్తే పంపిస్తానని చెప్పాను. ఆయన సరే అన్నారు. చివరగా... మీ పేరు ఏమిటి సార్ అన్నాను.. ‘‘వెంకటరావు..'' చెప్పారాయన. తిరుమల నుంచి వెంకటేశ్వరుడే పలికినట్లు అనిపించింది.