Chanakya Niti: పురుషులంతా రావణాసురుడిలా ఎందుకు మారాలి? చాణక్యుడు ఏమన్నారంటే..?
ప్రతి ఒక్కరూ రావణాసురుడి లక్షణాలు ఎందుకు అలవరుచుకోవాలి? ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి? చాణక్య నీతి దీని గురించి ఏం చెబుతోంది?

చాణక్య నీతి..
రామాయణంతో సహా హిందూ పురాణాలన్నింటిలో రావణాసురుడిని దుర్మార్గుడిగా చిత్రీకరించారు.దానిలో ఎటువంటి సందేహం లేదు. అది అక్షరాలా నిజం. రాముడి భార్య సీతను అపహరించాడు. తన సోదరి భర్తను నిర్దాక్షిణ్యంగా చంపాడు. దేవతలను చంపి స్వర్గాన్ని ఆక్రమించాడు. ఇవన్నీ దుర్మార్గుడి లక్షణాలే. కానీ, అతనిలో మెచ్చుకోదగిన, అందరూ నేర్చుకోవాల్సిన లక్షణాలు కూడా ఉన్నాయి. ఆ మంచి లక్షణాలను అలవరుచుకోవడం వల్ల జీవితంలో విజయం సాధించగలరు అని చాణక్యుడు చెబుతున్నాడు. మరి, ఆ మంచి లక్షణాలు ఏంటో చూద్దామా...
తపస్సు..
రావణుడు సాధారణ మనిషి కాదు. అతని తపస్సు శక్తి అద్భుతమైనది. ఒకసారి అతను బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు. వేల సంవత్సరాలుగా తపస్సు చేసినా బ్రహ్మ అతనికి లొంగనప్పుడు, జపిస్తూ.. తన పది తలలో ఒక్కొక్కటిగా అగ్నికి అర్పించాడు. దానికి బ్రహ్మ సంతోషించి.. అతనికి వరాలు ఇచ్చాడు. ఏ పని చేయాలన్నా.. చేయాలనే పట్టుదల ఉండాలి. కఠోర తపస్సు చేయాలి. ఈ లక్షణం రావణుడి నుంచి కచ్చితంగా నేర్చుకోవాల్సిందే.
రావణుడు వేదాలు, శాస్త్రాలు, ఆయుర్వేదం, రాజకీయ శాస్త్రాలలో బాగా ప్రావీణ్యం ఉన్న పండితుడు. శివుడిని స్తుతించే శ్లోకం శివ తాండవ స్తోత్రాన్ని రచించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఒకసారి, ఆయన శివుని కోసం తపస్సు చేస్తున్నాడు. శివుడు కరుణించలేదు. అప్పుడు రావణుడు కైలాస పర్వతం కింద తన చేతిని ఉంచి దానిని కదిలించాడు. శివుడు కైలాస పర్వతంపై అడుగుపెట్టి దానిని నొక్కినప్పుడు, రావణుడి చేయి దాని కింద చిక్కుకుంది. రావణుడు తాను ఆ నొప్పిని భరిస్తూనే.. శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు లయబద్దంగా పాట పాడాడు. అప్పుడు నిజంగానే శివుడు కరుణించాడు.
బలమైన నాయకత్వ లక్షణాలు
అతను లంకకు శక్తివంతమైన , న్యాయమైన పాలకుడు. విష్ణు చక్రానికి భయపడి పాతాళంలో లేదా సముద్రపు లోతుల్లో దాక్కున్న రాక్షసులను సమీకరించి, వారికి నాయకత్వం వహించి, లంకలో వారి బలమైన సైన్యాన్ని నిర్మించాడు. వారిని తీసుకొని స్వర్గంపై దాడి చేసి దేవతలను ఓడించాడు. ఆయన తన పరాక్రమానికి , రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాడు. ఇలాంటి నాయకత్వ లక్షణాలు కచ్చితంగా అందరికీ ఉండాల్సిందే.
శివ భక్తి
రావణుడు శివుడికి నిజమైన భక్తుడు. తన భక్తికి నిదర్శనంగా ఆయన తన పది తలలను శివుడికి అర్పించాడని ఒక కథ ఉంది. ప్రతిరోజూ శివుడిని పూజించకుండా తన రోజును ప్రారంభించేవాడు కాదు. ఆయన శివుడిని పూజించి చంద్రహాస అనే అపరిమిత శక్తి ఖడ్గాన్ని పొందాడు. అతను శివుడిని పూజించి ఆత్మ లింగాన్ని పొందాడు.
నిర్భయ యోధుడు
యుద్ధంలో రాముడిని ఎదుర్కొన్నాడు. దాని పరిణామాలు తెలిసినప్పటికీ, అతను తన తాత్విక నిబద్ధత, ధైర్యం , తన నమ్మకాల కోసం పోరాడే ధైర్యాన్ని ప్రదర్శించాడు. రాక్షసులు ఒక్కొక్కరుగా నాశనం అవుతున్నప్పటికీ, రాముడిని ఎదుర్కోవడంలో అతను తన వైఖరిని మాత్రం మార్చుకోలేదు.
సోదరి సంరక్షకుడు
రాముడు , లక్ష్మణుడు రావణుడి సోదరి శూర్పణఖ చెవులు, ముక్కును కోసేశారు. ఇది విన్న రావణుడికి చాలా కోపం వచ్చింది.తన సోదరి కోసమే ఆయన సీతను కిడ్నాప్ చేసి రాముడు, లక్ష్మణుడు లను బాధపెట్టాడు.

