Diwali 2025: అక్టోబర్ 20నా లేదా 21నా అసలు దీపావళి తేదీ ఇదే..!
Diwali 2025: అమావాస్య తిథి రెండు రోజులు వచ్చింది. అంటే అక్టోబర్ 20, 21 తేదీ రెండు రోజుల్లోనూ అమావాస్య తిథి ఉంది. అందుకే.. ఏ రోజు పండగ చేసుకోవాలి అనే అనుమానం ఉంది. మరి.. దీని గురించి పండితులు ఏం చెబుతున్నారు?

Diwali 2025
చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ నచ్చే పండుగ దీపావళి. ఈ పండగ రోజున ఇంటిని పూలు, దీపాలతో అందంగా అలంకరించుకుంటారు. లక్ష్మీ దేవిని మనస్ఫూర్తిగా పూజిస్తారు. ఇక చిన్న పిల్లలు సాయంత్రం టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటారు. చెడు పై మంచి గెలవడాన్ని చిహ్నంగా ఈ పండగను జరుపుకుంటారు. అంతేకాదు.. అమావాస్య చీకట్లను తరిమికొడుతూ దీపాల వెలుగులు వెదజల్లేలా టపాసులు కాలుస్తారు. అయితే... ఈ ఏడాది మాత్రం దీపావళి పండగ ఏ రోజు జరుపుకోవాలి అనే గందరగోళం ఏర్పడింది.
అమవాస్య తిథి రెండు రోజులు...
అమావాస్య తిథి రెండు రోజులు వచ్చింది. అంటే అక్టోబర్ 20, 21 తేదీ రెండు రోజుల్లోనూ అమావాస్య తిథి ఉంది. అందుకే.. ఏ రోజు పండగ చేసుకోవాలి అనే అనుమానం ఉంది. మరి.. దీని గురించి పండితులు ఏం చెబుతున్నారు? ఏ రోజు అసలు పండగ చేసుకోవాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం....
పంచాంగం ప్రకారం, అమావాస్య తిథి అక్టోబర్ 20వ తేదీ మధ్యాహ్నం 3:44 గంటలకు ప్రారంభమై, అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 5:54 గంటలకు ముగుస్తుంది. కాబట్టి, లక్ష్మీపూజ, దీపావళి వేడుకలను అక్టోబర్ 20వ తేదీన జరుపుకోవడం శుభప్రదం అని పండితులు చెబుతున్నారు.
దీపావళి 2025 తిథులు, సమయాలు....
అమావాస్య తిథి ప్రారంభం... అక్టోబర్ 20, 2025 మధ్యాహ్నం 3:44
అమావాస్య తిథి ముగింపు: అక్టోబర్ 21, 2025 – సాయంత్రం 5:54
లక్ష్మీ పూజ ముహూర్తం: అక్టోబర్ 20, 2025 – సాయంత్రం 7:08 నుండి 8:18 వరకు
ప్రదోష కాలం: 5:46 PM నుండి 8:18 PM వరకు
శుభ సమయంలో మాత్రం లక్ష్మీదేవిని పూజించాలి.
దీపావళి పండగ ప్రాముఖ్యత...
దీపావళి, అంటే “దీపాల పండుగ”, చీకటిపై కాంతి విజయం, చెడుపై మంచి విజయం, అజ్ఞానంపై జ్ఞానం విజయం అనే సందేశాన్ని అందిస్తుంది. ఇది శ్రీరాముడు రావణుడిని సంహరించి, అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుని గుర్తు చేసే పండుగ. అప్పట్లో ప్రజలు దీపాలు వెలిగించి రాముడిని స్వాగతించారు. అలా ఈ రోజు నుంచి దీపావళి పండుగ ప్రారంభమైందని పురాణాలు చెబుతాయి. అంతేకాదు... నరకాసురుడిని సత్యభామ చంపిన రోజు సందర్భంగా కూడా ఈ పండగను జరుపుకుంటారు.
దీపావళి కేవలం ఒక మతపరమైన వేడుక మాత్రమే కాదు. ఇది ఆనందం, సంపద, అదృష్టం, కుటుంబ ఐక్యతకు సంకేతం. ఈ రోజున లక్ష్మీదేవి, గణేశుడు, కుబేరుడుని పూజిస్తారు. లక్ష్మీదేవి ఇంటికి ప్రవేశిస్తుందని, ఆమెతో పాటు శాంతి , శ్రేయస్సు వస్తాయని నమ్ముతారు.
చీకటిని దూరం చేసే దీపావళి...
దీపావళి రాత్రి మన హృదయాల్లో వెలుగు నింపే రోజు. ఇది మనలోని చీకటిని (నెగటివిటీని) తొలగించి, జ్ఞానాన్ని , ఆత్మ శాంతిని ప్రసాదించే సమయం. కుటుంబం, స్నేహితులు కలిసి దీపాలు వెలిగించి, మిఠాయిలు పంచుకోవడం ద్వారా ఈ రోజు ఆనందంగా గడుపుకోవచ్చు. 2025లో దీపావళి పండుగను అక్టోబర్ 20న సాయంత్రం లక్ష్మీ పూజ ముహూర్తంలో జరుపుకోవడం అత్యంత శుభం. ఈ రోజు మీ జీవితంలో వెలుగు, శాంతి, ఐశ్వర్యం నింపాలని కోరుకుందాం.