స్లీప్ విడాకుల వల్ల భార్యాభర్తలకు ఏం జరుగుతుందో తెలుసా?
స్లీప్ విడాకుల గురించి విన్నవారు చాలా తక్కువ మందే ఉంటారు. కానీ దీన్ని ఫాలో అవుతున్న వారు మాత్రం చాలా మంది ఉన్నారు. అసలు ఏంటీ ఈ స్లీప్ విడాకులు, దీనివల్ల భార్యాభర్తలకు ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఈ మధ్య కాలంలో స్లీప్ డిరోర్స్ ట్రెండ్ బాగా పెరిగింది. భార్యా భర్తలు రాత్రిళ్లు కంటినిండా నిద్రపోవడానికి, నిద్రలేమిని తగ్గించుకోవానికి, సంబంధాలను మెరుగుపర్చడానికి ఒక ప్రత్యామ్నాయంగా స్లీప్ డివోర్స్ ను ఫాలో అవుతున్నారు. స్లీప్ డివోర్స్ అంటే ఏమీ లేదు.. భార్యా భర్తలు మంచి విశ్రాంతి తీసుకోవడానికి, నిద్రకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి ఇద్దరు వేర్వేరు బెడ్ పై లేదా వేర్వేరు గదుల్లో నిద్రపోతారు. అసలు ఇది సాధ్యమేనా అని అనిపించినప్పటికీ.. దీన్ని ఫాలో అయితే మాత్రం ఎన్నో లాభాలను పొందుతారని నిపుణులు అంటున్నారు.
నిద్ర ప్రతి ఒక్కరికీ అవసరం. ఇది మన శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం. నిద్ర సంబంధాలతో పాటుగా మన జీవితంలోని ఎన్నో అంశాలను ప్రభావితం చేస్తుంది. కంటినిండా నిద్రపోనప్పుడు ఒక వ్యక్తి నార్మల్ గా ఉండలేడు. దీనివల్ల వ్యక్తులతో మాట్లాడే విధానం కూడా మారుతుంది. ఇది సంబంధాలను దెబ్బతీస్తుంది. మీరెప్పుడైనా గమనించారా? నిద్ర సరిగ్గా పోనప్పుడు కోపం, ఒత్తిడి, చిరాకు కలుగుతాయి. ఇది గొడవలు, కొట్లాటలకు దారితీస్తుంది. అందుకే ఈ మధ్య కాలంలో స్లీవ్ డివోర్స్ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. అసలు ఈ స్లీప్ డివోర్స్ వల్ల భార్యా భర్తలకు ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మెరుగైన నిద్ర
స్లీప్ డివోర్స్ వల్ల కలిగే మొట్ట మొదటి ప్రయోజనం ఏంటంటే.. భార్యా భర్తలిద్దరూ ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా బాగా నిద్రపోతారు. భర్త లేదా భార్య పెట్టే గురక వల్ల నిద్రలేకుండా కూర్చొనే రోజులు పోతాయి. అలాగే అటూ ఇటూ కదలడం లేదా అవతలి వ్యక్తి నిద్రపోయే విధానం వల్ల మీ నిద్రకు భంగం కలిగే అవకాశమే ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. మీరు నిద్రపోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
మెరుగైన కమ్యూనికేషన్
స్లీప్ డివోర్స్ వల్ల భార్యాభర్తలు తమకు ఉన్న నిద్ర సమస్యల గురించి ఒకరితో ఒకరు ఓపెన్ గా చెప్పుకోగలుగుతారు. ఇది వారి కమ్యూనికేషన్ ను పెంచుతుంది.ఈ నిద్ర సమస్యల గురించి ఒకరితో ఒకరు చెప్పుకోవడం, పరిష్కరించుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. సహానుభూతి పెంపొందుతుంది. ఇది ఇద్దరి మధ్య భావోద్వేగ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది.
గొడవలు తగ్గడం
భార్యాభర్తల మధ్య గొడవలు, కొట్లాటలు రావడానికి నిద్రకు భంగం కలగడం కూడా ఒకటి. అదే ఇద్దరూ విడి విడిగా నిద్రపోవడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు, కొట్లాటలు చాలా వరకు తగ్గుతాయి. భార్యకు లేదా భర్తకు వేర్వేరు సమాయాల్లో నిద్రపోయే అలవాటు, స్లీపింగ్ షెడ్యూల్స్ లేదా వెదర్ లో మార్పులు వంటి స్లీపింగ్ అలవాట్లు ఉంటాయి. దీనివల్ల కలిసి నిద్రపోయినప్పుడు సమస్యలు రావొచ్చు. అంటే కొంతమందికి లైట్ ఉంటే నిద్రరాదు. మరికొంతమందికి లైట్ ఉంటేనే నిద్ర వస్తుంది. ఇలాంటప్పుడే దీని దగ్గర గొడవ వస్తుంది. అయితే స్లీప్ డివోర్స్ వల్ల ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశమే లేదు.
సాన్నిహిత్యం పెరగడం
విడిగా నిద్రపోవడం వల్ల సాన్నిహిత్యం తగ్గుతుందని చాలా మంది అనుకుంటుంటారు. కానీ దీనివల్ల చాలా మంది జంటల్లో శృంగార సంబంధం మెరుగపడటాన్ని కనుగొంటారని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల , కంటి నిండా నిద్రపోవడం వల్ల భాగస్వాములు మరింత ప్రేమగా, శక్తివంతంగా, మంచి భావోద్వేగ సంబంధంలో ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
హద్దులను గౌరవించడం
స్లీపింగ్ డివోర్స్ ఒకరి వ్యక్తిగత స్థలాన్ని, సంబంధంలోని సరిహద్దులను గౌరవించడం గురించి నొక్కి చెబుతోంది. ఇది భార్యాభర్తల మధ్య సంబంధాన్ని పెంచుతుంది. అలాగే స్వేచ్ఛను ఇస్తుంది. అలాగే ఇద్దరి మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది. ఈ పరస్పర గౌరవం సంబంధంలో మరింత సంపూర్ణ సంతృప్తి, సామరస్యానికి దారితీస్తుంది.