Relationship: భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చూడాల్సిన సినిమా ఇది..!
Relationship: ప్రేమ, సహనం, ఒకరిని మరొకరు అర్థం చేసుకోవడం అన్నీ కలిస్తేనే వివాహ జీవితం ఆనందంగా సాగుతుంది. కానీ, ఈ రోజుల్లో చాలా మంది పని ఒత్తిడి, చిన్న చిన్న విభేదాలతో తమ బంధాన్ని పాడుచేసుకుంటున్నారు.

Relationship Tips
దాంపత్య జీవితం ఆనందంగా సాగాలని అందరూ కోరుకుంటారు. కానీ, భార్య భర్తల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్థలు రావడం, గొడవలు లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఆ గొడవలను చాలా మంది పెంచుకుంటూపోతారు. ఒకరితో మరొకరు మనస్ఫూర్తిగా కూడా మాట్లాడుకోరు. మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే.. మీ లైఫ్ పార్ట్నర్ తో కలిసి ఈ సినిమా కచ్చితంగా చూడాల్సిందే.
దంపతులు చూడాల్సిన సినిమా
దాంపత్య జీవితంలో సమస్యలు రావడం చాలా సహజం. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒకరికి మరొకరు ఎలా సపోర్ట్ గా ఉండాలి? దాంపత్య బంధాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి అనే విషయాలను తెలియజేసే సినిమా ఇరుగపట్రు ( Irugapatru). ఇది తమిళ సినిమా. కానీ.. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. నెట్ ఫ్లిక్స్ లో దీనిని మీరు చూడొచ్చు. మూడు జంటలకు సంబంధించిన కథ ఇది.
మూడు జంటల కథ..
మొదటి జంట... ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కానీ, పెళ్లి తర్వాత మాత్రం వారి జీవితం సరిగా ఉండదు. భర్త ప్రతి విషయంలోనూ భార్యను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. విసిగిపోయిన భార్య విడాకులు కోరుకుంటుంది. విడాకుల దాకా వెళ్లిన ఈ జంట మళ్లీ ఎలా ఒక్కటయ్యారో ఈ మూవీలో చాలా బాగా చూపించారు.
రెండో జంట.. వీరికి పెద్దలు కుదిర్చిన పెళ్లి. భార్య ఇంట్లో ఉండి... ఎక్కువగా తినేసి బాగా లావు అయిపోతుంది. ఆల్రెడీ ఉద్యోగంపై ఇష్టంలేని భర్త.. ఆ కోపాన్ని భార్యపై చూపిస్తూ ఉంటాడు. చివరకు.. వీళ్లు ఒకరికి మరొకరు సపోర్ట్ గా ఎలా నిలిచారో ఇందులో చూపించారు.
మూడో జంట.. ఈ జంట పర్ఫెక్ట్ మ్యాచ్. ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు లేవు. భార్య.. చాలా మంది కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంది. భర్తను చాలా ప్రేమగా కూడా చూసుకుంటుంది. కానీ భార్య చేసే ఏ పనీ నేచురల్ గా ఉండవని, కనీసం చిన్న గొడవ కూడా తమకు అవ్వడం లేదని ఆ భర్త ఫీలౌతూ ఉంటాడు. వీరి సమస్యను కూడా నేటి కాలానికి అనుగుణంగా మార్చి చాలా బాగా చూపించారు.
సినిమా నుంచి నేర్చుకోవాల్సిన పాఠం...
ఈ మూడు కథలను ఒకదానితో మరొకటి లింక్ చేసి తీసిన సినిమా ఇది. సినిమా చూస్తున్నంత సేపు ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. పైగా.. అందులో నీ సీన్స్.. రెగ్యులర్ గా తమ ఇళ్ల్లో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. భార్యభర్తలు ఇద్దరూ కలిసి చూడటం వల్ల వారు చేసే తప్పులు వారు గుర్తించగలుగుతారు. భార్యభర్తల మధ్య ప్రేమ తగ్గిపోయినప్పుడు .. మళ్లీ ఆ ప్రేమ ఎలా పెంచుకోవాలి? ఒకరిని మరొకరు ఎలా అర్థం చేసుకోవాలి? ఒకరికి మరొకరు ఎందుకు గౌరవం ఇవ్వాలి అనే మూడు పాయింట్స్ మీద ఈ సినిమా సాగుతుంది.
సినిమా చెబుతున్న ముఖ్యమైన పాఠం ఏమిటంటే "సమస్యలను పరిష్కరించకుండా వాటిని దాటవేయడం కాదు, వాటిని అర్థం చేసుకోవడమే ప్రేమ అసలు రూపం." భార్యాభర్తలు ఒకరికొకరు వినడం, చిన్న విషయాల్లోనూ కృతజ్ఞత చూపడం, భావోద్వేగాలను అణచివేయకుండా పంచుకోవడం ఎంత ముఖ్యమో ఈ సినిమా సున్నితంగా చూపిస్తుంది. చాలాసార్లు మనం కరెక్ట్ గానే ఉన్నామని.. ఎదుటి వారిది మాత్రమే తప్పు అని ఫీలౌతూ ఉంటారు. ఇలా అనుకోవడం వల్లే బంధాలు దూరమవుతాయి. కానీ ఈ సినిమా చూస్తే, ఆ భావన తగ్గి, దంపతుల మధ్య మళ్లీ ప్రేమ పెరిగే అవకాశం ఉంది.