Relationship Tips: రిలేషన్ షిప్‌లో ఈ 3 తప్పులు చేశారంటే.. బంధం తెగిపోవడం ఖాయం!
ప్రేమ బంధం నిలబడాలంటే కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ప్రవర్తన. కొన్ని చిన్నచిన్న అలవాట్లు, మాటలు, స్పందన ఒక బంధాన్ని బలంగా మార్చగలవు, లేదా దెబ్బతీయగలవు. మనం తెలియక చేసే కొన్ని చిన్న తప్పులు సంబంధంలో దూరాన్ని పెంచుతాయి. అవేంటో చూద్దాం.

రిలేషన్ షిప్ లో చేయకూడని తప్పులు
ప్రేమ బంధం అనేది ఇద్దరు వ్యక్తుల భావోద్వేగాలు, నమ్మకం, పరస్పర గౌరవం, నిజాయతీతో నిర్మించబడే ఒక బలమైన బంధం. అయితే ఒక వ్యక్తి అలవాట్లు లేదా నిర్లక్ష్యపు ప్రవర్తన ఈ బంధాన్ని క్రమంగా దెబ్బతీయవచ్చు. ముఖ్యంగా మూడు సాధారణ తప్పులు చాలా సంబంధాలను దెబ్బతీస్తాయి. అవి చిన్న తప్పులుగా అనిపించినా వాటి ప్రభావం మాత్రం చాలా లోతుగా ఉంటుంది. మరి రిలేషన్ షిప్ లో అస్సలు చేయకూడని తప్పులేంటో తెలుసుకుందామా…
మనసు విప్పి మాట్లాడకపోవడం
చాలామంది తమ భావాలను, ఆలోచనలను లేదా సమస్యలను చెప్పకుండా మనసులోనే దాచుకుంటారు. మొదట్లో ఇది గొడవలు తప్పించుకోవడానికి అనిపించినా, దీర్ఘకాలంలో అది అపార్థాలకు దారి తీస్తుంది. మీ భాగస్వామి మీలో ఏం జరుగుతోందో అర్థం చేసుకోలేకపోతారు. దాంతో దూరం పెరుగుతుంది. నిజానికి, ఓపెన్ కమ్యూనికేషన్ అనేది ఏ సంబంధానికైనా పునాది లాంటిది. మనసులో ఉన్నది స్పష్టంగా, గౌరవంగా చెప్పడం వల్ల మాత్రమే ఒకరినొకరు బాగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
గత తప్పులను ఎత్తిచూపడం
గతంలో చేసిన తప్పులను పదేపదే ఎత్తిచూపడం కూడా సంబంధాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఒకసారి జరిగిన తప్పును క్షమించి ముందుకు సాగాలి. కానీ కొందరు చిన్న గొడవ వచ్చినా, పాత విషయాలను తిరిగి తెరపైకి తీసుకొస్తారు. ఇది భాగస్వామికి బాధ కలిగించడమే కాకుండా, సంబంధంలో నమ్మకాన్ని కూడా తగ్గిస్తుంది. ప్రతిసారి పాత విషయాన్ని గుర్తుచేయడం వల్ల, ఎదుటివారు తమను తాము మార్చుకోవడానికి ఆసక్తి కోల్పోతారు. ఒక సంబంధం ఆరోగ్యంగా ఉండాలంటే, క్షమించడం నేర్చుకోవాలి. గతాన్ని గతంగా వదిలేయాలి.
నిర్లక్ష్యం చేయడం
భాగస్వామి భావాలను నిర్లక్ష్యం చేయడం అత్యంత ప్రమాదకరమైన తప్పుల్లో ఒకటి. ఒక వ్యక్తి తన భావాలను వ్యక్తపరిచినప్పుడు, వాటిని గౌరవంగా వినడం అవసరం. కానీ కొందరు ఎదుటి వారు చెప్పిన విషయాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. ఇది భాగస్వామికి తమ భావాలకు విలువ లేదనే భావనను కలిగిస్తుంది. దీర్ఘకాలంలో ఇది భావోద్వేగ దూరాన్ని పెంచుతుంది. ప్రతి వ్యక్తి భావాలు ముఖ్యమైనవే, అవి చిన్నవైనా పెద్దవైనా. వినడం, అర్థం చేసుకోవడం, సహానుభూతితో స్పందించడం వల్ల బంధం బలంగా ఉంటుంది.
ప్రవర్తన ముఖ్యం
ఒక సంబంధాన్ని నిలబెట్టుకోవడం అనేది ప్రేమతో మాత్రమే సాధ్యం కాదు. సరైన ప్రవర్తన, పరస్పర గౌరవం, జాగ్రత్తలతో కలిసి ఉంటుంది. మనసు విప్పి మాట్లాడటం, గతాన్ని వదిలేయడం, భాగస్వామి భావాలను గౌరవించడం వంటి చిన్న మార్పులు పెద్ద ఫలితాలను ఇస్తాయి. ఈ మూడు తప్పులకు దూరంగా ఉంటే మీ సంబంధం మరింత బలంగా, ఆనందంగా మారుతుంది.

