- Home
- Life
- Pregnancy & Parenting
- Youth Suicide Prevention: ‘ఆత్మహత్య ఆలోచనే వద్దు నాన్న.. మేమున్నాం కదా’: యువతను తల్లిదండ్రులే కాపాడాలి
Youth Suicide Prevention: ‘ఆత్మహత్య ఆలోచనే వద్దు నాన్న.. మేమున్నాం కదా’: యువతను తల్లిదండ్రులే కాపాడాలి
Youth Suicide Prevention: విద్యార్థుల్లో ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతున్నాయి. చిన్న చిన్న కారణాలకే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి ముఖ్య కారణం.. సమస్యను తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేకపోవడం. యువతలో ఆత్మహత్య ఆలోచనలు రాకుండా ఉండాలంటే తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. వారిచ్చిన సూచనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2022లో విడుదల చేసిన డేటా ప్రకారం మన దేశంలో విద్యార్థుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. తమిళనాడు రెండో స్థానంలో ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం, 2022లో దేశ వ్యాప్తంగా 13,444 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. దీన్ని బట్టి పిల్లలు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. అనుకున్న లక్ష్యాలు సాధించకపోతే సొసైటీలో పరువు పోతుందన్న భావన నుంచి తల్లిదండ్రులు బయట పడితేనే యువత, పిల్లల ఆత్మహత్యలు ఆగుతాయి.
దక్షిణాది రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు తిట్టడం, కొట్టడం, క్రమశిక్షణ పేరుతో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశాన్ని పిల్లలకు ఇవ్వకపోవడం వల్ల మనస్తాపం చెంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. సాధారణ పరీక్షలు, వైద్య విద్య, ఇంజినీరింగ్ కాలేజీ పరీక్షలు, నీట్ పరీక్ష ఫలితాలు విడుదలైనప్పుడు కూడా ఇలాంటి దురదృష్టకర సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ఆత్మహత్యలకు కారణాలు..
పిల్లలు ఇంట్లో ఉన్నట్టు బయట ఉండటం లేదన్న విషయం చాలా మంది తల్లిదండ్రులు గమనించుకోరు. చాలామంది విద్యార్థులు పాఠశాల లేదా కళాశాలలో ఒంటరిగా బాధపడతూ ఉంటారు. పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక ఇంట్లో చెప్పలేక ఒత్తిడికి గురవుతుంటారు. స్నేహితులు బాడీ షేమింగ్ చేయడం వల్ల కూడా ఎక్కువ మంది పిల్లలు సూసైడ్ ఆలోచనలు చేస్తున్నారు. కుటుంబాల ఆర్థిక పరిస్థితి కారణంగా స్నేహితుల ముందు తక్కువగా ఉన్నామని కూడా చాలామంది విద్యార్థులు అవమానభారంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
తల్లిదండ్రులు ఏం చేయాలి...
ఎక్కువ మార్కులు తెచ్చుకోకపోతే అమ్మానాన్న ఏమంటారో అన్న భయం పిల్లలకు కలగనీయకండి.
ఒకవేళ వారు అనుకున్న స్థాయిలో రాణించకపోతే తల్లిదండ్రులు మద్దతుగా ఉండాలి.
చదువు వారికి ఒత్తిడి కలిగించే బదులు ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా ఉండాలి. స్కూల్, కాలేజీ అంటే మీ పిల్లలు భయపడుతుంటే వెంటనే అక్కడకు వెళ్లి నిర్వాహకులతో మాట్లాడండి. ఒత్తిడికి గురిచేయవద్దని కోరండి.
స్వేచ్ఛనివ్వండి..
పిల్లలు స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణాన్ని తల్లిదండ్రులు కల్పించాలి. పాఠశాల లేదా కళాశాల నుండి వచ్చిన తర్వాత ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఆ రోజు ఏం జరిగిందో పంచుకునేంత ఫ్రీడమ్ వాళ్లకుండాలి.
13 ఏళ్లు దాటిన పిల్లలతో తల్లిదండ్రులు స్నేహితులుగా మెలగాలి.
మంచి, చెడు విషయాల గురించి వారితో డిస్కస్ చేయాలి.
దీని వల్ల సొసైటీలో ఎలా మెలగాలో వారికి అర్థమవుతుంది.
పిల్లలు డల్ గా ఉంటున్నారంటే వాళ్లే సర్దుకుంటారని వదిలేయకండి. దగ్గర కూర్చొని సమస్యలు తెలుసుకొని ధైర్యం చెప్పండి. తద్వార సూసైడ్ ఆలోచనలు రాకుండా ఉంటాయి.