అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగిన పిల్లలు ఎలా ఉంటారో తెలుసా?
తల్లిదండ్రుల దగ్గర కాకుండా... అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల మధ్య పెరిగే పిల్లలు చాలా మందే ఉంటారు. మరి, వారి దగ్గర పెరిగిన పిల్లల ప్రవర్తన, అలవాట్లు, అభిరుచులు ఎలా ఉంటాయో తెలుసా? అసలు పిల్లలు ఎవరి సంరక్షణ లో పెరగడం మంచిదో తెలుసుకుందాం..
మీ పిల్లలను ఎవరు పెంచుతున్నారు..? ఇదెక్కడి ప్రశ్న పిల్లలను ఎవరు పెంచుతారు.. తల్లిదండ్రులే పెంచుతారు. అవును, ఈ రోజుల్లో పిల్లలను పేరెంట్సే పెంచుతున్నారు. ఇద్దరూ ఆఫీసుకు వెళ్లాల్సి వస్తే, ఏ ఆయా దగ్గరో, డే కేర్ సెంటర్ లోనే ఉంచుతున్నారు. కానీ.. ఒకప్పుడు అమ్మ, నాన్న ఉన్నా కూడా వారి సంరక్షణ ఎక్కువగా అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య లే చూసుకునేవారు. ఇప్పటికీ కొందరు అలా పెరిగేవారు ఉండొచ్చు. అయితే అలా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగే పిల్లల్లో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయట. అవేంటో ఓసారి చూద్దాం...
ఈ కాలంలో తల్లిదండ్రులు చాలా వరకు బిజీగా ఉంటున్నారు. పిల్లలతో గడిపే సమయమే వారికి ఉండటం లేదు. కానీ, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగే పిల్లలకు మాత్రం ఆ లోటు ఉండదట. వారిలో ఏదైనా కొత్త విషయాలు చాలా తొందరగా నేర్చుకునే లక్షణాలు అలవడతాయట. ఎందుకంటే.. తాతా మామ్మలు ఖాళీ సమయంలో పిల్లలతో లోతైన సంభాషణలు చేస్తారు. వారికి తెలిసిన విషయాలు.. పిల్లలకు నేర్పించాలని అనుకుంటారు.
మానసిక, సామాజిక అభివృద్ధిలో తాతామామ్మలు కీలక పాత్ర పోషిస్తారు. ఓర్పును పెంపొందించడం, జీవిత విలువలను వివరించడం ద్వారా మెరుగైన మానసిక సమతుల్యతకు దారితీస్తారు. గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగిన పిల్లల్లో కాస్త ఓపిక ఎక్కువగా ఉంటుందట.
పేరెంట్స్ గారాభంతో నేర్పించని చాలా విషయాలను వీళ్లు నేర్పిస్తారట. అంటే.. వంట చేయడం, శుభ్రత, చిన్న చిన్న మరమ్మతులు ఎలా చేసుకోవాలో, ముఖ్యంగా జీవిత నైపుణ్యాలను నేర్పిస్తారట. ఇది పిల్లల్లో స్వయం సమృద్ధి పెంపొందిచడానికి సహాయపడుతుంది.
తాతామామ్మలు చెప్పే కథలు కీలకమైన జీవిత విలువలను అందిస్తాయి, కుటుంబ చరిత్ర, అనుభవాలను పంచుకుంటాయి, పిల్లలు తమ వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి.
తాతామామ్మలతో జీవించడం వల్ల పిల్లలకు ప్రేమ, భద్రత లభిస్తుంది, ఆత్మగౌరవం పెరుగుతుంది, బాహాటంగా వ్యక్తీకరించుకునే వీలు కలుగుతుంది.