New Mother: డెలివరీ అయిన వెంటనే ఈ పనులు చేస్తున్నారా? అయితే జాగ్రత్త!
ప్రతి మహిళకు ప్రెగ్నెన్సీ ఎంతో ప్రత్యేకమైంది. తనతోపాటు కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా ఎప్పటికప్పుడు స్పెషల్ కేర్ తీసుకుంటారు. కానీ డెలివరీ తర్వాత బిడ్డ గురించి తప్పా.. తన గురించి ఎక్కువగా పట్టించుకోరు. ఇది ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. డెలివరీ తర్వాత కొన్ని పనులు అస్సలే చేయకూడదని చెబుతున్నారు. అవెంటో తెలుసుకోండి.

తల్లి కావడం ప్రతి మహిళకు చాలా అందమైన అనుభూతి. ఈ సమయం భయంతో పాటు ఆనందాన్ని కూడా ఇస్తుంది. మహిళలు ప్రెగ్నెన్సీ టైంలో తమను తాము బాగా చూసుకుంటారు. బిడ్డ ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ బిడ్డ పుట్టిన తర్వాత, పుట్టిన బిడ్డను చూసుకోవడంలోనూ, ఇంటి పనుల్లో వారు బిజీ అయిపోతారు.
అయితే నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ అయినా డెలివరీ తర్వాత కనీసం 40 రోజుల వరకు కొన్ని పనులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇక్కడ చూద్దాం.
శారీరక మార్పులు
తల్లి అయిన తర్వాత, ఏ మహిళ అయినా శారీరక, భావోద్వేగ మార్పులకు లోనవుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో బిడ్డ పుట్టిన తర్వాత అంతకంటే ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం బిడ్డను చూసుకోవడమే కాకుండా తన ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడే తల్లీ బిడ్డలిద్దరూ క్షేమంగా ఉంటారు. మరి డెలివరీ తర్వాత ఏ పనులు చేయొద్దో ఇప్పుడు తెలుసుకుందాం.
కోలుకునే సమయం
ప్రసవం తర్వాత మొదటి 40 రోజులను కోలుకునే సమయంగా పరిగణిస్తారు. కాబట్టి సిజేరియన్ అయినా, నార్మల్ డెలివరీ అయినా, కనీసం 40 రోజుల వరకు ఏ పని చేయకుండా ఉండాలి. ప్రసవం తర్వాత చేయకూడని పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూద్దాం.
టాంపోన్, మెన్‌స్ట్రువల్ కప్ వాడకం
నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రసవం తర్వాత 2 నుంచి 6 వారాల వరకు రక్తస్రావం ఉంటుంది. ఈ సమయంలో మెటర్నిటీ ప్యాడ్‌లు లేదా శానిటరీ నాప్‌కిన్‌లను ఉపయోగించడం మంచిది. కానీ టాంపోన్, మెన్‌స్ట్రువల్ కప్ ఉపయోగించడం మంచిది కాదట. దీనివల్ల వజైనా గాయం నయం కాదట. పైగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుందట.
హానికరమైన ఆహారం
ప్రసవం తర్వాత కనీసం 40 రోజుల వరకు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. కారంగా ఉండే ఆహారం, నూనె పదార్థాలు, అలెర్జీ కారక ఆహారాలు, గ్యాస్ ఉత్పత్తి చేసే ఆహారాలను నివారించండి. కారం, వేడి ఆహారాలు తల్లిపాల ద్వారా శిశువుకు హాని కలిగిస్తాయి. ఇది బిడ్డ, తల్లి ఇద్దరికీ కడుపు, చర్మ సమస్యలకు కారణమవుతుంది.
లేట్ నైట్ వరకు మేల్కోని ఉండటం
సాధారణంగా పిల్లలు రాత్రంతా మేల్కొని ఉంటారు. అటువంటి పరిస్థితులలో తల్లులు కూడా మేల్కొని ఉండాలి. ప్రసవం తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకోకపోతే అది మీరు కోలుకోవడంపై ప్రభావం చూపిస్తుంది. త్వరగా కోలుకోవడానికి బాగా విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. బిడ్డ కడుపు నిండి ఉండి, ఇంకా రాత్రి నిద్రపోకపోతే మీరు కుటుంబంలోని మరొక సభ్యుని సహాయం తీసుకోవచ్చు.
శారీరక సంబంధం
నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రసవం తర్వాత యోని కణజాలం సన్నగా, మరింత సున్నితంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో 40 రోజుల వరకు లైంగిక సంబంధాన్ని నివారించండి. ప్రసవం తర్వాత 4 నుంచి 6 వారాల వరకు వేచి ఉండమని వైద్యులు సలహా ఇస్తుంటారు.
అధిక వ్యాయామం
ప్రసవం తర్వాత 6 వారాల వరకు భారీ వ్యాయామాలకు దూరంగా ఉండండి. వైద్యుల సలహా మేరకు చిన్న చిన్న వ్యాయామాలు చేయండి. ప్రసవం తర్వాత వెంటనే వ్యాయామం చేయడం వల్ల మీ కండరాలపై ఒత్తిడి పడుతుంది. ఇది కండరాల నొప్పి, వెన్ను నొప్పి, రక్తస్రావం, కుట్లపై ఒత్తిడికి కారణమవుతుంది.
బరువైన వస్తువులను..
ప్రస్తుతం చాలామంది మహిళలు ప్రసవం తర్వాత తమతో పాటు, శిశువును కూడా స్వయంగా వారే చూసుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో వారు కొన్నిసార్లు బకెట్లు లేపడం ఇతర పనులు చేస్తుంటారు. కనీసం 40 రోజుల వరకు ఇలా చేయకుండా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. అలా చేయడం వల్ల కడుపుపై చాలా ఒత్తిడి పడుతుంది. ఇది కడుపు నొప్పికి దారితీస్తుంది.