పేరెంట్స్... ఎదిగే పిల్లల ముందు ఈ మాటలు మాట్లాడకండి
కోపమొస్తే చాలు తల్లిదండ్రులు పిల్లలని కూడా చూడకండి ఇష్టమొచ్చిన తిట్లను తిడుతుంటారు. ఎగతాళి చేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల పిల్లలు ఎలా అవుతారో తెలుసా? మీకు తెలుసా? తల్లిదండ్రులు పిల్లల ముందు కొన్ని మాటలు అస్సలు మాట్లాడొద్దు.
ఎదిగే పిల్లలు చాలా షార్ప్ గా ఉంటారు. ప్రతి విషయాన్ని చాలా తొందరగా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ వయసులో పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. మంచి మంచి విషయాలను నేర్పితే వారి భవిష్యత్తుకు ఎలాంటి డోకా ఉండదు.
కానీ తెలిసీ, తెలియక చేసే కొన్ని తప్పులు పిల్లల వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. వారిని మానసికంగా ఇబ్బంది పెడతాయి.మీకు తెలుసో తెలియదో కానీ.. ప్రతి పిల్లవాడికి తమ తల్లిదండ్రులే రోల్ మోడల్. తల్లిదండ్రులను చూసే పిల్లలు ఎన్నో విషయాలను నేర్చుకుంటారు.
పెద్దయ్యాక మా అమ్మానాన్నల లాగే ఉండాలని అనుకుంటారు. తల్లిదండ్రుల వ్యక్తిత్వం, మాటలు, ప్రవర్తనలో చిన్న తేడా కూడా పిల్లల మనస్సుపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఎదిగే పిల్లల ముందు తల్లిదండ్రులు మాట్లాడకూడని మాటలేంటో ఇప్పుడు చూద్దాం పదండి.
పిల్లల్ని పోల్చొద్దు
చాలా మంది తల్లిదండ్రులు ఈ తప్పు ఖచ్చితంగా చేస్తారు. కానీ మీ పిల్లల్ని వేరే పిల్లలతో పోల్చి మాత్రం తప్పు చేయకండి. నీ వయసులో నేనూ అలా ఉండేవాడిని, ఇలా ఉండేవాడిని, పక్కింటి పిల్లాడిని చూసి నేర్చుకో.. ఆ పిల్లాడు ఎలా ఉన్నాడు.. మీరెలా ఉన్నారు అనే మాటలు పిల్లల ముందు అస్సలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ మాటలు మీ పిల్లల మనోభావాలను దెబ్బతీస్తాయి. ఇలా మీరు పిల్లలను తిట్టడం వల్ల మీ పిల్లలకు మీరంటే అసహ్యం కలుగుతుంది.
పిల్లల నిర్ణయాలను ఎగతాళి చేయకండి
పిల్లలు నిర్ణయాలు తీసుకోవడం తల్లిదండ్రులకు ఎంత మాత్రం ఇష్టం ఉండదు. ఒకవేళ తీసుకున్నా.. దాన్ని ఎగతాళి చేసి మాట్లాడుతుంటారు. పిల్లలు తీసుకున్న నిర్ణయాన్ని తప్పని ముఖంపైనే చెప్పేస్తుంటారు.
కానీ ఇలా చేయడం మంచి పద్దతి కాదు. మీ పిల్లలు తీసుకున్న నిర్ణయం సరైందో? కాదో? చెప్పే బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. కానీ ఇలా ఎగతాళి చేసి మాట్లాడటం సరికాదు.
పిల్లలను తోబుట్టువులతో పోల్చొద్దు
ఏ ఇద్దరు పిల్లలు అచ్చం ఒకేలా ఉండరు. ఒకేలా ప్రవర్తించరు. కానీ చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని తోబుట్టువులతో పోల్చి అవమానిస్తుంటారు. అవును పోల్చడం అవమానించడమే అవుతుంది.
జర్నల్ ఆఫ్ ఫ్యామిలీ సైకాలజీ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం.. తోబుట్టువులతో పిల్లల్ని పోల్చడం వల్ల వారితో శత్రుత్వం, ఆత్మగౌరవం తగ్గడం, తోబుట్టువుల సంబంధాలకు విఘాతం కలిగిస్తుందని కనుగొన్నారు.
ప్రతి పిల్లాడు స్వంత బలాలు, బలహీనతలను కలిగి ఉంటాడు. అందుకే పేరెంట్స్ వారి వ్యక్తిగత ప్రతిభను ప్రోత్సహించాలి.అలాగే వారి వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెట్టాలి. అంతేకానీ తోబుట్టువులతో పోల్చకండి. మీ అన్నని చూసి నేర్చుకో, మీ అక్కని చూసి నేర్చుకో వంటి మాటలను మాట్లాడకండి. ఈ మాటల వల్ల తోబుట్టువుల పట్ల ద్వేషభావం కలుగుతుంది.
ప్రేమను వాయిదా వేయడం..
ఈ రోజుల్లో తల్లిదండ్రులు చాలా బిజీ బిజీ అయిపోయారు. ఒత్తిడితో కూడిన లైఫ్ లో వీళ్లు తమకు పిల్లలున్నారనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. ఖాళీ టైం దొరికితే ఫోన్ లో దూరిపోతుంటారు. కానీ ప్రతి పిల్లలు తల్లిదండ్రులతో సరదాగా గడపాలనుకుంటారు. కానీ మీరు మీ మీ పనుల్లో బిజీ అయితే మీ పిల్లలు ఒంటరిగా ఫీలవుతారు. మాకు ఎవరూ లేరని అనుకుంటారు.
అందంగా లేవు.
కొంతమంది పిల్లల్ని అందంగా లేవని ముఖం మీదే చెప్పేస్తుంటారు. కానీ ఇది వారిని ఎంతో బాధిస్తుంది. అలాగే వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం.. పిల్లల రూపాన్ని విమర్శించడం వల్ల బాడీ షేమింగ్, తినే రుగ్మతల బారిన పడతారు.
పిల్లల అందంపై కాదు.. వారి సహజ ప్రతిభను ప్రోత్సహించండి. వారి శారీరక రూపం కంటే వారి దయ, సృజనాత్మకత, తెలివితేటలను అభినందించడం నేర్చుకోండి.
నేను ఇక మీతో మాట్లాడను
పేరెంట్స్ కూడా పిల్లల్ని బెదిరిస్తుంటారు. ఇలా చేశావంటే ఇక నేను నీతోని మాట్లాడను అని. కానీ ఇది మంచి పద్దతి కాదు. ఇది పిల్లలకు ఎంతో బాధను కలిగిస్తుంది. అభద్రతా భావాన్ని కలిగిస్తుంది.
పిల్లలు తమ తల్లిదండ్రులతో సంబంధంలో సురక్షితంగా ఉండాలనుకుంటారు. అందుకే బెదిరింపులకు బదులు మంచి క్రమశిక్షణపై దృష్టి పెట్టండి. హెల్తీ కమ్యూనికేషన్ ద్వారానే మీరు పిల్లల్ని చక్కదిద్దొచ్చు. పిల్లలు తప్పు చేసినప్పుడు వారితో కూర్చొని మాట్లాడండి. ఇలా చేయకండని చెప్పండి.