- Home
- Life
- Pregnancy & Parenting
- పిల్లలు ప్రతి చిన్న విషయానికి ఏడుస్తున్నారా? ఇలా చేస్తే వెంటనే ఆపేస్తారు
పిల్లలు ప్రతి చిన్న విషయానికి ఏడుస్తున్నారా? ఇలా చేస్తే వెంటనే ఆపేస్తారు
Parenting tips: పిల్లలను చూసుకోవడం ఈజీ పనేమి కాదు. చాలామంది పిల్లలు ప్రతి చిన్న విషయానికి ఏడుస్తుంటారు. వారు ఎందుకు ఏడుస్తున్నారో తెలియక పేరెంట్స్ తల పట్టుకుంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో పిల్లల ఏడుపు మాన్పించవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం.

పేరెంటింగ్ టిప్స్
సాధారణంగా పిల్లలు ఏడుస్తుంటే తల్లిదండ్రులకు ఏమి తోచదు. ఒక్కోసారి వారు ఎందుకు ఏడుస్తున్నారో తెలియక పేరెంట్స్ ఆందోళన పడుతుంటారు. పిల్లలు కొన్నిసార్లు బిస్కెట్ విరిగినా ఏడుస్తారు. బొమ్మలు విరిగిపోయినా ఏడుస్తారు. దేనికైనా నో చెప్పినా ఏడుస్తారు. ఇది చాలా ఇళ్లల్లో కనిపించే విషయమే అయినప్పటికీ.. దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే పిల్లల ఏడుపు కేవలం బలహీనత కాదు. ఒక రకమైన కమ్యూనికేషన్ కూడా. మరి పిల్లలు ఏడవకుండా లేదా ఏడుపు మానేసేందుకు పేరెంట్స్ ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.
ఏడుపు వెనుక కారణాలు గమనించాలి
ముందుగా పిల్లల ఏడుపు వెనుక ఉన్న కారణాలను గమనించాలి. ఆకలి, అలసట, నిద్ర లేకపోవడం, దృష్టి ఆకర్షించాలనే కోరిక, లేదా భయంతో కూడా పిల్లలు ఏడుస్తారు. కొందరు పిల్లలు తల్లిదండ్రుల స్పందనను పరీక్షించటానికి కూడా ఏడుస్తారు. చిన్న వయసులో ఇది సహజమే, కానీ వయసు పెరుగుతున్న కొద్దీ ఈ అలవాటు నియంత్రణలో లేకపోతే ఇబ్బందికరంగా మారవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం చేసుకోవడంతో పాటు సరైన పద్ధతిలో స్పందించడం ముఖ్యం. కొన్ని సార్లు పిల్లలు తమ అసహనం లేదా నిరాశను వ్యక్తపరచడానికి కూడా ఏడుస్తుంటారు. అలాంటి టైంలో తల్లిదండ్రులు పిల్లలతో ప్రశాంతంగా మాట్లాడాలి. దానివల్ల పిల్లల ఏడుపు తగ్గుతుంది.
ఏడ్చిన వెంటనే కావాల్సింది ఇవ్వకూడదు
చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఏడుస్తుంటే వెంటనే వాళ్లకు కావాల్సింది ఇస్తుంటారు. దానివల్ల నేను ఏడిస్తే నాకు కావాల్సింది దొరుకుతుందనే భావన పిల్లల్లో మొదలవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కొద్దిసేపు ఆగి, పిల్లల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేయాలి. పిల్లలకు ఎమోషన్ లేబెలింగ్ నేర్పించాలి. అంటే “నీకు ఇప్పుడు బాధగా ఉందా?” లేదా కోపంగా ఉందా?” అని అడగడం వల్ల పిల్లలు తమ భావాలను అర్థం చేసుకుంటారు. భావోద్వేగాన్ని మాటల్లో చెప్పడం నేర్చుకున్నప్పుడు.. ఏడుపు తక్కువవుతుంది.
పేరెంట్స్ స్థిరంగా ఉండాలి
తల్లిదండ్రులు తమ స్పందనలో స్థిరంగా ఉండాలి. పిల్లలు ఏడ్చినప్పుడు ఒక రోజు లొంగిపోయి, మరుసటి రోజు దాన్ని పట్టించుకోకపోతే పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ప్రతి పరిస్థితిలో ఒకే రకంగా స్పందించాలి. అదీ ప్రశాంతంగా, ప్రేమతో కూడిన విధంగా ఉండాలి. కొట్టడం లేదా ఏడవకు అని కఠినంగా చెప్పడం మంచిదికాదు. కొన్ని సందర్భాల్లో పిల్లలు తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించడానికి కూడా ఏడుస్తారు. కాబట్టి రోజూ వారితో కొంత సమయం గడపాలి. వాళ్లతో ఆటలు ఆడడం, కథలు చెప్పడం వంటివి వారిలో నమ్మకాన్ని పెంచుతాయి. ఏడుపును తగ్గిస్తాయి.
ఏడుస్తున్నప్పుడు ఇలా చేస్తే..
ప్రతి పిల్లవాడు వేరు వేరు స్వభావాన్ని కలిగి ఉంటాడు. ఒకరికి పనిచేసిన పద్ధతి మరొకరికి పనిచేయకపోవచ్చు. కానీ ప్రేమ, సహనం, స్పష్టమైన కమ్యూనికేషన్ ఉంటే పిల్లలు ధైర్యంగా తమ భావాలను వ్యక్తపరుస్తారు. ఏడుపును నియంత్రించుకుంటారు. పిల్లలు ఏడుస్తున్నప్పుడు వారిని కౌగిలించుకోవడం, సాంత్వన ఇవ్వడం, తర్వాత సమస్యను వివరించడం వంటివి మంచి ఫలితాలు ఇస్తాయి.