పిల్లలను ఒంటరిగా పడుకోనివ్వడం మంచిదా? కాదా?
పేరెంటింగ్‌లో ముఖ్యమైన విషయం ఏమిటంటే పిల్లలను హాయిగా నిద్రపోనివ్వడం. సాధారణంగా పిల్లలు పేరెంట్స్ దగ్గరే ప్రశాంతంగా నిద్రపోతారు. అయితే ఎంత వయసు వచ్చే వరకు పిల్లలు తల్లిదండ్రుల పక్కన నిద్రపోవాలన్నది చాలా మందికి తెలియదు. పిల్లలు తల్లిదండ్రుల వద్ద పడుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు, ఇబ్బందుల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశంతో సహా అనేక దేశాల్లో పిల్లలు తమ తల్లిదండ్రులతో పాటు పడుకోవడం సర్వసాధారణం. తల్లిదండ్రులతో కలిసి జీవించడం లాగే వారితో పాటు పడుకోవడం కూడా మామూలే. ఇండియాలో అయితే తమ పిల్లలతో కలిసి పడుకోవడాన్ని తల్లిదండ్రులు తప్పుగా భావించరు. నిజానికి ఇది ఆరోగ్యకరమైన అలవాటు కూడా. అయితే కొన్ని దేశాల్లో పేరెంట్స్ తమ ప్రైవసీ కోల్పోతున్నామని పిల్లలను వేరే గదిలోనో, వేరే బెడ్ పైనో పడుకోబెడతారు. ఇప్పుడు ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది. పిల్లలు తల్లిదండ్రులతో కలిసి పడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఇబ్భందులు గురించి ఎక్కువ మంది చర్చించుకుంటున్నారు.
పిల్లలతో కలిసి తల్లిదండ్రులు పడుకోవడం వల్ల వారి మధ్య బలమైన భావోద్వేగ సంబంధం ఏర్పడుతుంది. భవిష్యత్తులో వారి మధ్య బాండింగ్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. బంధాలను పెంపొందించడంలో సహాయపడుతుంది. ఇది కుటుంబంలో భద్రత, ఐక్యతను పెంపొందిస్తుంది.
నడక రాని పిల్లలను దూరంగా పడుకోబెట్టడం అంత మంచిది కాదు. వారిని పక్కనే పడుకోబెట్టుకోవడం వల్ల రాత్రిపూట తల్లి పాలు ఇవ్వడానికి సులువుగా ఉంటుంది. ఇది తల్లి, శిశువు ఇద్దరికీ చాలా సౌకర్యంగా ఉంటుంది. చిన్నారి కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. రాత్రిపూట బిడ్డ ఏడ్చినా ఓదార్చడానికి, శాంతింపజేయడానికి వీలుగా ఉంటుంది. దూరంగా పడుకోబెడితే తల్లి లేదా తండ్రి నిద్ర లేచి వెళ్లి ఓదార్చడం చాలా ఇబ్బంది పెడుతుంది. పక్కపక్కనే పడుకోవడం వల్ల తల్లిదండ్రులు, పిల్లలు బాగా నిద్రపోవచ్చు.
పిల్లల మెచ్యూరిటీ లెవల్స్ తక్కువగా ఉండటం వల్ల వారు ప్రతి చిన్న విషయానికి భయపడతారు. పగలు చూసిన లేదా విన్న విషయాలు రాత్రి పూట కలల రూపంలో కనిపిస్తాయి. అందువల్ల వారు ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు వారు కలవరించడం, ఉలిక్కి పడి లేవడం జరుగుతుంది. అలాంటి సమయంలో తల్లిదండ్రులు పక్కనే ఉంటే వారికి కొండంత ధైర్యంగా ఉంటుంది.
వారు వేరే చోట పడుకుంటే కలవరింతలు, కేకలు వేయడం చేస్తారు. దీంతో తల్లిదండ్రులు కూడా ఆందోళనతో వారి దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. దీని వల్ల ఇద్దరికీ నిద్రాభంగం కలుగుతుంది. ఇదీ తరచూ జరగడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి పడుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది భావోద్వేగ భద్రతను మెరుగుపరుస్తుంది. రాత్రిపూట శిశువులను జాగ్రత్తగా చూసుకోవడానికి సహాయపడుతుంది.
పిల్లలను ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా వేరుగా పడుకోవడం అలవాటు చేయాలి. ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు తోటి పిల్లలతో కలిసి పడుకోనివ్వాలి. రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు వారితో కలిసి పడుకోనివ్వాలి. ఇలా పిల్లల వయసు పెరిగే కొద్దీ వారిలో ఆలోచనా శక్తి పెరిగేలా చేయాలి. అంతేకాని బలవంతంగా దూరంగా వేరే గదిలో పడుకోబెట్టకూడదు. దీని వల్ల వారు అభద్రతా భావానికి గురవుతారు. నిద్ర విషయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను మీ బిడ్డకు ఇవ్వండి.
వారి భావోద్వేగాలకు విలువ ఇవ్వాలి. వారిలో ఆలోచనాశక్తి పెరిగినప్పుడు ఆటోమెటిక్ గా మార్పు వస్తుంది. వారి వయసు పెరిగే కొద్దీ ఇంట్లో మంచం కూడా సరిపోకపోవచ్చు. దానికి వారే ఆలోచించుకొని వేరే బెడ్ పై పడుకుంటామని చెప్పొచ్చు. ఆ స్వేచ్ఛను మీరివ్వాలి. పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఇలాంటి చిన్న విషయాల గురించి కూడా గుర్తు పెట్టుకుంటారు. కుటుంబ బంధాలు స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇలాంటి కొన్ని విషయాలకు విలువ ఇవ్వాలి.
తల్లిదండ్రులతో కలిసి పడుకోవడం వల్ల కలిగే నష్టం ఏమిటంటే.. పిల్లలు తమ తల్లిదండ్రుల సాన్నిహిత్యం, భద్రతపై ఆధారపడి ఉంటారు. దీని వల్ల వారు స్వతంత్రంగా నిద్రపోయే అలవాటు చేసుకోలేరు. ఒక దశ తర్వాత పిల్లలు ఒంటరిగా పడుకోవడం అలవాటు చేసుకోవాలి. దీన్ని తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి.
పిల్లలు ఎందుకు ఒంటరిగా పడుకోవాలి
పిల్లల చిన్నప్పుడు తల్లిదండ్రులు వారితో ఎక్కువగా అటాచ్ అయి ఉంటారు. ఈ కారణంగా పిల్లలతో పడుకోవడం తప్పు కాదు. కానీ పిల్లలు పెరిగే కొద్దీ వారు ఒంటరిగా పడుకోవడం అలవాటు చేసుకోవాలి. కొన్నిసార్లు పిల్లలు ఒంటరిగా పడుకోవాలనుకుంటారు. కానీ తల్లిదండ్రులు దానిని అనుమతించరు. ఇది పూర్తిగా తప్పు. మీరు ఇలాగే చేస్తే మీ బిడ్డ మీరు లేకుండా నిద్రపోరు. ఇది మీకు కూడా ఇబ్బంది కలిగించే విషయంగా మారుతుంది.
అందుకని మీ బిడ్డను హఠాత్తుగా ఒంటరిగా పడుకోమని బలవంతం చేయకండి. ముందు వారంలో రెండు లేదా మూడు సార్లు వారిని ఒంటరిగా పడుకోనివ్వండి. ఆపై మీరు నెమ్మదిగా ఒంటరిగా పడుకునే రోజుల సంఖ్యను పెంచవచ్చు. ఇలా నిరంతరం చేస్తూ ఉంటే ఒంటరిగా పడుకోవడం అలవాటు అవుతుంది.
పిల్లలు ఒంటరిగా పడుకోవడానికి సరైన వయస్సు 8 సంవత్సరాలు. అప్పటి నుండి పిల్లలను ఒంటరిగా పడుకోవడానికి క్రమంగా ప్రయత్నించవచ్చు. ఈ వయస్సు తర్వాత పిల్లలు పెద్దవారవుతారు. కాబట్టి 8 సంవత్సరాల నుండి పిల్లలను ఒంటరిగా పడుకోనివ్వవచ్చని నిపుణులు చెబుతున్నారు.