ఏపిలో పొత్తులపై బిజెపి క్లియర్: చంద్రబాబు దూరమే, పవన్ రియాక్షన్ పై ఉత్కంఠ
చంద్రబాబు కన్నా వైఎస్ జగన్ తమకు ముఖ్యమనే అభిప్రాయంతో బిజెపి అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును నమ్మలేమనే ఉద్దేశంతో కూడా ఉన్నట్లు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుకునే పొత్తులపై బిజెపి స్పష్టమైన వైఖరి తీసుకుందనే అభిప్రాయానికి తావు ఏర్పడుతోంది. రేపు మంగళవారం జరిగే జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్ఢిఎ) సమవేశానికి తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఆహ్వానం అందలేదు. చాలా కాలంగా చంద్రబాబు బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. తాజా పరిణామం ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
ఆ మధ్య కాలంలో చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాంతో టిడిపితో స్నేహం చేయడానికి బిజెపి సిద్ధపడుతున్నట్లు ప్రచారం జరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒత్తిడికి బిజెపి తలొగ్గినట్లు అందరూ భావించారు. అయితే, ఆ భేటీ తర్వాత ఆ దిశగా ఏ విధమైన కదలికలు లేవు. బిజెపి అగ్ర నేతలు మళ్లీ చంద్రబాబును సంప్రదించిన దాఖలాలు కనిపించలేదు. తాజాగా ఎన్డీఎ సమవేశానికి చంద్రబాబును ఆహ్వానించలేదు. పవన్ కల్యాణ్ కు మాత్రం ఆహ్వానం అందింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కూడా ఎన్టీఎ సమావేశానికి ఆహ్వానం అందలేదు. ఎన్డీఎలో చేరడానికి వైఎస్ జగన్ సుముఖంగా లేరు. కానీ కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా ఆయన సహకరిస్తున్నారు. చంద్రబాబు కన్నా వైఎస్ జగన్ తమకు ముఖ్యమనే అభిప్రాయంతో బిజెపి అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును నమ్మలేమనే ఉద్దేశంతో కూడా ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో తమకు వ్యతిరేకంగా చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలను, చేసిన వ్యాఖ్యలను బిజెపి నేతలు మరిచిపోలేదనే మాట వినిపిస్తోంది.
పవన్ కల్యాణ్ మాత్రం వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ను గద్దె దించాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకు ప్రతిపక్షాల ఓట్లు చీలిపోకూడదని ఆయన భావిస్తున్నారు. ఆ విషయాన్ని ఆయన బాహాటంగా వెల్లడించారు. అందుకు టిడిపితో పొత్తు అవసరమని ఆయన భావిస్తున్నారు. వైసిపికి వ్యతిరేకంగా బిజెపి, జనసేన, టిడిపి కలిసి పోటీ చేయాలనేది ఆయన ఉద్దేశం. ఇందుకు బిజెపి అగ్ర నాయకత్వానికి ఒప్పించడానికి ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు.
chandrababu-jagan
చంద్రబాబుతో పొత్తుకు సిద్ధపడకపోతే బిజెపితో తెగదెంపులు చేసుకోవడానికి కూడా సిద్ధపడినట్లు పవన్ కల్యాణ్ సంకేతాలు ఇచ్చారు. అయితే, బిజెపి మాత్రం టిడిపితో పొత్తుకు సిద్ధంగా లేనట్లు ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయి. అయితే, ఎన్నికలు సమీపించేనాటికి పరిస్థితులు మారుతాయని కూడా అనుకోవచ్చు. కానీ, ఎపిలో తాము అధికారంలోకి రాలేమనే విషయం బిజెపికి స్పష్టంగా తెలుసు. అందుకని, పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావడానికి సహకరిస్తే చంద్రబాబు ఆ తర్వాత తమకు పూర్తిగా అనుకూలంగా ఉంటారనే నమ్మకం లేదు. జగన్ మీద నమ్మకం ఉంచుకోవచ్చునని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.