రెండేళ్లపాటు వెంటబడి, వేధించి, యువతి హత్య... పట్టుకోబోయిన పోలీసులపై కాల్పులు...
యువతిని చంపిన ఓ నిందితుడు దీపక్ రాథోడ్‌ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో ఓ పోలీసు గాయపడ్డాడు.

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ధార్ నగరంలోని నివాస ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఓ యువతిని ఓ దుండగుడు కాల్చి చంపాడు. అతడు ఆ యువతిని గత రెండేళ్లుగా వేధిస్తున్నాడు. ఈ కేసులో అనుమానితుడిగా దీపక్ రాథోడ్ గా గుర్తించారు. అతను పూజా (22) అనే మహిళను గత రెండేళ్లుగా పెళ్లి చేసుకోవాలంటూ వేధిస్తూ, వెంబడిస్తున్నాడని, అయితే ఆమె అతనిని పదే పదే తిరస్కరించిందని పోలీసులు తెలిపారు.
దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే... బాధితురాలైన యువతి ధార్‌లోని బ్రహ్మకుండ్‌లో తన తల్లి, ఇద్దరు సోదరీమణులతో కలిసి ఉంటోంది. ఆమె స్థానికంగా ఉన్న ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తోంది. ఉదయాన్నే పూజా, పనికి వెళుతుండగా రాథోడ్ ఎదురుపడి కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
సాక్షులు అధికారులను అప్రమత్తం చేయడంతో రాథోడ్ కోసం గాలింపు చేపట్టారు. రాథోడ్ గత రెండేళ్లుగా పూజను వెంబడించిన చరిత్ర ఉందని.. ఆమె అతని వేధింపుల మీద కోర్టులో ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడు ఆమె కుటుంబ సభ్యులను, స్నేహితులను కూడా బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.
అదేరోజు తెల్లవారుజామున పోలీసులు రాథోడ్‌ని బ్రహ్మకుండ్‌లోని అతని ఇంటి వద్ద గుర్తించారు. అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. అయితే అతను ప్రతిఘటించి అధికారులపై కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో ఒకరికి గాయాలయ్యాయి.
పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో రాథోడ్ కాలికి గాయమైంది. అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించారని రాథోడ్ ఇంటిని కూడా పోలీసులు కూల్చివేశారు.
ఈ కూల్చివేతలో మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు. అతనిది అనధికార నిర్మాణమని చెబుతూ తొలగించారు. పూజను హత్య చేయడంతో సమాజంలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి, ఆమెకు న్యాయం చేయాలని, రాథోడ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ లు వెల్లువెత్తుతున్నాయి.