మొట్టమొదటి ఆధార్ కార్డు హోల్డర్ ఎవరో తెలుసా?
First Aadhaar Card Holder: దేశంలోని ప్రతి పౌరునికి ఒక సార్వత్రిక గుర్తింపును అందించాలనే లక్ష్యంతో ఆధార్ కార్డు ప్రాజెక్టు 2009లో ప్రారంభించారు. ఇది 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) జారీ చేస్తుంది.

2009 లో ఆధార్ ప్రాజెక్టు ప్రారంభం
First Aadhaar Card Holder: ప్రభుత్వ ప్రయోజనాలు సరైన వ్యక్తులకు చేరేలా, అవినీతి, అక్రమాలను తగ్గించేలా, మరింత మందిని ఆర్థిక సేవలకు అనుసంధానించడానికి ప్రతి పౌరుడికి ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపును అందించడానికి భారత్ ఆధార్ ప్రాజెక్టును 2009 లో ప్రారంభించింది. ప్రభుత్వం 2010లో తొలి ఆధార్ కార్డును జారీ చేసింది.
KNOW
తొలి ఆధార్ కార్డు హోల్డర్
2010లో మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలోని టెంబ్లీ గ్రామానికి చెందిన రంజనాబాయి సోనావానేకు దేశంలో మొట్టమొదటి ఆధార్ కార్డును అందించారు. ఆ సమయంలో ఆమె వయసు 54 ఏళ్లు. పేదలను చేరుకోవడమే ఆధార్ లక్ష్యం అన్న సందేశాన్ని ఇచ్చేందుకు ఆమెను ప్రత్యేకంగా ఎంపిక చేశారు. రంజనాబాయి ఫోటో దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. ఆమె ఆధార్ పథకానికి ప్రతీకగా నిలిచారు. ఆమె డిజిటల్ ఇండియా ప్రారంభానికి చిహ్నంగా మారింది.
టెంబ్లీ నుంచి ఆధార్ నమోదు ప్రారంభం
టెంబ్లీ గ్రామం నుంచే ఆధార్ నమోదు ప్రక్రియ మొదలైంది. అక్కడి ప్రజల వేలిముద్రలు, కంటి స్కానింగ్‌తో పాటు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. రంజనాబాయి ఆధార్ నంబర్ ద్వారా ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు (DBT) లింక్ అయ్యేలా చేశారు. ఆమెను ఆదర్శంగా చూపిస్తూ ఆధార్ ప్రాజెక్టును దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించారు.
తొలి ఆధార్ కార్డు హోల్డర్ రంజనాబాయి ఎదుర్కొంటున్న సమస్యలు
అయితే, రంజనాబాయికి అనేక ప్రభుత్వ పథకాల లబ్ధి అందడం లేదని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఉదాహరణకు, మహారాష్ట్రలో అమలవుతున్న లడ్కీ బెహెన్ యోజన నుంచి డబ్బు ఆమెకు చేరడం లేదు. ప్రభుత్వం ఆ మొత్తం ఆమె ఖాతాలో జమ అవుతోందని చెబుతున్నా, వాస్తవానికి ఆమెకు ఏమీ అందలేదు. సమస్య పరిష్కారం కోసం బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలను అనేకసార్లు ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. డబ్బు వేరే ఖాతాకు వెళ్తోందనే అనుమానాలు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ఆధార్ సంబంధిత చెల్లింపు సమస్యలు
ఈ సమస్య ఒక్క రంజనాబాయికే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆధార్-లింక్డ్ చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక సర్వే ప్రకారం, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ గ్రహీతలలో 73 శాతం మంది చెల్లింపు సమస్యలను ఎదుర్కొన్నారు. అందులో 18 శాతం కేసులు ఆధార్-బ్యాంక్ ఖాతా లింక్ లోపాల వల్ల ఏర్పడ్డాయి.
NPCI వ్యవస్థలో క్లిష్టత
ఆధార్ ద్వారా జరిగే చెల్లింపులు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అమలు చేస్తున్న యాక్టివ్ పేమెంట్స్ బ్రిడ్జ్ సిస్టమ్ (APBS) ద్వారా జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ క్లిష్టంగా ఉండటంతో ప్రజలు తమ డబ్బు ఏ ఖాతాలో జమ అవుతోందో కూడా స్పష్టంగా తెలుసుకోలేకపోతున్నారు. ఫలితంగా, చాలా మంది లబ్ధిదారులు ప్రభుత్వ ప్రయోజనాల నుండి దూరమవుతున్నారు.