Union Budget 2025: డేట్, టైమ్, ఎప్పుడు, ఎక్కడ లైవ్ చూడొచ్చు... పూర్తి సమాచారం
మోదీ సర్కార్ బడ్జెట్ 2025-26 ను ప్రజలముందుకు తేనుంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎప్పుడు, ఎక్కడ బడ్జెట్ ప్రవేశపెడతారు... ఈ ప్రసంగాన్ని ఎక్కడ లైవ్ లో చూడవచ్చో తెలుసుకొండి.

Union Budget 2025
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025న వరుసగా ఎనిమిదో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండో పూర్తి ఆర్థిక బడ్జెట్. 2021 నుంచి కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం 2025-26 కేంద్ర బడ్జెట్ కూడా పూర్తిగా కాగిత రహితంగా ఉంటుంది.
కేంద్ర బడ్జెట్ అంటే ఏమిటి?
ఓ ఆర్థిక సంవత్సరానికి దేశ ఆదాయం, ఖర్చుల లెక్కలతో ప్రణాళికాబద్దంగా రూపొందించే నివేదికే బడ్జెట్. అంటే రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ముందుగానే ప్రణాళిక రూపొందిస్తుందన్నమాట. ఎంత ఆదాయం వస్తుంది? ఎలా వస్తుంది? దీన్ని ఏ రంగాలకు, ఏ రాష్ట్రాలకు ఎంత కేటాయించి ఖర్చుచేయాలి? అనేది ఈ వార్షిక ఆర్థిక నివేదికలో పేర్కొంటారు. ఇలా ఈసారి కూడా ఏప్రిల్ 1, 2025 నుండి మార్చి 31, 2026 వరకు బడ్జెట్ ను సిద్దం చేసింది నరేంద్ర మోదీ సర్కార్.
బడ్జెట్ 2025 తేదీ, సమయం
దేశ ఆర్థిక మంత్రి సీతారామన్ ఫిబ్రవరి 1, 2025న పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రసంగం ఉదయం 11:00 గంటలకు లోక్‌సభలో ప్రారంభం కానుంది. అంతకుముందు కేంద్ర కేబినెట్ సమావేశమై ఈ బడ్జెట్ 2025 కు ఆమోదం తెలుపుతుంది.
నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025 స్పీచ్ లైవ్ ఎక్కడ చూడాలి
2025 కేంద్ర బడ్జెట్ ప్రసంగాన్ని ఏసియా నెట్ న్యూస్ అందిస్తోంది. ఏసియా నెట్ YouTube ఛానెల్ లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని లైవ్ లో వీక్షించవచ్చు.
బడ్జెట్ పత్రాల డిజిటల్ యాక్సెస్ ఇక్కడ పొందండి
బడ్జెట్ 2025 సమాచారం కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్ పోర్టల్ www.indiabudget.gov.inలో అందుబాటులో ఉంటాయి.గ్రాంట్ల డిమాండ్ (DG), ఆర్థిక బిల్లుతో సహా అన్ని బడ్జెట్ పత్రాలు యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయి. ఈ పత్రాలు హిందీ, ఆంగ్లంలో అందుబాటులో ఉంటాయి.
బడ్జెట్ 2025 ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైంది
ఆర్థిక మంత్రిత్వ శాఖ అక్టోబర్ 2024లో బడ్జెట్ తయారీ ప్రక్రియను ప్రారంభించింది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక అంచనాలు, అవసరాలను ఖరారు చేయడానికి వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపారు. వీటి ఆదారంగా ఏ రంగానికి ఎలా ఆదాయాన్ని కేటాయించాలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఓ ప్రణాళికను రూపొందించారు. దీన్ని బడ్జెట్ 2025 రూపంలో ప్రజలముందుకు తీసుకువస్తున్నారు.
మోడీ ప్రభుత్వ బడ్జెట్ విధానంలో కీలక మార్పులు:
2014 నుంచి మోడీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ ప్రజెంటేషన్ ప్రక్రియలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది. ముఖ్యమైన మార్పులు:
2017లో రైల్ బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌తో విలీనం చేయడం.
బడ్జెట్ ప్రజెంటేషన్ తేదీని సాంప్రదాయ నెలాఖరు షెడ్యూల్ నుండి ఫిబ్రవరి 1కి ముందుకు తీసుకురావడం.
2021లో పూర్తిగా డిజిటల్ ఫార్మాట్‌కు మారడం.