Today Top 5 News : ఈ రోజు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే..
Today Top 5 News : మీరు ఇవాళ్టి (సెప్టెంబర్ 25, గురువారం) టాప్ న్యూస్ ఒకేచోట తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకోసమే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఎంటర్టైన్మెంట్, నేషనల్, ఇంటర్నేషనల్ టాప్ 5 వార్తలు ఇక్కడ అందిస్తున్నాం...

1. పవన్ కల్యాణ్ ఓజి సినిమాకు హైకోర్టులో ఊరట
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'ఓజీ' మూవీ ఇవాళ విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సక్సెస్ టాక్ సాధించింది. అయితే కొన్నిచోట్ల అనుకున్న సమయానికి షోలు పడకపోవడం, మరికొన్నిచోట్ల న్యాయపరమైన సమస్యలను ఈ సినిమా ఎదుర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్ల ధరలను పెంచారు... ఈ పెంపుపై ఏపీలో ఎలాంటి సమస్య లేదు కానీ తెలంగాణలోనే హైకోర్టు మొదట అభ్యంతరం తెలిపింది. OG సినిమా టికెట్ల ధరలు పెంచుతూ ప్రభుత్వం విడుదలచేసిన జీవోను రద్దు చేయాలని సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది... కానీ హైకోర్ట్ డివిజన్ బెంచ్ నుండి ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది.. ఈ తీర్పును రేపటి వరకు సస్పెండ్ చేసింది. దీంతో ఓజి సినిమాకు యధావిధిగా అధిక టికెట్ ధరలు కొనసాగాయి.
2. తెలంగాణలో కొత్త మద్యం షాపులకు దరఖాస్తులు
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో కొత్త మద్యం షాపుల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీచేసింది. సెప్టెంబర్ 26 నుండి అంటే రేపు శుక్రవారం నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తున్నట్లు... అక్టోబర్ 18 వరకు దరఖాస్తులను తీసుకుంటామని తెలిపారు. దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసి అక్టోబర్ 23న డ్రా పద్ధతిలో షాపుల కేటాయింపు చేపడతామని వెల్లడించింది. అయితే గతంలో ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల ఫీజు ఉండగా ఇప్పుడు దాన్ని రూ.3 లక్షలకు పెంచారు. ఈ ఏడాది చివర్లో ఇప్పుడున్న మద్యంషాపుల కాలపరిమితి ముగుస్తుంది... డిసెంబర్ 1 నుంచి కొత్తషాపుల్లో మద్యం విక్రయాలు జరుగుతాయి... 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాలపరిమితి ఉంటుంది. ఈ మద్యంషాపుల కేటాయింపులో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయించారు.
3. ఆంధ్ర ప్రదేశ్ లో డిఎస్సి అభ్యర్దులకు నియామకపత్రాల పంపిణీ
ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇలా 16,347 పోస్టుల భర్తీ ప్రక్రియను కేవలం 150 రోజులలోనే పూర్తిచేశారు... తాజాగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు స్వయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియామక పత్రాలను అందించారు. రాజధాని అమరావతిలో జరిగిన ఈ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎంతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, టీచర్ జాబ్ పొందిన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. టాప్ లో నిలిచిన ఓ 20 మందికి సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ లెటర్లు అందించారు.. మిగతావారికి ఆయా జిల్లాల్లో అధికారులు అందించనున్నారు.
4. ఎన్నికల వేళ దూకుడు పెంచిన బిజెపి
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఇప్పుడు రాష్ట్రాల్లో అధికారంపై కన్నేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే బిహార్ ఎన్నికల్లో మిత్రపక్షంతో కలిసి ముందుకు వెళుతోంది. అలాగే రాబోయే పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కూడా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ఆయా రాష్ట్రాలకు ఎలక్షన్ ఇంచార్జీలను నియమించింది బిజెపి. బిహార్ కు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పశ్చిమ బెంగాల్ కు మరో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, తమిళనాడుకు పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బైజయంత్ పాండా ఎన్నికల ఇంచార్జీలుగా ప్రకటించింది బిజెపి.
5. H1B వీసాల విషయంలో ట్రంప్ పై న్యాయపోరాటం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసాల విషయంలో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది. హెచ్1బి వీసా ఫీజును 1,00,000 డాలర్లకు పెంచడమే కాదు లాటరీ విధానంలో మార్పులు చేపట్టాలన్న నిర్ణయాన్ని ఆ దేశ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యతిరేకిస్తోంది. దీనిపై న్యాయపోరాటానికి సిద్దమవుతునట్లు అమెరికా వార్తా పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి.
ఇక ప్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి పారిస్ న్యాయస్థానం ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. లిబియా మాజీ అధ్యక్షుడు గడాఫీ నుండి 2007 లో అధ్యక్ష ఎన్నికల కోసం సర్కోజీ డబ్బులు తీసుకున్నాడనే ఆరోపణలున్నాయి. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం దోషిగా తేల్చిన న్యాయస్థానం మాజీ అధ్యక్షుడికి శిక్ష ఖరారు చేసింది.