- Home
- National
- దారుణం.. ప్రేమకు ఒప్పుకోలేదని టీఎంసీ నేత కుటుంబం హత్య.. ముగ్గురు మృతి, ఒకరి పరిస్థితి విషమం..
దారుణం.. ప్రేమకు ఒప్పుకోలేదని టీఎంసీ నేత కుటుంబం హత్య.. ముగ్గురు మృతి, ఒకరి పరిస్థితి విషమం..
తమ ప్రేమకు అడ్డుచెప్పారని..ఓ ప్రియుడు దారుణానికి ఒడి గట్టాడు. యువతి కుటుంబ సభ్యుల మీద దాడికి దిగాడు. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా, ప్రియురాలు తీవ్ర గాయాలపాలైంది.

పశ్చిమ బెంగాల్ : పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్ జిల్లా సితాల్‌కుచి ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్‌కి చెందిన పంచాయితీ నాయకురాలు, ఆమె భర్త, పెద్ద కుమార్తెలను శుక్రవారం అతి దారుణంగా నరికి హత్య చేశారు. కుటుంబంపై దాడి చేసిన తరువాత ఇంటి నుండి పారిపోతుండగా ప్రధాన నిందితుడితో పాటు, అతని ఇద్దరు సహచరులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మృతులను నీలిమా బర్మన్ (52), బిమల్ కుమార్ బర్మన్ (68), రునా బర్మన్ (24)గా గుర్తించారు. ఈ దాడిలో దంపతుల చిన్న కుమార్తె ఇతి (22) కూడా తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వారు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ప్రేమ వ్యవహారమే ఈ హత్యలకు దారి తీసినట్టుగా సమాచారం. ఈ మేరకు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ప్రాథమికంగా చూస్తే, ఈ హత్యలకు రాజకీయ సంబంధం లేదని చెబుతున్నారు. టీఎంసీ నాయకురాలి చిన్న కుమార్తెతో నిందితుడికి ప్రేమవ్యవహారం ఉందని తెలిసింది. కాగా వీరి ప్రేమకు యువతి కుటుంబ సభ్యులు అడ్డు చెప్పారు. దీంతో యువతి కూడా అతనికి దూరమయ్యింది. ఈ ఘటనతో కక్ష పెంచుకున్న వ్యక్తి ఆ కుటుంబంపై దాడి చేశాడు. ఆమెతో ప్రేమ వైఫల్యం కావడంతో ఆ వ్యక్తి ప్రతీకారంతో మహిళ కుటుంబాన్ని చంపాడని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తెల్లవారుజామున 4.50 గంటలకు నిందితుడు విభూతి భూషణ్ రాయ్ తన ఇద్దరు సహచరులతో కలిసి బార్మాన్స్ ఇంట్లోకి ప్రవేశించి పదునైన ఆయుధాలతో కుటుంబంపై దాడి చేశాడు. కుటుంబ సభ్యుల కేకలు విన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై.. సహాయక చర్యలు చేపట్టి రాయ్‌ను పట్టుకున్నారు. తరువాత, రాయ్, అతని ఇద్దరు సహచరులను సీతాల్‌కుచి పోలీసులు అరెస్టు చేశారు,
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నీలిమ, బిమల్, వారి కుమార్తెలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి సబ్-డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ దంపతులు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు పోలీసులు తెలిపారు. తర్వాత రూనాను కూచ్ బెహార్‌లోని ఎంజేఎన్ ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు ప్రకటించారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.