- Home
- National
- జేఈఈ అడ్వాన్స్ డ్ లో తెలుగు విద్యార్థులే టాప్... మొదటి పది ర్యాంకుల్లో ఆరుగురు వాళ్లే...
జేఈఈ అడ్వాన్స్ డ్ లో తెలుగు విద్యార్థులే టాప్... మొదటి పది ర్యాంకుల్లో ఆరుగురు వాళ్లే...
జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు ఢంకా బజాయించారు. మొదటి పది ర్యాంకుల్లో మొదటి ర్యాంకుతో పాటు ఆరుగురు ర్యాంకులు కైవసం చేసుకుని సత్తా చాటారు.

హైదరాబాద్ : తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఈఈ అడ్వాన్స్ ర్యాంకుల్లో ఏకంగా తొలి పదిలో ఆరింటిని సొంతం చేసుకున్నారు. మొదటి రెండు ర్యాంకులతో పాటు.. ఈ ఆరు ర్యాంకులు ఉన్నాయి. వీటన్నిటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులు దక్కించుకున్నారు. ఈ ర్యాంకులు సాధించిన తెలుగువారిలో నలుగురు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు కాగా ఇతరులు తెలంగాణకు చెందిన విద్యార్థులు ఉన్నారు.
హైదరాబాదులో చదువుకున్న నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన వావిలాల చిద్విలాస్ రెడ్డి అడ్వాన్సుడ్ పరీక్షల్లో 360 మార్కులకు గాను 341 మార్కులు సాధించాడు. దీంతో జాతీయస్థాయిలో ఫస్ట్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన రమేష్ సూర్య తేజ రెండో ర్యాంకు దక్కించుకున్నాడు.
ఆ తర్వాత తెలుగు విద్యార్థులు వరుసగా 5వ ర్యాంకులో ఏపీకి చెందిన అడ్డగడ వెంకటశివరామ్, అభినవ్ చౌదరి, తెలంగాణకు చెందిన నాగిరెడ్డి బాలాజీ రెడ్డి తొమ్మిదవ ర్యాంకు సాధించగా.. ఏపీకి చెందిన యక్కంటి ఫణి వెంకట మణిందర్ రెడ్డి పదవ ర్యాంకు సొంతం చేసుకున్నాడు.
బాలికల విభాగంలో కూడా వైఎస్ఆర్ జిల్లా అమ్మాయి నయకంటి నాగభవ్యశ్రీ 298 మార్కులు సాధించి దేశంలో ఫస్ట్ ర్యాంక్ గా నిలిచింది. జనరల్ కేటగిరిలో ఆమె 56 వ ర్యాంకు సొంతం చేసుకుంది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఈ నెల నాలుగవ తేదీన జరిగింది. వీటి ఫలితాలను ఐఐటి గువాహటి ఆదివారం విడుదల చేసింది.
ఈ ఫలితాల్లో ర్యాంకు టాప్ 100 ర్యాంకులు సాధించిన వారిలో 40 మంది ఐఐటి హైదరాబాద్ జోన్ ( తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ) విద్యార్థులే ఉన్నారని తెలిపింది. ఈ 40 మందిలో 30 మంది తెలుగు వారే ఉండడం ఖాయమని నిపుణులు అంటున్నారు. ఈసారి జేఈఈ మెయిన్లో కనీస మార్కులు సాధించి ఉత్తీర్ణులైన 2.52 లక్షల మందిలో అడ్వాన్సుడ్ రాసేందుకు 1,89,744 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారిలో 1,80,372 మంది పరీక్ష రాశారు.
వీరిలో కూడా కటాఫ్ మార్కుల ఆధారంగా 43,773మందికి జోసా కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు అర్హత కల్పించారు. ఈ కౌన్సిలింగ్లో పాల్గొన్న వారు మాత్రమే ఐఐటీల్లో సీట్లు పొందేందుకు అర్హులవుతారు. ఇందులో 36వేల 254 మంది అబ్బాయిలు ఉండగా.. 7509 మంది అమ్మాయిలు ఉన్నారు. నిరుడు ఐఐటీలో 16,598, ఎన్ఐటీల్లో 23వేల 994 సీట్లు ఉన్నాయి. ఈ 43వేల మందిలో దాదాపు 7వేల మంది వరకు తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నట్టు అంచనా.
టాప్ 200 ర్యాంకుల్లో 75 మంది, 300 లోపు 121 మంది, 400 లోపు 149 మంది, 500 రూపు ర్యాంకులలో 174 మంది ఐఐటి హైదరాబాద్ చెందినవారే ఉన్నారని సమాచారం. ఈ లెక్క ప్రకారం 500లోపు ర్యాంకులలో ఉన్న 35% మంది ఐఐటి హైదరాబాద్ జోన్ కు చెందిన వారే. వీరిలో కనీసం 125 మంది తెలంగాణ, ఏపీకి చెందిన వారే ఉంటారని చెబుతున్నారు. జేఈఈ మెయిన్ లో ఫస్ట్ ర్యాంకు సాధించిన హైదరాబాద్ కు చెందిన వెంకట కౌండిన్య అడ్వాన్సుల్లో 84వ ర్యాంకుకు పరిమితమయ్యాడు.
సాయి దుర్గారెడ్డి మెయిన్లో ఆరవ ర్యాంకు సాధించగా అడ్వాన్సులో 35వ ర్యాంకు సాధించాడు. మెయిన్ లో తొలి 10 ర్యాంకుల్లో ఉన్న మిగతా విద్యార్థులు అడ్వాన్సులో 100వలోపు కనిపించలేదు. ఇప్పుడు అడ్వాన్సుడ్ లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన వావిలాల చిద్విలాస్ రెడ్డి మెయిన్ లో 15వ ర్యాంకు సాధించాడు.
వావిలాల చిద్విలాస్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఎనిమిదవ తరగతి నుంచి జేఈఈ సాధించాలనేది లక్ష్యంగా ఉందన్నాడు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులందరికీ సాఫ్ట్వేర్ విద్యను అందుబాటులోకి తేవాలనేదే తన లక్ష్యమని చెప్పాడు. ప్రణాళిక ప్రకారం చదివితే లక్ష్యం నెరవేరుతుందని సూచించాడు.